Curd: పెరుగుతో తయారుచేసే వేసవి పానీయాలు ఇవిగో, వీటిని తాగితే శరీరానికి ఎంతో చలువ-here are summer drinks made with curd which are very beneficial for the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd: పెరుగుతో తయారుచేసే వేసవి పానీయాలు ఇవిగో, వీటిని తాగితే శరీరానికి ఎంతో చలువ

Curd: పెరుగుతో తయారుచేసే వేసవి పానీయాలు ఇవిగో, వీటిని తాగితే శరీరానికి ఎంతో చలువ

Haritha Chappa HT Telugu
Apr 24, 2024 11:30 AM IST

Curd: మండే ఎండల్లో చల్ల చల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది. అలా అని కూల్ డ్రింకులు తాగితే ఆరోగ్యానికి ముప్పే. పెరుగుతో ఆరోగ్యకరంగా వేసవి పానీయాలను తయారుచేసుకొని తాగండి.

పెరుగుతో ఆరోగ్యం
పెరుగుతో ఆరోగ్యం (Pixabay)

Curd: పెరుగుతో చేసే పానీయాలు అనగానే అందరికీ మజ్జిగే గుర్తుకొస్తుంది. పెరుగుతో అనేక రకాల వేసవి పానీయాలను ప్రయత్నించవచ్చు. ఇది చాలా రుచిగా కూడా ఉంటాయి. వేసవిలో శరీరానికి చలువ చేసే డ్రింకులను తాగడం చాలా అవసరం. ఇక్కడ మేము కొన్ని వేసవి పానీయాలను ఇచ్చాము. ఇవన్నీ కూడా పెరుగుతోనే తయారుచేస్తారు. కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అలాగే శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.

పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ పెరుగుతో తయారు చేసిన సమ్మర్ డ్రింక్స్‌ను తాగడం వల్ల ఆరోగ్యం మొత్తానికి మేలే జరుగుతుంది. అంతేకాదు తెలుగులో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి మన పొట్ట ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలు తినాలి. వేడి వాతావరణంలో పెరుగుతో చేసిన ఈ పానీయాలను తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే చెమట ద్వారా బయటికి పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి శరీరానికి అందించవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులువు.

లస్సీ

లస్సీని తయారు చేయడం ఎంత సులువో చెప్పక్కర్లేదు. పెరుగును బాగా గిలకొట్టి నీరు వేయాలి. నీటిలో చిటికెడు యాలకుల పొడి, కాస్త కుంకుమ పువ్వు, ఒక స్పూను పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అంతే లస్సీ రెడీ అయినట్టే. మీకు కొత్తగా రుచి కావాలంటే మామిడిపండ్ల జ్యూస్ ని కూడా అందులో కలుపుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

పుదీనా మజ్జిగ

మజ్జిగను చల్లగా తాగితే ఎంతటి వేడినైనా తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. పెరుగును బాగా గిలకొట్టి నీళ్లు వేసి మజ్జిగలా చేసుకోవాలి. అందులో అరస్పూన్ ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోవాలి. తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది.

స్మూతీ

పెరుగును ఒక కప్పులో వేయాలి. ఆ కప్పులో తేనె లేదా బెల్లం తురుమును వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన బెర్రీ పండ్లు, అరటి పండ్లు, పైనాపిల్ ముక్కలు వేసుకొని దాన్ని తింటే టేస్టీగా ఉంటుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసి మెత్తగా స్మూతీగా మార్చుకొని తిన్నా కూడా రుచిగా ఉంటుంది.

మ్యాంగో లస్సీ

మామిడి పండ్లు వేసవిలో అధికంగా దొరుకుతాయి. దీనితో మ్యాంగో లస్సీ తయారు చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. పెరుగును ఒక కప్పులో వేయండి. మామిడికాయ గుజ్జును తీసి ఆ పెరుగులో బాగా కలపండి. అలాగే మరిగించిన పాలను వేయండి. యాలకుల పొడి, పావు స్పూను పంచదార వేసి బాగా కలుపుకోండి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి కాసేపు చల్లగా అయ్యాక తినండి. ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది.

పుచ్చకాయ పెరుగు స్మూతీ

వేసవిలో శరీరానికి నీటిని అందించే మరొక అద్భుత ఔషధం పుచ్చకాయ. పెరుగును ఒక కప్పులో వేసి, పుచ్చకాయను చేత్తోనే సన్నగా నలిపి పెరుగులో వేసి బాగా కలపండి. పైన చియా గింజలను చల్లండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఫ్రిజ్లో పెట్టండి. అది కాస్త చల్లగా అయ్యాక అప్పుడు తీసి తినండి. ఈ స్మూతీ మీకు బాగా నచ్చుతుంది.

పెరుగు బనానా షేక్

బాగా పండిన అరటిపండును దీని కోసం తీసుకోవాలి. ఒక బౌల్లో పెరుగును వేసి బాగా కలపండి. అందులో అరటిపండు గుజ్జును వేసి కలపండి. అలాగే తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపండి. పైన వెనిల్లా ఐస్ క్రీమ్ ను ఒక స్కూప్ వేయండి. అంతే టేస్టీ బనానా షేక్ రెడీ అయినట్టే. ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. వేసవిలో ఈ పానీయాలను తాగడం అలవాటు చేసుకుంటే వడదెబ్బ తగిలే అవకాశం చాలా తగ్గుతుంది.

Whats_app_banner