Sugar in Baby Food: సెరెలాక్ వంటి బేబీ ఫుడ్స్‌లో పంచదార, నెలల వయసున్న పిల్లలు చక్కెర తింటే ఏమవుతుంది?-sugar in baby food sugar in baby foods what happens if babies eat sugar ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sugar In Baby Food: సెరెలాక్ వంటి బేబీ ఫుడ్స్‌లో పంచదార, నెలల వయసున్న పిల్లలు చక్కెర తింటే ఏమవుతుంది?

Sugar in Baby Food: సెరెలాక్ వంటి బేబీ ఫుడ్స్‌లో పంచదార, నెలల వయసున్న పిల్లలు చక్కెర తింటే ఏమవుతుంది?

Haritha Chappa HT Telugu
Published Apr 19, 2024 05:29 PM IST

శిశువుల ఆహారంలో చక్కెరను కలపడం నిషిద్ధం. నెలల వయసున్న పిల్లలకు చక్కెర నిండిన ఆహారాన్ని పెట్టడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది వారి ఆరోగ్యాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

బేబీ ఫుడ్స్ లో పంచదార
బేబీ ఫుడ్స్ లో పంచదార (Freepik)

ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలోని దేశాల్లో విక్రయించే తమ బేబీ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చక్కెరను కలుపుతున్నట్లు స్విస్ ఇన్వెస్టిగేటివ్ ఆర్గనైజేషన్ పబ్లిక్ ఐ నివేదిక బయటపెట్టింది. ఆ నివేదిక విడుదల చేసిన తర్వాత భారత ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నెస్లే ఇండియాపై విచారణ ప్రారంభించింది. ఆ సంస్థ తప్పు చేసినట్లు తేలితే నెస్లే ఇండియాపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సెరిలాక్, పాల పొడి వంటి వాటిలో నెస్లే చక్కెరను జోడించి అమ్ముతున్నట్టు తేలింది.

బేబీ ఫుడ్ ‘సెరెలాక్’ లో చక్కెరను జోడించి అమ్ముతున్నట్టు ఆ నివేదిక బయటపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, శిశువులకు చక్కెర పెట్టకూడదు. చక్కెర శిశువులలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వారు డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతారు.

నవజాత శిశువుకు చక్కెర ఇస్తే…

చక్కెరను శిశువులకు తినిపించడం చాలా ప్రమాదకరం . శిశువుల ఆహారంలో చక్కెరను కలపడం సురక్షితం కాదు, ఎందుకంటే ఇది వారి అంతర్గత వ్యవస్థలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది . వీటిలో కొన్ని వారిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఉదాహరణకు, చక్కెరకు గురైన శిశువులలో దంత క్షయం ప్రారంభమవుతుంది. నెలల వయసు నుంచే చక్కెర తీసుకోవడం వల్ల వారు అధిక బరువు, ఊబకాయం బారిన పడతారు. నెలల వయసున్న పిల్లలకు అధిక చక్కెర అలవాటు చేస్తే వారిలోఆకలి పెరుగుతుంది. అలాగే వారిలో చిన్న వయసులోనే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

శిశువులలో చక్కెర వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు

1. బరువు పెరగడం

అధిక చక్కెర తీసుకోవడం నవజాత శిశువులలో వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. బాల్యంలోనే వారు స్థూలకాయం బారిన పడతారు. అలాగే శిశువుల్లో విపరీతమైన ఆకలిని పెంచుతుంది. ఇది చెడు ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది. వారు పెద్దయ్యాక అతిగా తినడం వంటివి చేస్తారు.

2. బ్లడ్ షుగర్ సమస్యలు

నవజాత శిశువుల్లో రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు గురవుతారు. వారి ఆహారంలో అదనపు చక్కెరను జోడించడం వల్ల చిన్న వయసులోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, తరువాత వేగంగా పడిపోతాయి. ఈ తగ్గుదల హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. నవజాత శిశువులలో హైపోగ్లైసీమియా వల్ల వణుకు, పేలవమైన ఆహారం, బద్ధకం మూర్ఛలు వంటి లక్షణాలకు దారితీస్తుంది.

3. జీర్ణసమస్యలు

శిశువు ఆహారంలో చక్కెర జోడించడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూలంగా ప్రభావం పడుతుంది. విరేచనాలు, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి జీర్ణశయాంతర సమస్యలు కలుగుతాయి. ఇది పొట్టలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది.

4. జీవక్రియపై ప్రభావం

చిన్నతనంలోనే అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆహారపు అలవాట్లు మారిపోతాయి. చక్కెర అలవాటు పడిన పిల్లలు పెద్దయ్యాక కూడా తీపి రుచికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇది తరువాత జీవితంలో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు వంటి ఇతర జీవక్రియ సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

5. దంత ఆరోగ్య సమస్యలు

చిన్న వయస్సులోనే చక్కెర తినడం వల్లదంత కుహరాలు, దంత క్షయం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెరలు నోటిలోని బ్యాక్టీరియాను పెంచుతాయి.

6. అలెర్జీ

చక్కెర పదార్థాలను తినడం వల్ల భవిష్యత్తులో అలెర్జీలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. శిశువు ఆహారంలో చక్కెర అవసరం లేదు.

Whats_app_banner