Reducing risk of cancer: క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 5 మార్గాలు ఇవే-here are 5 simple lifestyle changes to lower risk of cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Reducing Risk Of Cancer: క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 5 మార్గాలు ఇవే

Reducing risk of cancer: క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 5 మార్గాలు ఇవే

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 08:35 PM IST

Reducing risk of cancer: క్యాన్సర్ రాకుండా ఉండేందుకు చేయాల్సిన జీవనశైలి మార్పులను క్యాన్సర్ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ 5 నియమాలు ఇక్కడ చూడండి.

క్యాన్సర్ నివారణకు 5 జీవనశైలి మార్గాలు
క్యాన్సర్ నివారణకు 5 జీవనశైలి మార్గాలు (Pixabay)

ప్రపంచవ్యాప్తంగా చావులకు క్యాన్సర్ ప్రధాన కారణంగా నిలుస్తోంది. పైగా ఏటా క్యాన్సర్ వల్ల మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2040 నాటికి ఏటా క్యాన్సర్ కేసుల సంఖ్య 2.94 కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే ఏటా క్యాన్సర్ మరణాల సంఖ్య 1.64 కోట్లకు చేరుతుందని అంచనా. క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో ఇటీవలికాలంలో పురోగతి కనిపిస్తున్నా.. క్యాన్సర్ నివారణకు మాత్రం కచ్చితమైన మార్గం ఏదీ లేదు. పర్యావరణం, వంశపారంపర్యంగా క్యాన్సర్ సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే క్యాన్సర్ కేసుల్లో 5 నుంచి 10 శాతం మాత్రమే జన్యుపరమైన లోపాల వల్ల వస్తున్నాయని, మిగిలినవన్నీ పర్యావరణ, జీవనశైలి సంబంధిత క్యాన్సర్లేనని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసినెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది.

స్మోకింగ్, డైట్ (ఫ్రైడ్ ఫుడ్, మాంసం), మద్యపానం, అతిగా సూర్యరశ్మి తగలడం, పర్యావరణ కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, స్ట్రెస్, ఒబెసిటీ, శారీరకంగా చురుగ్గా లేకపోవడం వంటి అంశాలన్నీ క్యాన్సర్‌కు ముప్పు తెచ్చిపెట్టే కారకాలని అధ్యయనం తెలిపింది. ‘క్యాన్సర్ సంబంధిత మరణాల్లో దాదాపు 25 నుంచి 30 శాతం పొగాకు వల్ల వచ్చినవే. అలాగే 30 నుంచి 35 శాతం డైట్ కారణంగా సంభవించినవే. 15 నుంచి 20 శాతం వరకు ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చినవి. మిగిలినవి రేడియేషన్, స్ట్రెస్, శారీరకంగా చురుగ్గా లేకపోవడం, పర్యావరణ కాలుష్యం వంటి వాటి వల్ల సంభవించిన మరణాలే..’ అని సంబంధిత అధ్యయనం తెలిపింది.

ఫోర్టిస్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సర్జికల్ ఆంకాాలజీ విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ నాయక్ హెచ్‌టీ డిజిటల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత అంశాలపై వివరించారు. నిర్ధిష్టమైన జీవనశైలి మార్పులు చేసుకుంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని సూచించారు.

‘కొన్ని శతాబ్దాలుగా మానవాళి క్యాన్సర్ వ్యాధి వల్ల ప్రభావితమవుతోంది. క్యాన్సర్‌ను నిర్ధారించడం, చికిత్స చేయడం వంటి విషయాల్లో వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. అయితే క్యాన్సర్‌ను ఎదుర్కోవాలంటే అది రాకుండా చూసుకోవడమే ఇప్పటికీ మెరుగైన పద్ధతి. అయితే ఇందుకు కచ్చితమైన మార్గం ఏదీ లేదు. కొన్ని జీవనశైలి మార్పులు చేపడితే క్యాన్సర్ ముప్పును భారీగా తగ్గించుకోవచ్చు..’ అని డాక్టర్ నాయక్ వివరించారు. క్యాన్సర్ ముప్పు తగ్గించేందుకు గల 5 మార్గాలను ఆయన సూచించారు.

1. Maintain a healthy diet: ఆరోగ్యకరమైన డైట్ తీసుకోండి

క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే ఆరోగ్యకరమైన డైట్ మాత్రమే తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో తప్పనిసరిగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్‌ బాగా తగ్గించాలి. పండ్లు, కూరగాయల్లో వేర్వేరు విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడంట్లు ఉంటాయి. అవి క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్ క్యాన్సర్ రిస్క్ పెంచుతాయి. ఇక క్రూసీఫెరోస్ కూరగాయల జాతికి చెందిన బ్రోకలీ, కాలిఫ్లవర్ వంటివి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కలిగి ఉంటాయి.

2. Exercise regularly: క్రమంతప్పకుండా వ్యాయామం

క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే శారీరకంగా చురుగ్గా ఉండాలి. బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ సహా పలు క్యాన్సర్ల ముప్పును వ్యాయామం తగ్గిస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు సరిపోతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గడం మాత్రమే కాకుండా, పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు.

3. Avoid tobacco use: పొగాకు వినియోగం ఆపేయండి

పొగాకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతోంది. సగం క్యాన్సర్ మరణాలకు కారణం పొగాకు వినియోగమే. స్మోకింగ్ మానేయడం క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు తోడు బ్లాడర్, పాంక్రియాస్, థ్రోట్ క్యాన్సర్లకూ స్మోకింగ్ కారణమవుతోందని గుర్తించండి.

4. Limit alcohol consumption: మద్యం పరిమితం చేయాలి

అధిక మొత్తంలో మద్యం వినియోగం బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ సహా పలు క్యాన్సర్లకు దారితీస్తుంది. అందువల్ల ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. మహిళలైతే రోజుకొక డ్రింక్, పురుషులైతే రోజుకు రెండు డ్రింక్స్ కంటే మించరాదు. మితిమీరిన మద్యపానం వల్ల క్యాన్సర్లు మాత్రమే కాకుండా లివర్ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చిపడతాయి.

5. Protect yourself from the sun: సూర్యుడి నుంచి రక్షణ

స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సూర్యుడి నుంచి రక్షణ అవసరం. ఎస్‌పీఎఫ్ 30 గల సన్‌స్క్రీన్ వాడాలి. చర్మాన్ని దుస్తులతో కవర్ చేసుకోవాలి. మిట్టమధ్యాహ్నపు ఎండలో ఎక్కవ సేపు కూర్చోరాదు. చర్మంపై ఏవైనా అనుమానించదగిన పుట్టుమచ్చలు కనిపిస్తే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి..

‘గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ మీకు ఎప్పటికీ రాదని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఏ ఒక్క చర్యా దానిని నివారించలేదు. అయితే ఈ జీవన శైలి మార్పుల వల్ల మీ శరీరం మెరుగ్గా తన విధులు నిర్వర్తిస్తుంది. అలాగే క్యాన్సర్ సంకేతాలు ఏవైనా కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవడం మంచిది. క్యాన్సర్లను త్వరితగతిన గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు..’ అని డాక్టర్ నాయక్ సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం