70 Hours Work Problems : వారానికి 70 గంటలు పని చేస్తే ఏమవుతుంది? సింపుల్ వివరణ
70 Hours Work Problems : వారానికి 70 గంటలు పనిచేయాలని తన ఆలోచన చెప్పారు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి. అయితే ఆచరణలో సాధ్యమేనా? ఎలాంటి సమస్యలు వస్తాయి?
నాలుగైదు రోజుల నుంచి ఓ విషయంపై సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి వారానికి 70 గంటలు పని చేసే విషయంపై కామెంట్స్ చేశారు. దీనిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణలు చెబుతున్నారు. మన చేతులతో మనమే ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమేనని అంటున్నారు.
దేశ ప్రగతి కోసం 70 గంటలు పని చేయాలని నారాయణమూర్తి సూచించారు. ఒక దేశ సంపద కేవలం సాంకేతికత మాత్రమే కాదు, పౌరులు కూడా అని చెప్పారు. అయితే మనిషి ఆరోగ్యంగా ఉంటే మరింతగా శ్రమించి ఆర్థికంగా అభివృద్ధి చెందగలడని, 70 గంటలు పనిచేయడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక సింపుల్ ఉదాహరణ ఏంటంటే..
రోజులో 24 గంటలు
6 రోజులు వారంలో 12 గంటలు పనిదినం
12 గంటలు
ఇక మిగిలింది 12 గంటలు
అందులో 8 గంటల నిద్ర
ముఖ్య నగరాల్లో 2 గంటలు ట్రాఫిక్‍లోనే..
ఆఫీసుకు రెడీ అయ్యేందుకు 2 గంటలు
ఈ లెక్కన చూస్తే.. ఒక మనిషి 24 గంటల్లో కేవలం నిద్రపోవడం మాత్రమే తన కోసం చేసే పరిస్థితి. మిగతా సమయం అంతా.. ఆఫీసుకు సంబంధించిన దానిలోనే ఉంటాడు. దీంతో సమాజంలో కలిసేందుకు ఛాన్స్ ఉండదు. స్నేహితులతో మాట్లాడేందుకు సమయం ఉండదు. మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
అన్ని గంటలు పని చేస్తే.. కుటుంబంతో సమయం లేదు, వ్యాయామం చేయడానికి టైమ్ ఉండదు. వినోదం అస్సలే ఆశించొద్దు. అయితే కంపెనీ పని గంటల తర్వాత అయినా వదిలిపెడుతుందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఆఫీస్ పని అయిన తర్వాత ఇమెయిల్‌లు, కాల్‌ల ద్వారా ఉద్యోగికి ఎప్పటికప్పుడు ఏదో ఒక పనిపెడుతూనే ఉంటుంది.
నారాయణ మూర్తి మూర్తి అడిగిన ప్రశ్నకు చాలా మంది ఇతర CEOలు మద్దతు ఇచ్చినప్పటికీ, సైన్స్ అతని వాదనకు మద్దతు ఇవ్వలేదు. వారానికి 50 గంటల పని చేస్తేనే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి 70 గంటలు పని చేయడం సాధ్యమే అయినప్పటికీ, ఇది వ్యక్తి ఆరోగ్యం, శ్రేయస్సు, పని-జీవిత సమతుల్యతపై గణనీయమైన ప్రభావాలను కలిగిస్తుంది.
ఎక్కువసేపు పని చేయడం వల్ల బర్న్‌అవుట్, ఉద్యోగ సంతృప్తి తగ్గడం, పని-జీవిత సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. శారీరక, మానసిక అలసటకు దారి తీయవచ్చు. కుటుంబ సమయం తగ్గుతుంది. శరీరం సహజ పునరుద్ధరణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది
ప్రజలు ఫాస్ట్ ఫుడ్ అలవాటు పడతారు. సక్రమంగా భోజనం చేయరు. ఊబకాయం వస్తుంది.
ఎక్కువసేపు కూర్చొని ఉంటే.. కండరాల సమస్యలు వస్తాయి. వ్యాయామం కోసం తక్కువ సమయం కేటాయిస్తారు.
ఒత్తిడి స్థాయిలు పెరగడం, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
భావోద్వేగ అలసట, నిర్లిప్తత, నిద్ర ఆటంకాలు వస్తాయి.
మనమందరం మన ఆనందం కోసం, జీవితం కోసం పని చేస్తాం. అయితే పనే జీవితం అయితే మాత్రం అనేక సమస్యలు వస్తాయి. మనిషి బతకడం కోసం తినాలి, తినడం కోసమే బతకకూడదు. అలాగే జీవితంలో భాగంగా పని చేయాలి, పనే జీవితం కాకూడదు.