Chia seeds water: పరిగడుపున చియాగింజల నీళ్లు తాగితే.. బోలెడు ప్రయోజనాలు..-health benefits of drinking chia seeds soaked water on empty stomach ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chia Seeds Water: పరిగడుపున చియాగింజల నీళ్లు తాగితే.. బోలెడు ప్రయోజనాలు..

Chia seeds water: పరిగడుపున చియాగింజల నీళ్లు తాగితే.. బోలెడు ప్రయోజనాలు..

HT Telugu Desk HT Telugu
Sep 11, 2023 01:30 PM IST

Chia seeds water: ఉదయాన్నే పరిగడుపున చియా గింజలు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. దానివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకోండి.

చియా గింజల నీళ్ల వల్ల ప్రయోజనాలు
చియా గింజల నీళ్ల వల్ల ప్రయోజనాలు (pexels)

ఉదయం పరిగడుపున మనం తీసుకునే ఆహారం ప్రభావం ఆరోగ్యం మీద చాలా ఉంటుంది. రోజు మొత్తం ఉత్తేజంగా ఉండటానికి కూడా సాయం చేస్తుంది. అందుకే పరిగడుపున ఏం తినాలా వద్దా అనే విషయంలో చాలా ఆలోచన మొదలైంది. ఉదయాన్నే తేనె, తిమ్మరసం, గ్రీన్ టీ తాగడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. అయితే ఉదయాన్నే ఓ గ్లాసుడు చల్లని నీటిలో రెండు స్పూన్ల చియా సీడ్స్‌ వేసి నానబెట్టిన నీటిని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నారు. చాలా మంది సబ్జా గింజల్ని చియా సీడ్స్‌ని ఒకటే అని అనుకుంటారు. రంగులో, రూపంలో, ఆరోగ్య ప్రయోజనాల విషయంలో ఇవీ, సబ్జా గింజలు వేరుగా ఉంటాయి. తెలుపు, బూడిద రంగులో చిన్నగా ఉండే గింజలే చియా సీడ్స్‌.

చియా సీడ్స్‌లో ఉండే పోషకాలివే :

వీటిలో అధిక మోతాదులో పీచు పదార్థం ఉంటుంది. ప్రొటీన్లు, అన్‌ శ్యాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పాస్ఫరస్‌, జింక్‌, విటమిన్ బీలతో పాటు మరెన్నో సూక్ష్మ పోషకాలూ లభిస్తాయి.

ఎలా తీసుకోవాలి? :

ఓ గ్లాసుడు చల్లని నీటిలో రెండు స్పూన్ల చియా సీడ్స్‌ని వేయాలి. ఓ పది నిమిషాల పాటు వాటిని అలా వదిలేయాలి. అప్పుడు అవి వాటి అసలు పరిమాణం కంటే దాదాపు పది నుంచి పన్నెండు రెట్లు పెద్దవిగా ఉబ్బుతాయి. ఈ నీటిని ఉదయం పూట తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో సులువుగా శరీరానికి లభిస్తాయి.

చియా గింజల నీటి వల్ల ప్రయోజనాలు :

  • ఈ విత్తనాల్లో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. అది అధిక రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది.
  • దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇది శరీర అంతర్గత అవయవాల్లో వచ్చే వాపుల్ని నివారిస్తుంది.
  • దీనిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి.
  • బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలు కోసం సహకరిస్తాయి. దీనిలో ఉంటే ఆల్ఫా లినోలెనిక్‌ యాసిడ్‌ (ఏఎల్‌ఏ) అనే ఫ్యాటీ యాసిడ్ ఇందుకు సహాయపడుతుంది.
  • ఈ నీటిని ఉదయం పూట తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. చర్మం చికాగుగా, దురదగా అనిపించడం లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
  • దీనిలో అధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. ఎక్కువగా తినడం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇలా సాయపడుతాయి.
  • కణాలు దెబ్బతినడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో ఈ గింజల్లో ఉండే సమ్మేళనాలు పోరాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఈ గింజలు అరికడతాయి.

Whats_app_banner