Snake Fruit: పాము చర్మంలాంటి పండును చూశారా? దీన్ని ఎప్పుడైనా మీరు తిన్నారా?-have you ever seen a snake skin fruit have you ever eaten it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Snake Fruit: పాము చర్మంలాంటి పండును చూశారా? దీన్ని ఎప్పుడైనా మీరు తిన్నారా?

Snake Fruit: పాము చర్మంలాంటి పండును చూశారా? దీన్ని ఎప్పుడైనా మీరు తిన్నారా?

Haritha Chappa HT Telugu
May 05, 2024 09:30 AM IST

Snake Fruit: ఎన్నో పండ్లను మీరు చూసుంటారు, తినుంటారు.కానీ ఈ వెరైటీ పండును తిని ఉండరు. చూడగానే పామును గుర్తు చేస్తుంది ఈ పండు. దీని పేరు స్నేక్ ఫ్రూట్.

స్నేక్ ఫ్రూట్
స్నేక్ ఫ్రూట్

Snake Fruit: ప్రకృతిలో ఎన్నో రకాల ఉత్పత్తులు ఉంటాయి. వాటిల్లో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈ పాము చర్మం ఉన్న పండు ఒకటి ఉంది. అదే స్నేక్ స్కిన్ ఫ్రూట్. దీని రూపం చాలా విలక్షణంగా ఉంటుంది. రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పండును హఠాత్తుగా చూస్తే పాము చర్మం గుర్తుకు వస్తుంది. చూడగానే తినాలనిపించదు. పాము పొలుసులను పోలి ఉండేలా ఎరుపు, గోధుమ రంగు తొక్కను ఇది కలిగి ఉంటుంది. లోపల మాత్రం రసాలు ఊరే తీపి గుజ్జును కలిగి ఉంటుంది.

ఈ పండు ఎక్కడ దొరుకుతుంది?

ఈ పండు ఎక్కడపడితే అక్కడ దొరకదు. ఇండోనేషియాలోని జావా, సుమత్రా, బాలి వంటి ప్రాంతాలలో అధికంగా పండుతుంది. అక్కడినుంచి మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా ఈ చెట్లను పండించడం మొదలుపెట్టారు. దీని ఆకృతి భిన్నంగా ఉంటుంది. కాబట్టి చాలామంది అదేంటో తెలుసుకునేందుకే ఎక్కువగా కొంటూ ఉంటారు.

రుచి ఎలా ఉంటుంది?

ఈ స్నేక్ ఫ్రూట్ రుచి ఆపిల్, పైనాపిల్ రుచుల మిశ్రమంలా ఉంటుంది. సలాడ్లు, డిజర్టులు వంటి తయారీలో దీన్ని వాడతారు. పండు బయటికి ఎలా కనిపిస్తున్నా, లోపల గుజ్జు మాత్రం తినాలనిపించేలా ఉంటుంది. అలాగే ఈ పండులో పోషకాలు కూడా ఎక్కువే. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి.

పండును తినడం వల్ల మన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో బీటాకేరాటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళకు ఎంతో అవసరం. అలాగే ఈ పండ్లలో ఫ్లావనాయిడ్లు అధికంగా ఉంటాయి. విరేచనాలను ఇది నయం చేస్తుంది. యాంటీ డయేరియా లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. పొట్ట సమస్యలను నయం చేస్తుంది.

ఈ పండులో పెప్టిన్, పొటాషియం అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అభిజ్ఞా పని తీరును మెరుగుపరుస్తుంది. పిల్లలకు ఈ పండును పెడితే వారు చదివింది ఎక్కువ కాలంపాటు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది.

ఈ పండులో క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు... కణజాలాలకు నష్టం కలగకుండా పోరాడుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఈ పండు ఎంతో మేలు చేస్తుంది.

Whats_app_banner