BP: బీపీ చెక్ చేసేటప్పుడు చేయి ఇలా పెడితే.. బీపీ లేకున్నా ఉన్నట్లే రావచ్చు-hand position may effect blood pressure reading know what this study says ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bp: బీపీ చెక్ చేసేటప్పుడు చేయి ఇలా పెడితే.. బీపీ లేకున్నా ఉన్నట్లే రావచ్చు

BP: బీపీ చెక్ చేసేటప్పుడు చేయి ఇలా పెడితే.. బీపీ లేకున్నా ఉన్నట్లే రావచ్చు

Koutik Pranaya Sree HT Telugu
Oct 15, 2024 05:30 PM IST

Blood Pressure: బీపీ చెక్ చేసేటప్పుడు మరో చేయి ఉంచే స్థానం రక్తపోటు రీడింగులను ఎలా ప్రభావితం చేస్తుందో కొత్త అధ్యయనం చెబుతోంది. అలా కాకుండా చేయి ఉంచాల్సిన సరైన స్థితి ఏంటో తెల్సుకోండి.

బీపీ చెక్ చేసేటప్పుడు చేయకూడని తప్పులు
బీపీ చెక్ చేసేటప్పుడు చేయకూడని తప్పులు (Unsplash)

బీపీ చెక్ చేసేటప్పుడు మన చేతులను ఉంచే విధానం ఖచ్చితమైన ఫలితాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందట. చేయి స్థితికి, బీపీకి సంబంధం ఏంటీ అనుకోకండి. దాని ప్రభావం బీపీ రీడింగ్ మీద ఉంటుంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, డాక్టర్ టామీ బ్రాడీ ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో చేతులుంచిన స్థానం బీపీ ఫలితాలలో చాలా తేడాను చూపుతుందని తెలిపింది.

ఈ అధ్యయనం చేతిని ఒడిలో పెట్టుకున్నప్పుడు, లేదా ఏ సపోర్ట్ లేకుండా పక్కన ఉంచినప్పుడు ఫలితాలలో తేడాలను పరిశీలించింది. రక్తపోటు రీడింగులలో 10 పాయింట్ల వరకు తేడాలు వచ్చాయట. ఈ అధ్యయనం గణాంకాల ప్రకారం కనీసం 54 మిలియన్ల మందికి రక్తపోటు లేకున్నా కూడా ఈ తప్పు వల్ల ఉన్నట్లు నిర్ధారణ కావచ్చు. మరి చేతులు ఎలా పెడితే సరైన రీడింగ్ వస్తుందో తెలుసుకోవాల్సిందే కదా.

బీపీ చెక్ చేసేటప్పుడు చేయి ఎలా పెట్టాలి?

అధ్యయనం ప్రకారం బీపీ చెక్ చేసేటప్పుడు చేయి ఉంచడానికి సరైన స్థితి గుండె స్థాయిలో ఉండే టేబుల్ మీద చేయి పెట్టడం. అయినప్పటికీ చాలా ఆసుపత్రులు, క్లినిక్‌లలో ఈ సెటప్ ఉంచకపోవచ్చు. ఇది కష్టతరమైన విషయమే.

ఈ పరిశీలన కోసం 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 133 మంది పెద్దలపై ఈ అధ్యయనం చేశారు. పాల్గొనేవారిని వారి చేతులను వివిధ స్థానాలలో ఉంచమని కోరారు. వారి రక్తపోటు రీడింగులను తీసుకున్నారు. రోగి వారి ఒడిలో చేయి ఉంచినప్పుడు వారి సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు రీడింగులు నాలుగు పాయింట్లు అధికంగా వచ్చాయి.

చేతిని ఎలాంటి మద్దతు లేకుండా గాలిలో ఉంచినప్పుడు సిస్టోలిక్ రక్తపోటు రీడింగ్ సుమారు ఏడు పాయింట్లు, డయాస్టొలిక్ రక్తపోటు రీడింగ్ 4.4 పాయింట్లు అధికంగా వచ్చిందట. అధిక రక్తపోటుతో బాధపడే వ్యక్తుల బీపీ రీడింగులను తీసుకున్నప్పుడు.. ఎలాంటి మద్దతు లేకుండా చేతిని ఉంచిన వారిలో సిస్టోలిక్ రక్తపోటులో తొమ్మిది పాయింట్లు ఎక్కువగా వచ్చాయట.

చేయి స్థితితో మార్పు ఎందుకు?

బీపీ చెక్ చేసేటప్పుడు చేయిని ఒడిలో ఉంచడం లేదా పక్కకు సపోర్ట్ లేకుండా వేలాడదీస్తారు. అప్పుడు చేయి గుండె ఉండే స్థాయి కంటే కిందికి పడిపోతుంది. ఇది ధమనులలో గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒత్తిడి పెంచుతుంది. దాంతో ఆ ప్రభావం రక్త ప్రసరణ మీద పడుతుంది. దీంతో తాత్కాలికంగా రక్త పోటు పెరుగుతుంది. రక్తపోటు చెక్ చేయడానికి అవసరమైన కచ్చితత్వంతో కూడిన పద్ధతులు కూడా అవసరం అని ఈ పరిశోధన చెబుతోంది.

Whats_app_banner