Weaning: అన్నప్రాసన ఎన్ని నెలలకు చేయాలి? ఏం తినిపించాలి.. వైద్యుల సలహాలు తెల్సుకోండి..
చిన్నపిల్లలకు అన్నం తినిపించడం ఎప్పటినుంచి మొదలుపెట్టాలి? తల్లిపాల నుంచి ఇతర ఆహారాలు తినిపించడం మొదలు పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెల్సుకోండి.
పిల్లలకు తల్లిపాలు మాత్రమే పట్టించే దశ నుంచి ఇతర ఆహారాలు తినిపించడం మొదలు పెట్టాలంటే బోలెడు ప్రశ్నలు మనసులోకి వస్తాయి. సాధారణంగా ఆరు నెలలు నిండిన తర్వాత అన్నప్రాసన చేస్తారు. ఇది చిన్నారి ఎదుగుదలలో ఒక మైలురాయి లాంటిది. కొన్ని సార్లు తల్లికి ఉద్యోగానికి వెళ్లాల్సి రావడం, లేదా తల్లిపాలు సరిపోకపోవడం లాంటి కారణాల వల్ల నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో ఘన పదార్థాలు తినిపించడం మొదలుపెడుతున్నారు.
అయితే పిల్లలకు ఎప్పటినుంచి ఆహారం తినిపించడం మొదలు పెట్టాలి అనే నిర్ణయం పిల్లల స్థితి, తల్లిదండ్రులు, కుటుంబం నిర్ణయించుకోవాలి. అయితే పిల్లలు ఆహారం తినడానికి సిద్దంగా ఉన్నారా లేదా అని నిర్ణయించే కొన్ని విషయాలు కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ సంజు ఇలా వివరించారు..
పిల్లలు ఆహారం తినడానికి సిద్ధం అయ్యారని తెలిపే లక్షణాలు:
- పాప ఎలాంటి సపోర్ట్ అవసరం లేకుండా కూర్చుకుంటున్నప్పుడు, లేదంటే తలను సొంతంగా ఆపగలుగుతున్నప్పుడు..
- తల్లిపాలను ఉమ్మివేయకుండా సరిగ్గా మింగుతున్నప్పుడు
- తల్లిపాలు లేదా ఫార్ములా పాలు పడుతున్నప్పుడు ఆసక్తి చూపనప్పుడు, అలాగే పాలు తాగేటప్పుడు ఏడవడం, చికాగుగా చేస్తున్నప్పుడు
- ఇదివరకటిలా కాకుండా చాలా తక్కువ సేపు పాలు తాగుతున్నప్పుడు
- ఇంట్లో ఎవరైనా భోజనం చేస్తున్నప్పుడు ఆసక్తి చూపిస్తే లేదా వాళ్ల ప్లేట్లలో నుంచి ఆహారం తీసుకోడానికి ప్రయత్నిస్తే..
- వాళ్ల బొటన వేలు లేదా చేతివేళ్లను తరచూ నోట్లో పెట్టుకుంటే..
- చనుమొన నోట్లో పెట్టుకుని పాలు తాగకుండా.. కేవలం చప్పరిస్తున్నప్పుడు..
డాక్టర్ సంజు పిల్లలకు ఆహారం తినిపించే విషయంలో మరికొన్ని విషయాలు వివరంగా చెప్పారు..
సరైన వయసు ఏది:
ఎప్పుడెప్పుడు పిల్లలకు తినిపించడం మొదలెట్టేద్దామా అనే తొందర అక్కర్లేదు. దానివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆస్తమా, నీళ్ల విరేచనాలు అవ్వడం, మలబద్దకం, గ్యాస్, ఒబెసిటి, అలర్జీ రియాక్షన్లు.. ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. అందుకే సరైన వయసులోనే ఆహారం తినిపించడం మొదలుపెట్టాలి. దానికి సరైన వయసు ఆరు నెలలు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం వైద్యులు నాలుగో నెల నుంచి ఆహారం తినిపించమని సూచిస్తారు.
ఎక్కువ తినిపించాలని చూడొద్దు:
తినిపించడం మొదలు పెట్టిన వెంటనే వాళ్లకు ఎక్కువగా తినిపించేయాలని చూడొద్దు. వాళ్లు తినకపోతే గుచ్చి గుచ్చి తినిపించడం సరికాదు. వాళ్లకు తినడం అలవాటు చేయడం మీద మాత్రమే మీ దృష్టి ఉండాలి. ఎంత తినిపించాలనే దాని మీద కాదు. వాళ్లకు అలవాటు కాగానే క్రమంగా ఆసక్తి చూపిస్తారు. ఎక్కువగా తినిపించేస్తే వాంతులు చేయడం, లేదంటే మలబద్దకం సమస్యలు రావచ్చు.
ఇలాంటి ఆహారాలతో మొదలు పెట్టండి:
సోషల్ మీడియాలో చూసి ఏవేవో చేసి ఫ్యాన్సీగా తినిపించాలని చూడకండి. దానివల్ల జీర్ణ సంబంధిత సమస్యలొస్తాయి. నమలాల్సిన అవసరం లేకుండా, మామూలు రుచితో, అరగడానికి సులభమయ్యేవి తినిపించాలి. పండ్లను మెదిపి పెట్టడం, చిలగడ దుంప, యాపిల్, అరటిపండు, జావ, మెత్తగా ఉడికించి మెదిపిన అన్నం, పప్పు ఉడికించిన నీళ్లు… వీటితో పిల్లలకు ఆహారం అలవాటు చేయడం మొదలు పెట్టండి.
పాలు పట్టడం ఆపేయొచ్చా?:
ఆహారం తినిపించడం మొదలు పెట్టిన వెంటనే తల్లిపాలు ఆపడం అస్సలు సరికాదు. పిల్లలకు కాస్త సమయం అవసరం. మెల్లమెల్లగా పాలు పట్టడం తగ్గిస్తూ రండి. లేదంటే రోజు మొత్తం ఏమైనా తినిపిస్తూ రాత్రి పూట పాలు పట్టండి. దానివల్ల క్రమంగా ఆహారం తినడానికి అలవాటు పడతారు.
పిల్లలకు ఆహారం తినిపించడం మొదలు పెట్టిన వెంటనే కుటుంబ సభ్యులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తిన్నది అరుగుతుందా లేదంటే ఏమైనా ఎలర్జీ రియాక్షన్ లాంటివి వస్తుంటే చూడాలి. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే పిల్లల వైద్యుల్ని కలవాలి. వాళ్లకు నప్పే సరైన ఆహారం ఏంటో వాళ్లు సూచిస్తారు.