Ginger for Hair: అల్లం వంటకు మాత్రమే కాదు, ఇలా వాడారంటే జుట్టు రాలడం ఆగిపోతుంది
Ginger for Hair: ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలను జుట్టు రాలడాన్ని నివారించడానికి, ఎదుగుదలను పెంచడానికి ఉపయోగించవచ్చు.రోజూ వంటగదిలో ఉపయోగించే అల్లం జుట్టు ఆరోగ్యానికి మంచిది.అల్లం ఎలా ఉపయోగించాలో చూడండి.
జుట్టు రాలిపోవడం ఆధునిక కాలంలో ఎక్కువై పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం సవాలుగా మారింది. ఒకవైపు జుట్టు రాలడం, చుండ్రు పెరిగిపోవడం అధికమైపోతోంది. మరోవైపు జుట్టు పెంచాలనే ఆత్రుత కూడా అందరిలో ఉంటుంది. సాధారణంగా జుట్టు పెరుగుదలకు నేచురల్ రెమెడీస్ కోరుకునే వారు ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల, అల్లాన్ని జుట్టు సంరక్షణకు ఉపయోగించవచ్చు. చాలా వంటకాల్లో అల్లం అధికంగా వాడుతున్నారు. దీన్ని వాడడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించ వచ్చు. దీనిలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు వెంట్రుకల మూలాల నుండి జుట్టును బలోపేతం చేస్తాయి. నెత్తిమీద రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జుట్టు పెరుగుదలకు మార్కెట్లో అనేక నూనెలు, ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లోనే జుట్టు పెరగడానికి నేచురల్ పదార్థాలను ఉపయోగించవచ్చు.
అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నెత్తిమీద చికాకును దూరం చేస్తాయి. ఇది తల ఆరోగ్యాన్ని కాపాడటం ద్వారా చుండ్రు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దురదను తగ్గిస్తుంది. అల్లాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు మెరుపును పెంచుతుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్ నెత్తికి పోషణను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. కాబట్టి జుట్టు సంరక్షణ, పెరుగుదలకు అల్లంను ఉపయోగించే మార్గాలను చూద్దాం.
పచ్చి అల్లం జ్యూస్
పచ్చి అల్లం రసాన్ని నేరుగా నెత్తిమీద మసాజ్ చేయడం వల్ల చుండ్రు నుండి ఉపశమనం పొంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా మొత్తం నెత్తిమీద ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరగంట పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. తరచుగా అల్లం రసాన్ని ఉపయోగించడం వల్ల జుట్టు స్మూత్ గా పెరుగుతుంది. దీనివల్ల జుట్టు వెంట్రుకలకు మెరుపు, మృదుత్వం అందుతుంది.
ఏ నూనె వాడాలి?
అల్లంతో చేసే నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను పెంచుతుంది. పావు కప్పు కొబ్బరి నూనె, పావు కప్పు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే అల్లం నుంచి రసాన్ని తీయాలి. రెండు టీస్పూన్ల పచ్చి అల్లం రసం ఆ నూనెల్లో మిక్స్ చేయాలి. ఈ నూనె మిశ్రమాన్ని నెత్తిమీద మసాజ్ చేయండి.ఈ నూనెను తలపై కనీసం మూడు గంటల పాటు ఉంచండి. ఆ తర్వాత తలకు స్నానం చేయండి.
అల్లం హెయిర్ మాస్క్
అల్లంతో హెయిర్ మాస్క్ తయారుచేసుకుని వాడితే జుట్టు పెరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా హెయిర్ మాస్క్ చేయాలి. రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం, పావు కప్పు పెరుగు, ఒక టీస్పూన్ తేనె ఒక బౌల్ లో మిక్స్ చేయాలి. మందపాటి మిశ్రమాన్ని తలకు మందంగా అప్లై చేసి కనీసం 20 నిముషాలు అలాగే వదిలేయాలి. తరువాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇది జుట్టు మెరుపును పెంచుతుంది.
అల్లం తక్కువ ధరకే లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనితో జుట్టును కాపాడుకోవచ్చు. అల్లం నూనె, అల్లం హెయిర్ మాస్క్ వారానికోసారైనా అప్లై చేస్తూ ఉండండి.