Bay Leaf for Hair: బిర్యానీ ఆకులతో ఇలా చేశారంటే తలకు చుండ్రు పట్టదు, జుట్టు పొడవుగా పెరుగుతుంది-by doing this with biryani leaves the scalp will not get dandruff and the hair will grow longer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bay Leaf For Hair: బిర్యానీ ఆకులతో ఇలా చేశారంటే తలకు చుండ్రు పట్టదు, జుట్టు పొడవుగా పెరుగుతుంది

Bay Leaf for Hair: బిర్యానీ ఆకులతో ఇలా చేశారంటే తలకు చుండ్రు పట్టదు, జుట్టు పొడవుగా పెరుగుతుంది

Haritha Chappa HT Telugu
Jun 07, 2024 10:30 AM IST

Bay Leaf for Hair: గాలి కాలుష్యం వల్ల జుట్టుకు చుండ్రు పట్టడం సాధారణంగా మారిపోయింది. దురద వస్తుంది. పేలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. బిర్యానీ ఆకులతో చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చుండ్రును దూరం చేసుకోవచ్చు.

చుండ్రును పొగొట్టే చిట్కాలు
చుండ్రును పొగొట్టే చిట్కాలు (Pixabay)

Bay Leaf for Hair: చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంది. చుండ్రు అధికంగా ఉంటే జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువ. అలాగే దురద కూడా విపరీతంగా ఉంటుంది. ఆ చుండ్రు కణాలు చేతులు, భుజాలపై పడి దురదను కలుగచేస్తాయి. బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్ పై ఆ చుండ్రు కనిపిస్తే చూసేవారికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లోనే చుండ్రును పోగొట్టుకోవచ్చు. బిర్యానీ ఆకులను ఇందుకోసం వినియోగించుకోవాలి. రసాయనాలు కలిపిన మందులను వాడే కన్నా బిర్యానీ ఆకులతో ఇంట్లోనే చుండ్రును పోగొట్టే చిట్కా ఒకటి ఉంది.

చుండ్రును పొగొట్టుకోండిలా

బిర్యానీ ఆకులో ఔషధ గుణాలు ఎక్కువ. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి చుండ్రును పోగొట్టుకునేందుకు వినియోగించుకోవచ్చు. దీంతో హెయిర్ మాస్క్ ను తయారు చేసుకొని చుండ్రు సమస్యకు దూరం కావచ్చు. ఎవరైతే తలపై దురద, దద్దుర్లు, చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ బిర్యానీ ఆకులు మంచి పరిష్కారాన్ని చూపిస్తాయి. దీనికోసం బిర్యాని ఆకులు కొన్ని వేప ఆకులను కూడా తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేసి బిర్యానీ ఆకులను వేయాలి. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. అవి ఉడికాక చల్లార్చి ఆకులను తీసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులోనే వేప నూనె, ఒక టేబుల్ స్పూన్ వేప, నూనె ఒక స్పూన్, అలోవెరా జెల్ ఒక స్పూన్, ఉసిరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని తల పైన ఉన్న మాడుకు పట్టేలా రాయాలి. మెల్లగా వేళ్ళతోనే మసాజ్ చేయాలి. ఇలా పావుగంట సేపు వదిలేయాలి. తర్వాత తలకు షాంపూతో స్నానం చేసుకోవాలి.

వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. తల దురద పెట్టడం కూడా తగ్గుతుంది. బిర్యానీ ఆకులను నీటిలో ఉడకబెట్టి పేస్టులా చేసి దానిలో కొబ్బరి నూనె వేసి మాడుకు పట్టిస్తే చాలా మేలు జరుగుతుంది. దురదలు తగ్గడంతో పాటు తలపై ఉన్న ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి.

గిన్నెలో ఒక లీటర్ నీటిని వేసి అందులో పది బిర్యాని ఆకులను వేయాలి. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి నీరు సగానికి వచ్చేవరకు మరిగించుకోవాలి. అది గోరువెచ్చగా అయ్యాక ఆ నీటితో జుట్టును శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా మాడుకు తగిలేలా ఆ నీటిని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు కండిషనర్ పెట్టిన ఫలితం వస్తుంది. జుట్టు పట్టుకురుల్లా మెరుస్తుంది. చుండ్రు కూడా పోతుంది. ఇక్కడ చెప్పిన చిట్కాలను వారంలో రెండు మూడు సార్లు పాటించడం వల్ల చుండ్రు సమస్య, ఇతర జుట్టు సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు జుట్టు పొడవుగా పెరిగే అవకాశం ఉంటుంది.

Whats_app_banner