Shampooing: జుట్టుకు ప్రతిరోజూ షాంపూ చేస్తే మంచిదా? లేక వారానికి ఒకసారి చేసుకుంటే మంచిదా?-is it good to shampoo hair every day or is it better to do it once a week ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shampooing: జుట్టుకు ప్రతిరోజూ షాంపూ చేస్తే మంచిదా? లేక వారానికి ఒకసారి చేసుకుంటే మంచిదా?

Shampooing: జుట్టుకు ప్రతిరోజూ షాంపూ చేస్తే మంచిదా? లేక వారానికి ఒకసారి చేసుకుంటే మంచిదా?

Haritha Chappa HT Telugu
Mar 28, 2024 10:27 AM IST

Shampooing: ఎంతో మందికి ఈ సందేహం ఉంది. ప్రతిరోజూ జుట్టుకు షాంపూ చేయడం వల్ల లాభమా లేక వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తే మంచిదా అని? ప్రతిరోజూ తలస్నానం చేయకూడదనే భావన కూడా ఎక్కువమందిలో ఉంది.

షాంపూ ప్రతి రోజూ చేయాలా?
షాంపూ ప్రతి రోజూ చేయాలా? (pixabay)

Shampooing: ప్రతిరోజూ షాంపూ చేయాలా? లేక వారానికి ఒకసారి చేస్తే సరిపోతుందా? అనేది జుట్టు శైలిని బట్టి నిర్ణయించాలి. జుట్టు రకం, తలపై ఉండే మాడు కండిషన్, వారి లైఫ్ స్టైల్... వీటన్నిటి ఆధారంగా నిర్ణయించుకోవాలి. కొందరికి జిడ్డు చర్మం ఉంటుంది. అలాగే కొంతమంది కాలుష్యంలో ప్రతిరోజూ పనిచేయాల్సి వస్తుంది. అలాంటివారు ప్రతిరోజూ షాంపూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోజూ షాంపు చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుందన్నది నిజం. అంతేగా జుట్టు రిఫ్రెష్ గా కూడా ఉంటుంది. కాలుష్యం, ధూళి, చెమట వీటన్నింటినీ ప్రతిరోజూ తలకు స్నానం చేయడం వల్ల తొలగించుకోవచ్చు.

ఎవరు రోజూ షాంపూ చేయాలి?

ప్రతిరోజు విపరీతంగా శారీరక శ్రమ చేసేవారు, వేడి వాతావరణంలో పని చేసేవారు, తల పరిశుభ్రంగా ఉండాలని అనుకునేవారు, చుండ్రుతో బాధపడేవారు, దురదలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు షాంపూ చేయడం చాలా ముఖ్యం.

అయితే కొందరిలో ప్రతిరోజు షాంపూతో తలస్నానం చేయడం వల్ల కొన్ని లోపాలు రావచ్చు. ముఖ్యంగా పొడి చర్మంతో బాధపడేవారు, మాడు పొడిగా ఉన్న వారిలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొడిగా ఉండే మాడును కలిగిన వారు చాలా తక్కువగా సహజ నూనెలను తలపై కలిగి ఉంటారు. అలాంటి వారు ప్రతిరోజూ షాంపూ చేస్తే ఆ నూనెలన్నీ తొలగిపోతాయి. దీనివల్ల మరింతగా మాడు పొడిగా మారుతుంది. పెళుసుగా మారి వెంట్రుకలు పెరిగే అవకాశం తగ్గుతుంది. కాబట్టి పొడి చర్మం కలవారు ప్రతిరోజూ తక్కువ రసాయనాలు కలిగిన షాంపూలను వినియోగించడం మంచిది. లేదా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయడం ఉత్తమం.

రోజూ తలకు షాంపూ పెట్టాలా? వద్దా? అన్నది మీ జుట్టు రకాన్ని బట్టి మీ మాడు పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాలి. సల్ఫేట్ అధికంగా లేని షాంపూలను ప్రతిరోజూ వినియోగించవచ్చు. అలాగే కండిషన్ కచ్చితంగా చేయాలి. కండిషనింగ్ చేయడం వల్ల మాడు మాయిశ్చరైజింగ్ కు గురవుతుంది. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది.

మాడుపై సొరియాసిస్, తామర వంటి చర్మ పరిస్థితులు ఉన్నవారు తక్కువ గాఢత కలిగిన షాంపూలతో ప్రతిరోజు తలస్నానం చేయడం చాలా మంచిది. ఇది వారికి చికాకును, మంటను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టును, మాడును కలిగి ఉన్నవారు ప్రతిరోజు షాంపూ చేయాల్సిన అవసరం ఉండదు. వీరు వారానికి రెండుసార్లు తలకు షాంపూ చేసుకున్నా సరిపోతుంది. ఇక పొడవాటి జుట్టు కలిగిన వారు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు తలకు స్నానం చేయడం మంచిది.

దుమ్ము ధూళి ఉన్న పరిస్థితుల్లో ప్రతిరోజూ ప్రయాణం చేసిన వారు మాత్రం రోజు తప్పించి రోజు తలకు స్నానం చేయడం వల్ల మాడుపై ఉన్న దుమ్మును తొలగించుకోవచ్చు. లేకుంటే అక్కడ దుమ్ము పేరుకుపోయి చుండ్రు వంటి పరిస్థితులకి దారితీస్తుంది. దురదలు కూడా వస్తాయి. కాబట్టి మీరున్న పరిస్థితులు, నివసిస్తున్న వాతావరణాన్ని బట్టి ప్రతిరోజు షాంపూ చేయాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవాలి. నిత్యం ఇంట్లోనే ఉండే వాళ్ళు ప్రతిరోజు షాంపూ చేయాల్సిన అవసరం ఉండదు.

WhatsApp channel

టాపిక్