Buddha Purnima 2023 । భారతదేశంలోని ఈ బౌద్ధ ఆరామాలు.. ప్రశాంతతకు నిలయాలు!-from mahabodhi temple to sanchi stupa some of the must visit buddhist sites in india on buddha purnima 2023 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Buddha Purnima 2023 । భారతదేశంలోని ఈ బౌద్ధ ఆరామాలు.. ప్రశాంతతకు నిలయాలు!

Buddha Purnima 2023 । భారతదేశంలోని ఈ బౌద్ధ ఆరామాలు.. ప్రశాంతతకు నిలయాలు!

HT Telugu Desk HT Telugu
May 04, 2023 06:06 PM IST

Buddha Purnima 2023: బుద్ధ పూర్ణిమ సందర్భంగా బౌద్ధారామాలకు తీర్థయాత్ర చేయాలని భావిస్తే, భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించవలసిన కొన్ని బౌద్ధ ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Buddha Purnima 2023:
Buddha Purnima 2023:

Buddha Purnima 2023: బౌద్ధమత క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజును బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు. వైశాఖ పౌర్ణమి నాడే బుద్ధ భగవానుడి జననం, బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం జరిగినట్లు బౌద్ధమతం చెబుతుంది. 2023లో బుద్ధ పూర్ణిమ మే5న శుక్రవారం రోజు వస్తుంది.

బుద్ధుడు ఒక శాంతికాముకుడు. ఐహిక సుఖాలను వదులుకోవడం, కోరికలను త్యజించడం, క్రమశిక్షణతో జీవించడం, ధ్యానం ద్వారా ఆత్మను ప్రసన్నం చేసుకోవడం మొదలైనవి బుద్ధుడి సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఆధ్యాత్మిక భావాన్ని మరింత లోతుగా చేసుకోవాలని చూస్తున్న వారికి, ప్రశాంతంగా బుద్ధుని నీడలో ధ్యానం చేసుకోవాలనుకునే వారికి బౌద్ధ ఆరామాలు మంచి ప్రదేశాలుగా నిలుస్తాయి. భారతదేశం అనేక పురాతన బౌద్ధ ఆరామాలు, బుద్ధుని దేవాలయాలకు నిలయంగా ఉంది. ఇవి బౌద్ధమతంలోని గొప్ప చరిత్ర, సంస్కృతికి సంగ్రహావలోకనం అందిస్తాయి. ఈ బుద్ధ పూర్ణిమ సందర్భంగా మీరు కూడా బౌద్ధారామాలకు తీర్థయాత్ర చేయాలని భావిస్తే, భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించవలసిన కొన్ని బౌద్ధ ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

మహాబోధి ఆలయం, బోధ్ గయ:

ఈశాన్య భారతదేశంలోని బీహార్‌ రాష్ట్రంలో గల ఒక గ్రామం బోధ్ గయ. ఇది అత్యంత ముఖ్యమైన బౌద్ధ యాత్రా స్థలాలలో ఒకటిగా పరిగస్తారు. బౌద్ధమతం కూడా ఇక్కడే పురుడు పోసుకుందని ప్రతీతి. ఈ ప్రదేశం ప్రసిద్ధ బోధి వృక్షానికి నిలయం. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందినట్లుగా చరిత్ర చెబుతుంది. ఇటుకలతో నిర్మితమైన పురాతన మహాబోధి ఆలయంయునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.

సాంచి స్థూపం, మధ్యప్రదేశ్:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసెన్ జిల్లాలో సాంచి పట్టణంలోని కొండపై ఉన్న స్థూపం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది 3వ శతాబ్దం నాటి అద్భుతమైన బౌద్ధ స్మారక చిహ్నం. అబ్బురపరిచే శిల్పకళగా నిలయంగా ఉన్న సాంచి స్థూపం కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు ఈశాన్యంగా 46 కిలోమీటర్ల దూరంలో ఈ స్థూపం ఉంది.

హెమిస్ మొనాస్టరీ, లద్దాఖ్‌

హెమిస్ మొనాస్టరీ అనేది భారతదేశ కేంద్ర ప్రాంత పాలితమైన లద్దాఖ్‌లోని హెమిస్‌లో ఉన్న బౌద్ధ యాత్ర స్థలం. ఇది ద్రుక్పా వంశానికి చెందిన హిమాలయ బౌద్ధ విహారం. దీనిని 1672లో లడఖీ రాజు సెంగ్గే నామ్‌గ్యాల్ దీనిని స్థాపించారు. పద్మసంభవను గౌరవించే వార్షిక హేమిస్ ఉత్సవం జూన్ ప్రారంభంలో అక్కడ జరుగుతుంది. ఇది లద్దాఖ్‌లోని అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ మఠాలలో ఒకటి.

నామ్‌గ్యాల్ మొనాస్టరీ, ధర్మశాల

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ధర్మశాలలోని మెక్లీడ్ గంజ్‌లో నామ్‌గ్యాల్ మొనాస్టరీ ఉంది. దీనిని దలైలామా టెంపుల్ అని పులుస్తారు. ఇది 14వ దలైలామా వ్యక్తిగత మఠం. ఈ ఆలయ సముదాయానికి మరో పేరు నామ్‌గ్యాల్ తాంత్రిక కళాశాల. టిబెట్‌లోని దలైలామాకు సంబంధించిన ఆచార వ్యవహారాలలో ఈ మఠం కీలక పాత్ర పోషిస్తుంది.

తవాంగ్ మొనాస్టరీ, అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో ఉన్న తవాంగ్ మొనాస్టరీ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ మఠం. అత్యంత ముఖ్యమైన బౌద్ధ మఠాలలో కూడా ఒకటి. ఇక్కడ బుద్ధుని ఎత్తైన బంగారు విగ్రహం, పురాతన గ్రంధాలు ఉన్నాయి. చుట్టూ మంచు పర్వతాలతో ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది.

ఇవే కాకుండా, బుద్ధ పూర్ణిమ నాడు ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్‌లోని ధమేఖ్ స్థూపం, మహారాష్ట్రలో బౌద్ధ రాతి గుహలకు ప్రసిద్ధి గాంచిన అజంతా గుహలను కూడా సందర్శించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం