Lunar Eclipse 2023: సూర్యగ్రహణం సంభవించిన కొన్నిరోజులకే మరొక గ్రహణం ఏర్పడుతుంది. మే 5న చంద్ర గ్రహణం సంభవిస్తుంది. ఇది ఈ ఏడాదిలో ఏర్పడుతున్న రెండవ గ్రహణం కాగా మొదటి చంద్రగ్రహణం. ఈ శుక్రవారం ఏర్పడుతున్న చంద్ర గ్రహణం గత నెల ఏప్రిల్ 20న ఏర్పడిన సూర్యగ్రహణం వలె కాకుండా, ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. భూమి చంద్రుడి కంటే చాలా పెద్దది, అంటే దాని నీడ కూడా చంద్రుని కంటే ఎంతో ఎక్కువ. ఈ కారణంగా, సూర్యగ్రహణాల కంటే చంద్రగ్రహణాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో వీక్షించటానికి ఆస్కారం ఉంటుంది.
చంద్రగ్రహణం మే 5న భారత కాలమానం ప్రకారం రాత్రి 8.45 PM సమయానికి ప్రారంభమైన మే 6న 1.02 AM IST వరకు కొనసాగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. కాగా, ఇది కూడా చాలా అరుదైన చంద్రగ్రహణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది మరో 19 సంవత్సరాల వరకు ఇలాంటి చంద్రగ్రహణం పునరావృతం కాదు దీనిని పెనంబ్రల్ చంద్రగ్రహణం అని పరిశోధకులు పేర్కొన్నారు. తదుపరిసారి పెనంబ్రల్ గ్రహణం 2042లో మాత్రమే ఏర్పడుతుంది.
సాధారణంగా భూమి చంద్రుడు సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినపుడు గ్రహణాలు ఏర్పడతాయి. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడినపుడు చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి నాడు (Full Moon Day) సంభవిస్తుంది. ఫలితంగా పౌర్ణమిరోజు నిండుగా కనిపించాల్సిన చంద్రుడు గ్రహణ సమయంలో కనిపించకుండా పోతాడు. అంతేకాకుండా గ్రహణానికి ముందు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. కారణం సూర్యకాంతి పొందిన భూమి వాతావరణం చంద్రుడిపై ప్రతిబింబిస్తుంది, ఫలితంగా ఎర్రగా మారుతుంది.
అయితే శుక్రవారం ఏర్పడనున్న పెనంబ్రల్ చంద్రగ్రహణంలో చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా మరింత చీకటిలో ఉన్నట్లు కనిపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడే చంద్రగ్రహణంలో భూమి కోణం 5 డిగ్రీల కోణంలో ఎత్తులో ఉంటుంది. భూవాతావరణ ప్రభావం చంద్రుడిపై ఉండకపోవచ్చు. కాబట్టి గ్రహణం తేలికైన రంగులో కనిపిస్తుంది. నిశిత పరిశీలన అవసరం అవుతుంది. అందువల్ల ఈ చంద్రగ్రహణం తరచుగా ఏర్పడే 'అంబ్రల్' కాకుండా పెనంబ్రల్ చంద్రగ్రహణం అని పరిశోధకులు పేర్కొన్నారు.
2023లో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. మొదటిది సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవించగా, ఈ ఏడాదిలోనే మరొక సూర్యగ్రహణం అక్టోబర్ 14న సంభవిస్తుంది. అలాగే 2023లో మొదటి చంద్రగ్రహణం మే 5-6 తేదీల్లో సంభవిస్తుండగా, రెండవ చంద్రగ్రహణం అక్టోబర్ 28-29 తేదీలలో వస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్