Meditating in Morning । ఏం చేయాలో తోచడం లేదా? అయితే రోజూ ఉదయం ధ్యానం చేయండి!
Meditating in Morning: ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
Morning Meditation: ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తరచుగా చదువుతాం, వింటాం. కానీ ఈ బిజీ లైఫ్‌లో మనకోసం మనమే కొన్ని నిమిషాలు వెచ్చించే సమయం దొరకదు. ధ్యానం అనేది మనసుకు మాత్రమే కాదు మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది రోజూవారీ ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో మాత్రమే కాకుండా, శారీరక నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ధ్యానం అనేది ఒక పురాతనమైన అభ్యాసం, అనేక సమస్యలను నయం చేయగల చికిత్స విధానంలో ఒక భాగం. ఇది మనస్సుకు శరీర సంబంధాన్ని నొక్కి చెబుతుంది. మనిషి శరీరం లోపల సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. మెదడుకు ఏకాగ్రత, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
యోగా నిపుణులు హంసాజీ యోగేంద్ర మాట్లాడుతూ ధ్యానం అనేది ఒక వ్యక్తి లోపల దాగి ఉన్న శక్తులను గుర్తించే మార్గంగా అభివర్ణించారు. కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనలో దాగి ఉన్న శక్తులను గుర్తించి అర్థం చేసుకోవచ్చు. మనకు అంతర్గతంగా, బహిర్గతంగా ఉన్న బాధలను బాగా అర్థం చేసుకోవచ్చు, వాటి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. ఈ ధ్యానంలోనూ అనేక పద్ధతులు ఉంటాయి, ఒక్కో పద్ధతి ఒక్కో రకమైన ప్రయోజనానికి ఉద్దేశించబడినది ఉంటుంది. కొన్ని నిమిషాల ధ్యానం కూడా మీ శరీరంలో అద్భుతాలు చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది. మీ ఆలోచనాశక్తిని పెంచుతుంది.
ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా రోజును మొదలుపెట్టాలంటే ఉదయం ధ్యానం చేయాలని సిఫారసు చేస్తున్నారు.
ఉదయం ధ్యానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు
ఉదయం పూట ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
- ధ్యానం మీ ఆలోచనలను మంచి మార్గంలో ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఉదయం ధ్యానం చేస్తే మీకు ఆ రోజును వృధా చేయకుండా చక్కగా వినియోగించుకుంటారు. మంచి ఏకాగ్రతను కూడా కలిగి ఉంటారు.
- నిద్రలేచిన తర్వాత మీ మూడ్ బాగుండాలంటే కాసేపు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. మీ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అవసరమైన పనులపై దృష్టిపెట్టేలా మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది.
- ధ్యానం చేస్తే పరధ్యానం తగ్గుతుంది. నేటి ప్రపంచంలో ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు వంటివి అనవసరమైన ఆలోచనలను రెట్టింపు చేస్తున్నాయి. దీనివల్ల ఏకాగ్రతను కోల్పోతారు. ధ్యానం చేయడం వల్ల పరధ్యానాన్ని వీడి పని మీద ధ్యాస పెట్టవచ్చు, ప్రస్తుత క్షణంలో ఉండవచ్చు.
- పనిభారం ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా మీరు చురుకుగా, సమర్థవంతంగా పనులు చేయాలంటే ఉదయం పూట ధ్యానం చేయాలని చెబుతున్నారు. ధ్యానంతో మీకు విషయాలపై స్పష్టత లభిస్తుంది. మీ ఉత్పాదకత మెరుగుపడుతుంది.;
- ధ్యానం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కాలానుగుణ ఇన్ఫెక్షన్‌లతో పాటు బాధలు, నొప్పులను నివారించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉండగలుగుతారు.
ధ్యానం అనేది మీరు మీ అంతరంగంతో కనెక్ట్ అయ్యే అద్భుతమైన అభ్యాసం. ఇది మీ పారాసింపథెటిక్ నెట్‌వర్క్‌ను ప్రేరేపిస్తుంది. మీ హృదయ స్పందన రేటును మరింత నియంత్రిస్తుంది, శ్వాసను మెరుగుపరుస్తుంది.
సంబంధిత కథనం