Burger: రోజూ బర్గర్ లేదా పిజ్జా తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Burger: చాలామంది ఇంట్లోంచి లంచ్ బాక్సులు తీసుకెళ్లే బదులు బయట ఏవో ఒకటి తినేయాలని అనుకుంటారు. ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లనే తింటున్నారు. ప్రతిరోజూ బర్గర్లు తినడం వల్ల శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
Burger: ఇప్పటి యువతకు బర్గర్లు తెగ నచ్చేస్తున్నాయి. చీజ్ చికెన్ పాటీ లేక బంగాళదుంప పాటీ పెట్టి రెండు రొట్టె ముక్కలు అందిస్తారు. అవే బర్గర్లు. వీటిని ఈజీగా పట్టుకొని తినొచ్చు. ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు మోయాల్సిన బాధ తప్పించుకునేందుకు ఇలా ఎంతోమంది బర్గర్లకు,పిజ్జాలకు అలవాటు పడుతున్నారు. ప్రతిరోజూ ఒక చిన్న బర్గర్ తినడం వల్ల మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి.
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం ఎంత రుచిగా ఉన్నా కూడా బర్గర్లు ఆరోగ్యానికి మంచివి కాదు. ఇవి జంక్ ఫుడ్ అని సంగతి ఎంతోమందికి తెలుసు. కానీ వాటిని తినేందుకే ఇష్టపడతారు. ప్రతిరోజూ ఒక బర్గర్ తినడం వల్ల శరీరంపై ప్రభావం భారీగానే పడుతుంది.
బర్గర్ ఎందుకు తినకూడదు?
ఏ వయసులో ఉన్న వారైనా బర్గర్లను తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఒకేసారి ఎక్కువ క్యాలరీలు విడుదలై శరీరంలోని కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఒక బర్గర్ తినేవారు శరీరానికి అవసరం కన్నా ఎక్కువ క్యాలరీలను చేర్చడం వల్ల బరువు పెరిగిపోతారు. వారానికి కనీసం రెండుసార్లు బర్గర్లు తింటేనే ఊబకాయం వచ్చే అవకాశం 26% ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక రోజూ బర్గర్ తింటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.
బర్గర్లలో రెడ్ మీట్ కూడా పెట్టి అమ్ముతారు. వీటిని తినడం వల్ల సంతృప్త కొవ్వులు అధికంగా శరీరంలో చేరుతాయి. అంటే చెడు కొలెస్ట్రాల్ అధికంగా శరీరంలో చేరుతుంది. ఇది లిపో ప్రోటీన్స్ స్థాయిలను పెంచుతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలకు అతుక్కుని ఉండిపోతుంది. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చిన్న వయసులోనే గుండె పోటు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి బర్గర్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
శరీరంలో దీర్ఘకాలికంగా ఇన్ఫ్లమేషన్ ఉండడం చాలా ప్రమాదం. బర్గర్లను తినడం వల్ల లేదా పిజ్జాలను తినడం వల్ల దీర్ఘకాలికంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇది కార్డియోస్క్యులర్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని 38% పెంచుతుంది.
ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశం
బర్గర్లు పిజ్జాలు ఇంట్లో చేసినా, బయట చేసినా కూడా తినకపోవడం మంచిది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు కారణం అవుతుంది. ప్రీ డయాబెటిస్‌ను తీసుకొస్తుంది. ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్‌కు ముందు దశ. అధ్యయనాల ప్రకారం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో అధికంగా తినేవారికి ఈ ప్రీ డయాబెటిస్ వస్తున్నట్లు అంచనా.
అధిక రక్తపోటు బారిన పడే వారికి ఇలా జంక్ ఫుడ్ తినే అలవాటు ఉన్నట్టు గుర్తించారు. ఎందుకంటే వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటు స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది.
ప్రతిరోజూ తినేవారిలో దీర్ఘకాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి బర్గర్లు, పిజ్జాలు రుచిగా ఉన్నాయి కదా అని తినేయకండి. భవిష్యత్తులో ఈ రోగాల బారిన పడే అవకాశం పెరిగిపోతుంది.