Periods Fatigue: పీరియడ్స్ రోజుల్లో అలసటగా అనిపిస్తోందా? శక్తిని పెంచే ఈ ఆహారాలను తినండి
Periods Fatigue: పీరియడ్స్ సమయంలో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది తీవ్రమైన అలసటతో బాధపడతారు.
Periods Fatigue: పీరియడ్స్ సమయంలో ఒళ్ళు నొప్పులు రావడం, మానసికంగా దిగులుగా ఉండడం, గందర గోళంగా అనిపించడం... ఎంతోమంది మహిళలకు ఎదురవుతున్న సమస్య. అలాగే పని చేసినా, చేయకపోయినా తీవ్రంగా అలసిపోవడం వంటివి కూడా పీరియడ్స్ సమయంలో స్త్రీలలో కనిపిస్తాయి. పీరియడ్స్ అలసటను అనుభవిస్తున్న వారు తిరిగి శక్తిని పొందడానికి కొన్ని రకాల ఆహారాలను తినాలి. పీరియడ్స్ సమయంలో అలసట రాకుండా అడ్డుకోలేము.
హార్మోన్లలో మార్పులు వల్ల ఇది కలుగుతుంది. పీరియడ్స్ రావడానికి సహాయపడే హార్మోన్లు ఇలా అలసటను కలగజేస్తాయి. హార్మోన్లలో మార్పుల వల్ల తీవ్ర ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు పీరియడ్స్ రోజుల్లో వస్తాయి. తీవ్రంగా అలసటతో బాధపడుతున్న వారు ఆ మూడు రోజులు కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల శక్తిని పొందవచ్చు.
1. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తినడం చాలా అవసరం. ఇది అలసటతో పోరాడడానికి సహాయపడతాయి. పీరియడ్స్ సమయంలో రక్తాన్ని కోల్పోతారు .ఆ కోల్పోయిన రక్తాన్ని తిరిగి నింపే ప్రక్రియను ఇవి మొదలుపెడతాయి. దీనివల్ల శరీరానికి చురుకుదనం, శక్తి వస్తుంది.
2. అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది రుతుక్రమంలో ఖచ్చితంగా తినాల్సిన ఆహారం. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని, మంటను తగ్గిస్తాయి. అలసటతో కూడా పోరాడుతుంది.
3. డార్క్ చాక్లెట్ ముక్కను ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఇది మూడ్‌ను మారుస్తుంది. చక్కెర నిండిన ఆహారాలను తినాలన్న కోరికను తగ్గిస్తుంది. మానసికంగా సెరటోనిన్ హార్మోను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది.
4. మార్కెట్లో బెర్రీ జాతి పండ్లు అనేక లభిస్తున్నాయి. వాటిని తినడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్‌ను తట్టుకోవడానికి సహాయపడతాయి. పొట్ట ఉబ్బరం, అలసట రెండిటినీ తగ్గిస్తాయి.
5. ప్రతి ఇంట్లోనూ పెరుగు ఉంటుంది. పీరియడ్స్ సమయంలో ఒక కప్పు పెరుగును తినడం వల్ల ఉపశమనంగా అనిపిస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణ ప్రక్రియను ఇది మెరుగుపరుస్తాయి. పొట్ట ఉబ్బరం రాకుండా చూస్తాయి.
6. బత్తాయి, నిమ్మ, నారింజ వంటి విటమిన్ సి నిండుగా ఉండే పండ్లను తినడం చాలా అవసరం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం ఇనుమును శోషించుకునేలా చేస్తాయి. దీనివల్ల పీరియడ్స్ సమయంలో కోల్పోయే రక్తాన్ని తిరిగి త్వరగా భర్తీ చేసుకోవచ్చు. రక్తం కోల్పోవడం వల్లే తీవ్రమైన అలసట వస్తుంది.
7. పీరియడ్స్ రోజుల్లో ప్రతిరోజూ ఉదయం గుప్పెడు నట్స్ తినడం అలవాటు చేసుకోండి. బాదం, పిస్తా, వాల్ నట్స్, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే పొట్ట నొప్పిని తగ్గించే శక్తి వీటికి ఉంటుంది.
8. సాధారణ రోజుల్లో కన్నా అరటిపండును పీరియడ్స్ రోజుల్లోనే కచ్చితంగా తినాలి. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం రాకుండా అరికడుతుంది.
పీరియడ్స్ సమయంలో తినకూడని ఆహారాలు
1. పీరియడ్స్ రోజుల్లో తినే ఆహారాలే కాదు, తినకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల మరింతగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
2. పీరియడ్స్ రోజుల్లో కాఫీ, టీలను దూరంగా ఉంచాలి వీటిలో కెఫీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మానసిక ఆందోళన పెంచడమే కాదు, పొట్ట నొప్పిని కూడా పెంచుతుంది. అలాగే పీరియడ్స్ ప్రక్రియను కూడా మార్చే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఋతుప్రక్రియ ప్రభావితమవుతుంది.
3. కొవ్వు నిండిన ఆహారాలు జంక్ ఫుడ్ తినడం మానేయాలి. వీటిని తినడం వల్ల స్ట్రీ జననేంద్రియాలకు సమస్యలు వస్తాయి. అలాగే పీరియడ్స్ సమయంలో పొట్టనొప్పి ఎక్కువవుతుంది.
4. ప్రాసెస్ చేసిన చక్కెరతో నిండిన ఆహారాలను తినకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం జరగవచ్చు. దీనివల్ల చక్కెర తినాలన్న కోరికలు పెరిగిపోతాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి తృణధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు, గింజలు వంటివే తినడానికి ఇష్టపడాలి.
5. పాలల్లో లాక్టోస్ ఉంటుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని పెంచుతుంది. అలాగే పాలల్లో అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది పీరియడ్స్ సమయంలో పొట్టనొప్పిని పెంచుతుంది. కాబట్టి పీరియడ్స్ మూడు రోజులు పాలకు దూరంగా ఉండడం మంచిది.
6. మద్యం తాగే అలవాటు ఉన్నవారు పీరియడ్స్ సమయంలో తాగకూడదు. మద్యం తాగడం వల్ల పీరియడ్స్ రోజుల్లో పొట్ట దగ్గర తిమ్మిరి నొప్పి ఎక్కువ అయిపోతుంది.