Blue Berry: బ్రేక్ ఫాస్ట్‌లో పిల్లలకు బ్లూబెర్రీ పండ్లను తినిపించండి, జ్ఞాపకశక్తి పెరగడం ఖాయం
Blue Berry: ఉదయాన తినే బ్రేక్ ఫాస్ట్‌ను పిల్లలకు పోషకాహారంతో నింపాలి. దానిలో గుడ్లు, బ్లూబెర్రీ పండ్లు ఉండేలా చూస్తే మంచిది. ప్రతిరోజు బ్లూ బెర్రీ పండ్లను తినిపిస్తే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
Blue Berry: ఒక రోజులో తినే ఆహారంలో ప్రధమ ఆహారమైన బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనది. బ్రేక్ ఫాస్ట్‌లో ఆరోగ్యానికి అవసరమైన సూపర్ ఫుడ్స్‌ను తినాలి. కోడిగుడ్లు, పాలు, పండ్లతో పాటు పప్పు ధాన్యాలు కలిసిన ఆహారాలు అల్పాహారంలో తినడం అవసరం. అలాగే బ్లూబెర్రీ పండ్లను ఒక నాలుగు నుంచి ఐదు పండ్లను బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పిల్లలకు తినిపించండి. ఎందుకంటే ఇది సూపర్ ఫుడ్. మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. చదువుకునే పిల్లలకు బ్లూబెర్రీ పండ్లు తినడం చాలా అవసరం. ఇవి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. తద్వారా చదువు వారికి బాగా వస్తుంది.
బ్లూబెర్రీ తినడం వల్ల లాభాలు
ఏదైనా చదివింది గుర్తు పెట్టుకోవాలంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఆ రెండింటినీ పెంచే శక్తి బ్లూ బెర్రీలకు ఉంది. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెదడు వృద్ధాప్యం బారిన పడకుండా రక్షిస్తాయి. ఆ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. కాబట్టి మెదడు కోసం బ్లూ బెర్రీ పండ్లను తినడం చాలా అవసరం. బ్లూబెర్రీ పండ్లు ఊదా రంగులోనే కాదు, ఎరుపు, నీలం రంగులో కూడా లభిస్తాయి. వాటిని కూడా తింటే మంచిది. వీటిలో న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి మెదడులో ప్రవహించే చిన్న రక్తనాళాలను ఇవి కాపాడతాయి.
పరీక్షల కాలంలో పిల్లలకు చదివింది గుర్తుండడం చాలా ముఖ్యం. కాబట్టి బ్లూబెర్రీ పండ్లను తింటే ఎంతో మంచిది. ఒక అధ్యయనంలో భాగంగా కొంతమందికి 12 వారాలపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా బ్లూబెర్రీ పండ్లను పెట్టారు. ఆ తర్వాత వారిపై పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో వారిలో జ్ఞాపకశక్తి పెరిగినట్టు తేలింది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో ఎంతోమందికి బీపీ అదుపులో ఉంది. గుండె కూడా చక్కగా పనిచేయడం, గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గడం కనిపించింది.
బెర్రీ జాతికి చెందిన పండ్లలో బ్లూబెర్రీలు ఒకటి. వీటితోపాటు బ్లాక్ బెర్రీలు, రాస్బెర్రీలు, స్ట్రాబెర్రీలు ఇవన్నీ కూడా అ జాతి పండ్లే. ఇవన్నీ కూడా తినడం ముఖ్యమే. ఎందుకంటే మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ పండ్లు కూడా ముందుంటాయి. అలాగే చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మొటిమలు, ముడతలు, గీతలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తినాల్సిన ఆహారాలలో ఈ బెర్రీ జాతి పండ్లు కూడా ఒకటి. వీలైనంత వరకూ బెర్రీ పండ్లను తినేందుకు ప్రయత్నించండి. అలాగే మీకు పిల్లల చేత తినిపించండి. ఇవి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు అధికంగా ఉంటాయి.
టాపిక్