Induced Lactation: గర్భం ధరించకపోయినా, పిల్లల్ని కనకపోయినా దత్తత తీసుకున్న చంటి బిడ్డకు మీ రొమ్ము పాలు ఇవ్వొచ్చు
Induced Lactation: గర్భం ధరించి బిడ్డను కంటేనే తల్లిపాలు ఇవ్వగలమని అనుకుంటారు ఎంతోమంది మహిళలు. నిజానికి బిడ్డను కనకపోయినా కూడా దత్తత తీసుకున్న చంటి బిడ్డకు మీరు తల్లిగా మారొచ్చు. ఇప్పుడు ఈ ఆధునిక థెరపీ అందుబాటులోకి వచ్చాయి.
Induced Lactation: మనదేశంలో పిల్లలు లేక క్షోభ పడుతున్న భార్యాభర్తలు ఉన్నారు. వారిలో కొంతమంది నెలల పిల్లలను దత్తత తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఎంతోమంది స్త్రీలకు తమ రొమ్ము పాలు పిల్లలకు ఇచ్చి వారిని పెంచాలని ఉంటుంది. కానీ దత్తత తీసుకున్న స్త్రీలు తమకు పాలు ఉత్పత్తి కావని అనుకుంటారు. నిజానికి వారు కూడా దత్తత తీసుకున్న తమ శిశువుకు తల్లిపాలను అందించవచ్చు. దానికి వారు ప్రత్యేక థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఇండ్యూస్డ్ లాక్టేషన్ (Induced Lactation) లేదా రిలాక్టేషన్ (Relactation) అని పిలుస్తారు.
రొమ్ము పాలు ఎలా వస్తాయి?
గర్భం ధరించాక స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇక ప్రసవానికి కొన్ని రోజుల ముందు నుంచే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ అనే మూడు హార్మోన్లు కలిసి తల్లిపాలను సహజంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. డెలివరీ సమయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మాత్రం పాలను ఉత్పత్తి చేయడానికీ వేగంగా పనిచేస్తుంది. ఇదంతా సహజంగా గర్భం ధరించి పిల్లలను ప్రసవించే తల్లుల విషయంలో జరిగేది. కానీ గర్భం ధరించలేక... తాము దత్తత తీసుకున్న చంటి పిల్లలకు పాలు ఇవ్వాలని కోరుకునే తల్లులు కూడా ఉంటారు. వారికి ఆధునిక వైద్యం ఆ అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇండ్యూస్డ్ లాక్టేషన్ అంటే?
గర్భం ధరించకుండానే, పిల్లల్ని కనకుండానే ఒక స్త్రీ బిడ్డకు చనుబాలు ఇవ్వగలదు. అదే ఇన్‌డ్యూస్డ్ లాక్టేషన్ పద్దతి. దత్తత తీసుకున్న పిల్లలను తమ సొంత పిల్లల్లా భావించాలంటే వారికి తల్లిపాలు పెట్టాలని అనుకుంటారు ఎంతోమంది తల్లులు. వారి కోరిక మేరకే ఆధునిక వైద్యం ఇండ్యూస్డ్ లాక్టేషన్ పద్ధతిని కనిపెట్టింది. మీరు దత్తత తీసుకోవడానికి కొన్ని రోజుల ముందే వైద్యులను కలిసి ఈ ఇండ్యూస్డ్ లాక్టేషన్ పద్ధతి గురించి మాట్లాడాల్సి ఉంటుంది.
తల్లిపాలు రావడానికి కనీసం రెండు నెలల ముందు నుంచే ఈ థెరపీని ప్రారంభించాలి. ఆ రెండు నెలల్లో వైద్యులు మీకు ఈస్ట్రోజన్ లేదా ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్లను సప్లిమెంట్ల రూపంలో ఇచ్చే హార్మోన్ థెరపీని ప్రారంభిస్తారు. ఈ థెరపీ కొన్నిసార్లు నెలల తరబడి కొనసాగుతుంది. బిడ్డకు పాలు ఇవ్వాలని అనుకునే రెండు నెలల ముందే ఈ హార్మోన్ థెరపీని ఆపివేయాలి. ఉత్తమ ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్‌తో రొమ్ములను పంప్ చేయాలి. ప్రోలాక్టిన్ హార్మోను చనుబాలను ఉత్పత్తి చేసి విడుదల చేస్తుంది.
రోజులో కనీసం మూడుసార్లు ఐదు నిమిషాల పాటు పంపు చేస్తూ ఉండాలి. పాలు వచ్చినా, రాకపోయినా కూడా పంప్ చేస్తూ ఉండాలి. రొమ్ములకు అదొక వ్యాయామం. రాత్రి సమయంలో కూడా ఒక్కసారి అయినా 10 నిమిషాలు పాటు పంప్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే పాలు ఉత్పత్తి అయి రావడం మొదలవుతుంది. ఇక బిడ్డకు సంతోషంగా మీ రొమ్ము పాలు అందించవచ్చు.
కేవలం ఈ హార్మోన్ థెరపీ మాత్రమే కాదు. మరికొన్ని పద్ధతుల్లో కూడా వైద్యులు... మీకు రొమ్ము పాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. ఇలా హార్మోన్ థెరపీ, బ్రెస్ట్ వ్యాయామం వల్ల సాధారణంగా బిడ్డల్ని కన్నా తల్లుల్లాగే మీకు కూడా చనుబాలు ఉత్పత్తి కావడం మొదలవుతుంది. మీరు దత్తత తీసుకున్న చంటి బిడ్డకు సంతోషంగా మీ రొమ్ము పాలను తాగించవచ్చు.
టాపిక్