ఆధునిక కాలం గర్భం ధరించడానికి ఇబ్బంది పడుతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా వారికి ఉన్న సమస్యలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తలు సంతానోత్పత్తిలో ముఖ్యమైన అంశాలను ముందుగా అర్థం చేసుకోవాలి. మగవారిలో స్పెర్మ్ కణాలు ఆరోగ్యంగా ఉండడం, మహిళల్లో అండాలు నాణ్యత చాలా ముఖ్యం.
మహిళలు పుట్టుకతోనే కొన్ని అండాలతో జన్మిస్తారు. ఇవి వయసు పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్యతో పాటూ, వాటి నాణ్యత క్షీణించడం ప్రారంభిస్తుంది. ఒక మహిళ తన 30 ఏళ్ళకు చేరుకునే సమయానికి, ఆమె అప్పటికే పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయి ఉంటుంది. ఈ సహజ క్షీణత వయస్సు పెరుగుతున్న కొద్దీ వేగవంతం అవుతుంది. అలాగే అండాల్లో క్రోమోజోమ్ అసాధారణతలు వచ్చే అవకాశం ఉంది. 35 సంవత్సరాలున్న మహిళల్లో సుమారు 70 శాతం గుడ్లు అసాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఇది గర్భస్రావం లేదా పుట్టుకతో వచ్చే అసాధారణతల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, స్త్రీ గర్భం ధరించడానికి ప్రయత్నించే వయస్సు కీలకం. మహిళలు 30 ఏళ్లలోపే పిల్లలను కనడం ఉత్తమం. అలాగే మహిళలు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల అండాల నాణ్యత మరింతగా క్షీణిస్తుంది.
అండాల మాదిరిగా కాకుండా, వీర్యకణాలు పురుషుల్లో జీవితాంతం ఉత్పత్తి అవుతాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త వీర్యం ఉత్పత్తి అవుతుంది. వయస్సు పెరగడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితం చేయనప్పటికీ, స్పెర్మ్ కౌంట్, నాణ్యత వంటి అంశాలు మాత్రం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి.