Love Hormones: ఇవి హార్మోన్లు కాదు మన్మధ బాణాలు, వీటివల్లే వ్యక్తులు ప్రేమలో పడతారు-these are not hormones but cupid arrows which are what make people fall in love ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Hormones: ఇవి హార్మోన్లు కాదు మన్మధ బాణాలు, వీటివల్లే వ్యక్తులు ప్రేమలో పడతారు

Love Hormones: ఇవి హార్మోన్లు కాదు మన్మధ బాణాలు, వీటివల్లే వ్యక్తులు ప్రేమలో పడతారు

Haritha Chappa HT Telugu
Published Jun 22, 2024 10:05 AM IST

Love Hormones: ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుట వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రేమలో పడేందుకు మన శరీరంలో ఎన్నో రసాయనాలు కలిసి పనిచేస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల హార్మోన్లు మన్మధ బాణాల్లా మారుతాయి.

ప్రేమను పుట్టించే హార్మోన్లు
ప్రేమను పుట్టించే హార్మోన్లు (Pexels)

Love Hormones: ఒక వ్యక్తిని చూడగానే గుండెల్లో ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. మెదడులో కూడా ఒక్కసారిగా బ్లూమింగ్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడే పువ్వు వికసిస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాగే అనిపిస్తుంది. గుండె వేగం పెరుగుతుంది. ఆ వ్యక్తిని చూడాలన్న కోరిక ఎక్కువైపోతుంది. నిత్యం మెదడులో వారి ఆలోచనలే ఉంటాయి. ఇదే ప్రేమలో పడే ముందు జరిగే తంతు. ఇలా ప్రేమలో పడడానికి శరీరంలో కొన్ని రకాల రసాయనాలు చాలా వేగంగా పనిచేస్తాయి. ఆ రసాయనాలను మన్మధ బాణాలుగా చెప్పుకోవచ్చు. అవి మెదడులో విడుదల కాకపోతే మీకు ఎదుటి వ్యక్తిపై కోరిక పుట్టదు. ప్రేమ రాదు. ప్రేమకు లైంగిక ఆసక్తి కలగడానికి ఈ హార్మోన్లే చాలా ముఖ్యమైనవి.

మానవజాతి ఇలా కొన్ని యుగాలపాటు కొనసాగడానికి ప్రేమే కారణం. ఆ ప్రేమ లేకపోతే ఎప్పుడో మానవజాతి అంతరించిపోయేది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, కోరిక, లైంగిక ఆసక్తి మానవజాతిని తరతరాలుగా జీవించేలా చేస్తుంది. ప్రేమ ప్రయాణంలో లైంగిక ఆసక్తి చాలా ముఖ్యం. వీటన్నింటికీ కారణం మూడు రకాల హార్మోన్లు.

ఈ హార్మోన్లే...

డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అనే హార్మోన్లు ప్రేమ పుట్టడానికి ముఖ్యమైనవి. ఇవి మెదడులో సంక్లిష్టమైన ప్రక్రియలకు కారణం అవుతాయి. డోపమైన్ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆక్సిటోసిన్ బంధం, నమ్మకం వంటి ఆలోచనలను కలిగిస్తుంది. ఇక సెరటోనిన్ మానసిక స్థితిని ఉత్తేజ పరుస్తుంది. సామాజిక ప్రవర్తనను నియంత్రణలో ఉంచుతుంది. ఎదుట వ్యక్తి బాగా నచ్చినపుడు వారిపై లైంగిక భావాలు కలిగినప్పుడు. ఈ హార్మోన్లు మనం మెదడులో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల ఇష్టపడే వ్యక్తి తో భావోద్వేగ అనుబంధం ఏర్పడుతుంది. వీటిని న్యూరో కెమికల్స్ అంటారు.

మెదడులో జరిగే ఈ న్యూరో కెమికల్ ప్రక్రియ మనకు తెలిసిన వారి పట్ల మాత్రమే జరగాలని లేదు, రోడ్డుపై తెలియని వ్యక్తిని చూసినప్పుడు కూడా కలగవచ్చు. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా కలగవచ్చు. వారి లుక్స్, పర్సనాలిటీ నచ్చడం వల్ల కలగవచ్చు. ఇదే ఆకర్షణ, బంధం వంటి భావాలకు దోహదపడుతుంది.

ఆక్సిటోసిన్ తల్లీ, బిడ్డల మధ్య ప్రేమను అనుబంధాన్ని పెంచుతుంది. ప్రసవ సమయంలో హైపోథాలమస్ గ్రంథి నుంచి ఈ ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఇది తల్లిని... పిల్లలకు తల్లిపాలు పట్టేలా చేయడానికి సిద్ధం చేస్తుంది. ఇది వారిద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. అలాగే లైంగిక ప్రక్రియలో స్త్రీ పురుషుల్లో ఈ ఆక్సిటోసిన్ అధికంగా విడుదలవుతుంది. వారు మరింత సన్నిహితంగా ఉండేలా చేస్తుంది. అధ్యయనాల ప్రకారం ఏ జంట ఎక్కువ సార్లు లైంగిక ప్రక్రియలో గడుపుతారో వారి మధ్య గాఢమైన బంధం ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఆక్సిటోసిన్ ముఖ్య కారకం.

వాసోప్రెస్సెన్ కూడా ముఖ్యమైన రసాయనమే. ఇది మూత్రపిండాలను నియంత్రణలో ఉంచుతుంది. ఇద్దరి మధ్య అనుబంధం ఎక్కువ కాలం పాటు కొనసాగాలంటే ఇదొక ముఖ్యమైన రసాయనం అని చెప్పుకుంటారు. ఈ హార్మోన్లు ఓ జంట మధ్య బంధం మరింత గట్టిగా మారేలా చేస్తాయి.

ఒక వ్యక్తి ప్రేమలో పడడం అనేది పైన చెప్పిన హార్మోన్ల వల్లే జరుగుతుంది. అవే కీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టే ఎవరికి ఎప్పుడు, ఏ వ్యక్తి నచ్చుతారో చెప్పడం చాలా కష్టం. ఆ వ్యక్తిలో ఏదైనా ఆకర్షణీయంగా అనిపించగానే ఈ హార్మోన్లు విడుదలవడం మొదలుపెడతాయి. అప్పుడు ఆ వ్యక్తిపై ఆసక్తి, ప్రేమ కలుగుతుంది. మీ జీవితంలో ఇలా జరిగే ఉంటుంది. సాధారణ మనిషికి ఎదుటి వ్యక్తిపై ప్రేమ పుట్టడం, లైంగిక వాంఛ కలగడం అనేది సాధారణమైన విషయాలే.

Whats_app_banner