Bamboo Rice | వెదురు బియ్యం తింటే.. ఎదురు లేని మనిషిలా బ్రతకొచ్చు!-eat bamboo rice for amazing taste and unlimited health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bamboo Rice | వెదురు బియ్యం తింటే.. ఎదురు లేని మనిషిలా బ్రతకొచ్చు!

Bamboo Rice | వెదురు బియ్యం తింటే.. ఎదురు లేని మనిషిలా బ్రతకొచ్చు!

Manda Vikas HT Telugu
Oct 26, 2022 07:00 PM IST

Bamboo Rice Health Benefits: వెదురు బియ్యం చాలా అరుదైన బియ్యం రకం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వెదురు బియ్యంతో వండుకుంటే, దాని రుచి ఎలా ఉంటుంది, తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూడండి.

Bamboo Rice
Bamboo Rice (Slurrp)

మనందరి రైస్ అంటే చాలా ఇష్టమైన ఆహారం. రోజులో ఏం తిన్నా, ఎంత తిన్నా అన్నం తినకపోతే అసలు తిన్నట్లే ఉండదు. కుక్కర్‌లో రైస్ పెట్టుకొని కర్రీస్ తెచుకొని తింటే చాలనుకునే జీవులు చాలా మంది. అయితే మనకు తెలిసింది తెల్లని వైట్ రైస్ మాత్రమే, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అని రకరకాలు ఉన్నా, అవన్నీ వరి నుంచి వచ్చిన ధాన్యాలే. కానీ మీరెప్పుడైనా వెదురు రైస్ (Bamboo Rice) తిన్నారా? ఈ వెదురు రైస్ అంటే బొంగులో చికెన్ బిర్యానీలాగా వెదురు బొంగులో వండే రైస్ కాదు, నేరుగా వెదురు చెట్టుకే పండే రైస్.

వెదురు బియ్యంను ములయారి రైస్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వెదురు చెట్టు వయసు చివరి దశకు వచ్చి, అది చనిపోయేటపుడు కొత్త చెట్లు మొలకెత్తడానికి పెద్ద మొత్తంలో పుష్పించడం, విత్తనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. వెదురు కంకులు ఉద్భవిస్తాయి. ఈ వెదురు కంకులను కోసి తీస్తే అందులో విత్తనాలు బయటకు వస్తాయి, ఇదే వెదురు బియ్యం. ఈ వెదురు బియ్యం చాలా అరుదైనది, వీటి ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెదురు చెట్టు జీవితకాలం ముగియటానికి కొన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అప్పటికి గానీ ఆ చెట్టు వెదురు కంకులను ఉత్పత్తి చేయదు.

Bamboo Rice Taste- వెదురు బియ్యం రుచి ఎలా ఉంటుంది?

ఈ బియ్యం చూడటానికి మామూలు వరి నూకల బియ్యం లాగా ఉంటుంది. అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని మామూలు బియ్యంలాగే వండుకొని తినాలి. వండిన తర్వాత దాని ఆకృతిలో తేడా ఉంటుంది. ఈ బియ్యంతో వండిన అన్నం కొద్దిగా జిగటగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. రుచిలో గోధుమ ధాన్యాల రుచిని కలిగి ఉంటుంది, తీపి రుచిని కలిగి ఉంటుంది. నములుతుంటే మెత్తగా, తేమగా అనిపిస్తుంది. ఈ బియ్యంను ఖిచ్డీ చేయటానికి లేదా ఖీర్ చేయటానికి ఉపయోగించవచ్చు.

Bamboo Rice Health Benefits - వెదురు బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు

ఇంతటి అరుదైన బియ్యంలో పోషకాలు, ఔషధ గుణాలు కూడా ఎక్కువే. ఇందులో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం వండుకొని తింటే వెన్నునొప్పి, రుమాటిక్ నొప్పి, కీళ్ల నొప్పులు నయమవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది. విటమిన్ లోపం ఉన్న గర్భిణీ స్త్రీలకు ఈ వెదురు బియ్యం చాలా ఆరోగ్యకరం.

1. ఈ బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. వెదురు గింజల్లో ఎలాంటి కొవ్వు ఉండదు. ఇప్పటికే ఉన్న శరీర కొవ్వును కూడా బర్న్ చేయడం సాధ్యపడుతుంది. అదనంగా ఈ బియ్యంలో ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

3. రక్తపోటును నియంత్రిస్తుంది, వెదురు బియ్యం స్థిరంగా తీసుకోవడం వల్ల రక్తపోటు సాధారణ పరిధిలోకి వస్తుంది. మెదడుకు సరైన పోషకాలు అందించి, మెదడును, గుండెను సమన్వయ పరుస్తుంది.

4. వెదురు బియ్యం తింటే ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి మూలకాలతో పాటు ఫ్లేవనాయిడ్‌లు, ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. ఈ బియ్యంలోని బయోయాక్టివ్ పదార్థాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు కీళ్లవాపును తగ్గిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

5. ముఖ్యమైన B విటమిన్లు, ముఖ్యంగా B6 వెదురు బియ్యంలో పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాల సంశ్లేషణ, నరాల ఆరోగ్యం, అభిజ్ఞా పెరుగుదలకు ఇవి మంచివి. రక్తహీనత, మూర్ఛలు, అల్జీమర్స్ వంటి అనారోగ్యాలను నివారించవచ్చు.

6. దంత క్షయాలు లేదా కావిటీలను నివారించడంలో సహాయపడే పోషకాలు వెదురు బియ్యంలో ఉంటాయి.

అయితే ఈ వెదురు బియ్యం సాధారణంగా మార్కెట్లో లభించవు. కేరళలోని కొండప్రాంతాలు, వెదురు బొంగులు ఎక్కువగా ఉండే అభయారణ్యాల ప్రాంతాలలో నివసించే గిరిజనుల వద్ద ఈ బియ్యం లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం