Brown Rice Pulao: ఈ బ్రౌన్ రైస్ పులావ్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా?
మనిషి ముందు చూపుతోపాటు ఈ మధ్య కాస్త వెనుదిరిగి కూడా చూస్తున్నాడు. అందులో భాగంగానే మన పూర్వీకుల ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లను జీవితంలో భాగం చేసుకుంటున్నాడు. బ్రౌన్ రైస్ అలా తెరపైకి వచ్చిందే. వైట్ రైస్ తింటే ఎన్నో నొప్పులు వేధిస్తుండటంతో క్రమంగా అందరకూ ముడి బియ్యంవైపు చూస్తున్నారు.
బ్రౌన్ రైస్ తింటే మామూలు రైస్ కంటే చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అధికంగా పైబర్ ఉంటుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అధిక బరువు ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంచెం తింటే చాలు.. చాలాసేపటి వరకూ ఆకలి వేయకపోవడం వల్ల తక్కువగా తింటారు. ఇది అధిక బరువుకు చెక్ పెడుతుంది. అనేక రకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే ఐనాసిటాల్ హెగ్జాఫాస్ఫేట్ (ఐపీ6) ఇందులో ఉంటుంది. అందుకే ఈ బ్రౌన్ రైస్ తింటే.. లివర్, బ్రెస్ట్ క్యాన్సర్ల బారిన పడే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రౌన్ రైస్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలైతే ఉంటాయి కానీ.. నోటికి టేస్ట్ అంతలా అనిపించదు. కొంతమంది ఈ రైస్ పై వెనుకడుగు వేయడానికి కారణం ఇదే. అలాంటి వాళ్లు ఇదే బ్రౌన్ రైస్ తో రుచికరమైన పులావ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే బ్రౌన్ రైస్ పులావ్ గురించి తెలుసుకుందాం పదండి.
బ్రౌన్ రైస్ పులావ్ ఎలా చేయాలి?
మామూలుగా బ్రౌన్ రైస్ ఉడకబెట్టి తినాలంటే అందరూ అందగా ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలైతే ముఖం పక్కకు తిప్పుకుంటారు. అలాంటప్పుడు ఈ బ్రౌన్ రైస్ పులావ్ ట్రైచేయొచ్చు. మరి దీనిని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం.
బ్రౌన్ రైస్ పులావ్ కోసం కావాల్సిన పదార్థాలు
ఒక కప్పు బ్రౌన్ రైస్, రెండు బంగాళదుంపలు, క్యాప్సికం, పచ్చిమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, రెండున్నర కప్పులు నీళ్లు, ఉప్పు రుచికి సరిపడా, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయలు రెండు, తరిగిన బీన్స్ ఐదు, పావు కప్పు పల్లీలు, 2 లవంగాలు, అర టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, రెండు దాల్చిన చెక్కలు, గరం మసాలా కొద్దిగా, కప్పు క్యారెట్ ముక్కలు.
తయారీ విధానం
ముందు బ్రౌన్ రైస్ నానబెట్టాలి. తర్వాత కుకర్ ను స్టౌ మీద పెట్టి.. అందులో నెయ్యి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. తర్వాత బ్రౌన్ రైస్ ను కుకర్లో వేయాలి. కూరగాయల ముక్కలు కూడా అందులో వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి. మీకు కావాలనుకున్నట్లుగా గరం మసాలా, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉంచాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీ బ్రౌన్ రైస్ పులావ్ రెడీ.
సంబంధిత కథనం