Disease sources: మీ కిచెన్‌లో వీటిని వాడుతుంటే వెంటనే తీసేయండి, ఈ 6 వస్తువులు అనారోగ్య కారకాలు
Disease sources: రోజూవారీ కిచెన్‌లో వాడే వస్తువులు కొన్ని అనారోగ్యానికి కారకాలవుతాయి. వాటివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆ వస్తువులను మీరు మీ వంటగదిలో నుంచి తీసేయాల్సిందే.
వంటగది శుభ్రంగా ఉంటే సగం అనారోగ్య సమస్యలు తగ్గినట్లే. అలా శుభ్రంగా ఉంచడానికి చాలా కష్టపడతాం. ఎప్పటికప్పుడు తుడిచేస్తాం. కానీ కొన్ని వస్తువుల వాడకం మన ఆరోగ్యం క్షీణించేలా చేస్తుంది. అందుకే కిచెన్‌లో అస్సలు వాడకూడని వస్తువులేంటో తెల్సుకోండి.
1. చాపింగ్ బోర్డు:
చాపింగ్ బోర్డు వాడకం హానికరం కాదు కానీ, ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు వాడకూడదు. దానిమీద కూరగాయలు, పండ్లు కట్ చేసిన ప్రతిసారీ మైక్రో ప్లాస్టిక్ అణువులు మన శరీరంలోకి చేరిపోతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. కట్టెతో చేసిన వుడెన్ చాపింగ్ బోర్డుల వాడకం కొంత మేలు చేస్తుంది. కానీ దీనికి మనకు కనిపించని చిన్న చిన్న రంద్రాలుంటాయి. మనం మాంసం లాంటివి కట్ చేసినప్పుడు దాని రసాలు ఆ రంధ్రాల్లో చేరుకుంటాయి. ఒకవేళ్ల కట్టె బోర్డు వాడితే మాంసానికి, కూరగాయలకు, పండ్లకు వేరు వేరు బోర్డులు వాడటం మేలు.
2. ప్లాస్టిక్ డబ్బాలు:
ప్లాస్టిక్ డబ్బాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ముఖ్యంగా వీటిలో వేడి పదార్థాలు వేయకూడదు. వాటిలో ఉండే బిపీఏ ఆహారంలోకి చేరిపోతుంది. అలాంటివి తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
3. అల్యూమినియం పాత్రలు:
ప్రెజర్ కుక్కర్లు, వంటచేసే పాత్రలు చాలా మంది అల్యూమినియంతో చేసినవి వాడుతుంటారు. వాటిలో వంట చేయడం వల్ల పోషకాలు తగ్గిపోతాయని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. పైగా చాలా కొద్దిమొత్తంలో అల్యూమినియం మన శరీరంలోకి కూడా చేరుకుంటుందట. దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వాటికి బదులుగా మట్టి పాత్రలు, ఐరన్ కడాయిలు వాడటం మొదలుపెట్టాలి.
4. స్పాంజి:
కిచెన్ స్లాబ్, సింక్ లాంటివి స్పాంజితో తుడిచేస్తాం. దాన్ని తర్వాత సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోతే అందులో బ్యాక్టీరియా అలాగే పెరిగిపోతుంది. అందుకే స్పాంజి వాడిన తర్వాత దాన్ని వైట్ వెనిగర్ నీళ్లు సమపాళ్లలో కలిపిన మిశ్రమంలో కనిసం నిమిషం పాటూ ఉంచి, గట్టిగా పిండేయాలి. తర్వాతే మరోసారికి వాడుకోవాలి. బదులుగా కిచెన్ టవెల్ వాడి ప్రతిసారి ఉతికేయడం ఉత్తమం.
5. సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్:
డైనింగ్ టేబుల్ మీద చాలా మట్టుకు ఉప్పు, మిరియాల పొడి నింపిన షేకర్స్ పెడుతుంటారు. అందరూ వాటిని వాడుతుంటారు. అలా అందరి చేతులకున్న బ్యాక్టీరియా దానికి అంటుకుంటుంది. అందుకే ప్రతిసారీ భోజనం తర్వాత వాటిని శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
6. నాన్‌స్టిక్ పాత్రలు:
వండటం తేలిక అవుతుందని రోజూ నాన్‌స్టిక్ పాత్రలు, పెనం వాడుతుంటాం. కానీ వాటికున్న టెఫ్లాన్ పూత వల్ల చాలా రసాయనాలు మన శరీరంలోకి చేరుకుంటాయి. వాటిని ఎక్కువ ఉష్ణోగ్రత మీద పొగలు వచ్చేదాకా వాడటం మరింత ప్రమాదకరం. అందుకే వాటికి బదులుగా ఇప్పుడు మార్కెట్లో నాన్‌స్టిక్ గుణం ఉన్న ఇనుప కడాయిలు, పెనం దొరుకుతున్నాయి. లేదంటే స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడటమూ మంచిదే.