Nonstick: నాన్‌స్టిక్ పాత్రలు ఇలా వాడితే ఏ ప్రమాదం లేదు.. ఈ 5 తప్పులు చేయకండి చాలు
Nonstick: నాన్‌స్టిక్ పాత్రల నుంచి వచ్చే వేడి సెగల వల్ల ఫ్లూ లక్షణాలు కనిపించొచ్చు. దీన్నే టెఫ్లాన్ ఫ్లూ అంటారు. ఏ హాని జరగకుండా నాన్‌స్టిక్ పాత్రలు ఎలా వాడాలో తెల్సుకోండి.
మోడర్న్ కిచెన్లలో నాన్‌స్టిక్ పాత్రలు లేకుండా ఉండవు. మట్టి పాత్రలు, ఇనుప పెనాలు వాడటం ఈ మధ్య కాస్త పెరిగింది. అయినా నాన్‌స్టిక్ పాత్రల వాడకం మాత్రం పూర్తిగా తగ్గలేదు. కొన్ని వంటలకు వాటినే వాడాల్సి వస్తుంది. అతుక్కోకుండా చక్కగా వస్తాయని, తర్వాత శుభ్రం చేయడం తేలికని వాటిని వాడేస్తున్నారు. కానీ వీటివల్ల టెఫ్లాన్ ఫ్లూ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
టెఫ్లాన్ ఫ్లూ:
టెఫ్లాన్ అనేది సింథటిక్ రసాయనం. దీంట్లో కార్బన్, ఫ్లోరిన్ మిళితమై ఉంటాయి. నాన్‌స్టిక్ పాత్రలకు అతుక్కోకుండా గుణం రావడానికి ఈ టెఫ్లాన్ కోటింగే కారణం. వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే టెఫ్లాన్ ఫ్లూ రావచ్చు. నాన్‌స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడిచేయడం వల్ల రసాయనాలు గాల్లోకి విడుదలవుతాయి. ఈ వేడి సెగల్ని పీల్చడం వల్ల ఫ్లూ లాంటి సమస్యలొస్తాయి.. అదే టెఫ్లాన్ ఫ్లూ. జ్వరం, వణుకు, దగ్గు, చాతీలో పట్టినట్లు అవ్వడం, శ్వాసలో ఇబ్బంది, తల తిరగడం, నెత్తి నొప్పి, వికారం లాంటివి దీని లక్షణాలు.
మరి నాన్‌స్టిక్ పాత్రలు వాడకూడదా?
నిజానికి నాన్‌స్టిక్ వాడకం వల్ల ప్రమాదం లేదు. సరిగ్గా వాడకపోతేనే నష్టమంతా. 500 డిగ్రీల ఫారన్‌హీట్ కన్నా ఎక్కువ వేడి చేసినప్పుడు పాత్రలకున్న కోటింగ్ వదిలిపోతుంది. దాంతో రసాయనాలు విడుదలవుతాయి. ఇవి శరీరంలోకి చేరినా, గాలి ద్వారా పీల్చినా ప్రమాదమే.
ఇలా వాడితే సురక్షితం:
మట్టి పాత్రలు, ఇనుము పాత్రలే వంట చేయడానికి సురక్షితం. మట్టి పాత్రల్లో వండటమే సురక్షితమని ఐసీఎమ్‌ఆర్ కూడా తన మార్గదర్శకాలలో తెలిపింది. వీటిలో వండటానికి తక్కువ నూనె అవసరం. వాతావరణానికి ఇవి అనుకూలమే. ఆహారంలో పోషకాలు కూడా ఎక్కువగా పోవు. అయితే అవసరమైనప్పుడు నాన్‌స్టిక్ పాత్రలు వాడితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అవేంటో చూడండి.
1. ముందుగా వేడిచేయొద్దు:
వంట చేసేటప్పుడు గ్యాస్ మీద పాత్ర పెట్టి కాస్త వేడి చేసే అలవాటు అందరికీ ఉంటుంది. తర్వాతే దాంట్లో నూనె పోస్తాం. నాన్‌స్టిక్ పాత్రలు అలా ముందుగా వేడి చేయకూడదు. అలా చేస్తే వాటికున్న సహజ నాన్‌స్టిక్ కోటింగ్ పోతుంది. అందుకే పాత్రలో నీళ్లు, నూనె, ఏదైనా ఆహార పదార్థాలు ఉంచిన తర్వాతే వాటిని వేడిచేయాలి. ఇలా చేస్తే పాత్ర కూడా ఎక్కువ కాలం మన్నుతుంది.
2. ఎక్కువగా వేడిచేయడం:
నాన్‌స్టిక్ పాత్రల్లో వండేటప్పుడు గ్యాస్ సిమ్ లేదా మీడియం మంట మీద ఉంచాలి. మెల్లగా ఉష్ణోగ్రత పెరిగేలా చూడాలి. అంతే కానీ పెద్ద మంట మీద ఎక్కువ వేడితో వండేస్తే దాని కోటింగ్ పోయి రసాయనాలు విడుదల చేస్తుంది. వీటిలో వంట వండటానికి 260 డిగ్రీల సెల్సియస్ లేదా 500 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువుండకూడదు. కాబట్టి చాలా ఎక్కువ సేపు వండాల్సి వచ్చే వంటలకోసం వీటిని వాడకండి.
3. స్టీల్ స్పూన్లు వాడటం:
నాన్‌స్టిక్ పాత్రలకున్న కోటింగ్ చాలా సున్నితంగా ఉంటుంది. స్టీల్ చెంచాలను వాడితే ఈ కోటింగ్ పోతుంది. అందుకే వీటిని కొన్నప్పుడు జతగా చాలా బ్రాండ్లు కట్టె చెంచాలు ఇస్తారు. వాటినే వాడటం ఉత్తమం. మెటల స్పూన్స్, ఫోర్కులు, విస్కర్లు, కత్తి లాంటివి ఈ పాత్రల్లో వండేటప్పుడు వాడకూడదు. లేదంటే సిలికాన్ స్పాచ్యులా, స్పూన్లు వాడినా మంచిదే.
4. వేడిగా ఉన్నప్పుడు కడగొద్దు:
వంట వండగానే పాత్ర ఖాళీ చేసేసి నేరుగా సింక్ కింద పెట్టేసే అలవాటు కొందరికి ఉంటుంది. అలా చేయడం ప్రమాదకరం. పాత్ర చల్లారాక మాత్రమే అందులో నీళ్లు పోయాలి. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలో మార్పు వచ్చేలా అలా నీటి కింది పెడితే క్రమంగా నాన్‌స్టిక్ కోటింగ్ పోతుంది.
5. డిష్ వాషర్:
నాన్‌స్టిక్ పాత్రలు కడగటం చాలా సులువు. వాటిని చేత్తో కడిగేస్తే సరిపోతుంది. డిష్ వాషర్లలో పెట్టకండి. గాఢత ఎక్కువున్న డిటర్జెంట్లు వాటిని పాడు చేస్తాయి.