Plastic Containers: ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారా? ఏవి వాడొచ్చో.. ఎప్పుడు వాడకూడదో చూడండి..
Plastic Containers: ఫుడ్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్ అని రాసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను రోజూవారీ విపరీతంగా వాడేస్తున్నాం. నిజంగా వాటిని వాడటం మంచిదో కాదో క్షుణ్ణంగా తెలుసుకోండి.
ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ బాక్సులు, డబ్బాలు, గిన్నెలు బోలెడు ఉంటున్నాయి. చిరు తిండ్లు పెట్టుకోవాలన్నా, మిగిలిన కూరల్ని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలన్నా, పిల్లలకు బాక్సులు పెట్టి స్కూలుకు పంపించాలన్నా అంతా ఎక్కువగా వీటినే వాడుతున్నారు. పైగా వీటిలో ఫుడ్ సేఫ్, బీపీఏ ఫ్రీ, మైక్రోవేవ్ సేఫ్ లాంటి ఆప్షన్‌లతో రకరకాల ప్లాస్టిక్ వెరైటీలు అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ ధరల్లో, రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో వీటిని కొనుక్కునేందుకు అంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటివల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అవి ఎంత నాణ్యమైనవైనా సరే వీటిని వాడటం సరికాదంటున్నారు. వీటి వల్ల సంతాన సమస్యలు, ఊబకాయం, మధుమేహం, బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయని చెబుతున్నారు.
ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదు:
- ప్లాస్టిక్ డబ్బాల తయారీలో వాడే బీపీఏ, బీపీఎఫ్‌లకు.. పిల్లల్లో ఊబకాయం సమస్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు 2019లో న్యూయార్క్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
- ముఖ్యంగా ప్లాస్టిక్ బాక్సుల్లోకి వేడి వేడిగా వండిన పదార్థాలను పెట్టడం చాలా ప్రమాదకరం. అలాగే మైక్రోవేవ్‌ల్లో పదార్థాలను వేడి చేయడానికి ప్లాస్టిక్ గిన్నెలను వాడడమూ అంతే. వీటిలో ఉండే ప్రమాదకర రసాయనాలు వేడి వేడి ఆహార పదార్థాలతో రియాక్ట్ అయి దాన్ని అనారోగ్యకరంగా మార్చేస్తాయి. మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్ గిన్నెలు వాడుతుంటే వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
- అలాగే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను రీయూజ్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. వీటిని ప్రోసెసింగ్ చేసే క్రమంలో వీటిలో పెద్ద ఎత్తున రసాయనాలను వాడతారు. ఇలాంటి వాటిలో ఆహారాలు ఉంచడం వల్ల వాటిలోకి ప్రమాదకర రసాయనాలు వచ్చి చేరే అవకాశాలు ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు కాబట్టి.. రసాయనలేం లేవు అనుకోవడానికి వీలు లేదు. వాటి వల్ల మన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాగా పాతబడిపోయి, గీతలు పడిపోయి ఉన్న డబ్బాలను వాడకపోవడమే మంచిది.
- కొంతలో కొంత ఫుడ్ సేఫ్ ప్లాస్టిక్‌ని వాడటం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయి. కానీ వీటిలోనైనా వేడి పదార్థాలను పెట్టకూడదు.
- సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో తయారు చేసే డబ్బాలు, ప్లేట్లను ఒకసారికంటే ఎక్కువ వాడకూడదు. అందువల్ల చాలా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.
మరి వేటిని వాడాలి?
ప్లాస్టిక్ డబ్బాలు, బాక్సులకు బదులుగా స్టీలు, గాజు, ఇత్తడి లాంటి లోహపు డబ్బాలు, క్యాన్లను వాడుకోవడం మంచిది. ఇవి తొందరగా అన్ని ఆహార పదార్థాలతో రియాక్ట్ కావు. అలాగే వీటి నుంచి విషపూరితమైన రసాయనాలూ విడుదల కావు. అందువల్ల ప్లాస్టిక్ డబ్బాల స్థానంలో ఈ లోహాలను వాడుకోవడం ఉత్తమం. మైక్రోవేవ్‌లో వాడుకోవడానికి మైక్రోవేవ్ సేఫ్ గాజు పాత్రలు ఉంటాయి. ప్లాస్టిక్ వాటితో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి.