Rice Idli: అప్పటికప్పుడు ఇలా రైస్ ఇడ్లీ చేసేయండి, ఇవి మెత్తగా స్పాంజిలా వస్తాయి
Rice Idli: ఇడ్లీలు అనగానే ముందు రోజే పిండిని రుబ్బుకుని నానబెట్టుకుని పులియబెట్టుకోవాలి. అయితే ఉదయాన అప్పటికప్పుడు రైస్ ఇడ్లీని చేసుకుంటే మెత్తగా వస్తాయి. ఇవి చాలా తక్కువ సమయంలోనే రెడీ అవుతాయి.
Rice Idli: ఇన్‌స్టెంట్ ఇడ్లీ... ఉదయాన్నే లేచిన తర్వాత ఏం టిఫిన్ చేయాలో ఆలోచించేవారు ఈ ఇన్‌స్టెంట్ ఇడ్లీని ట్రై చేయండి. ఇవి మెత్తగా, స్పాంజిలాగా వస్తాయి. రెగ్యులర్ ఇడ్లీలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ సమయంలోనే రెడీ అవుతాయి. రెగ్యులర్ ఇడ్లీలను ముందు రోజే రుబ్బుకొని రాత్రి పులియబెట్టుకోవాలి. ఈ ఇన్ స్టెంట్ ఇడ్లీలకి పిండిని ముందు రోజు రాత్రే రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. వీటిని చేసుకునేందుకు బియ్యం రవ్వ, పుల్లని మజ్జిగ, అటుకులు ఉంటే సరిపోతుంది. ఈ మూడింటితో ఇన్ స్టెంట్ ఇడ్లీ సులువుగా రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా ఇది చాలా నచ్చుతుంది. ఈ ఇన్ స్టెంట్ ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
రైస్ ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
అటుకులు - ఒక కప్పు
పుల్లని మజ్జిగ - మూడు కప్పులు
బియ్యం రవ్వ - ఒకటిన్నర కప్పు
వంటసోడా - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
రైస్ ఇడ్లీ రెసిపీ
1. ఒక గిన్నెలో అటుకులు వేసి అందులో పుల్లని మజ్జిగను వేసి నానబెట్టాలి.
2. ఓ పావుగంట వదిలేసాక దాన్ని మిక్సీ పట్టుకుంటే మెత్తగా పిండిలాగా అవుతుంది.
3. ఇప్పుడు ఆ అటుకుల మిశ్రమంలో బియ్యం రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా, మిగిలిన మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి.
4. ఓ అరగంట పాటు అలా వదిలేస్తే బియ్యం రవ్వ పుల్లని మజ్జిగలో బాగా నానుతుంది.
5. ఇడ్లీ పిండి మాదిరిగా అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ లోని ఇడ్లీ ప్లేట్లకు అడుగున నెయ్యి లేదా నూనె రాసి ఈ రుబ్బును వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేయాలి.
6. కాసేపటికి వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయి.
7. ఇడ్లీలు చాలా మెత్తగా, స్పాంజిలాగా ఉంటాయి.
8. వీటిని సాంబార్‌తో తింటే అదిరిపోతాయి. ఏ చట్నీతో తిన్నా కూడా ఇవి టేస్టీగానే ఉంటాయి.
పిల్లలకు అప్పటికప్పుడు చేయడానికి వీలుగా ఈ ఇన్ స్టెంట్ ఇడ్లీల రెసిపీ ఉంటుంది. ముందు రోజు ఇడ్లీ పిండి రుబ్బుకోవడం కుదరనివారు... మరుసటి రోజు ఇలా పుల్లని మజ్జిగతో బియ్యం రవ్వ , అటుకులు వేసి ఇడ్లీని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో ఇడ్లీ తింటే అదిరిపోతుంది. దీనిలో ఎక్కువగా బియ్యం రవ్వ ఉంది. కాబట్టి పిల్లలకు నీరసం కూడా రాదు. ఒక్కసారి ఈ ఇడ్లీని చేసుకొని తినండి. రెగ్యులర్ ఇడ్లీ కన్నా ఇది మెత్తగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు నచ్చడం ఖాయం.