Sweet after Meals: భోజనం చేశాక తీపి పదార్థం తినడం ఎంత ప్రమాదమో తెలుసా? ఆ అలవాటును మానేయండి-do you know how dangerous it is to eat something sweet after a meal break that habit ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sweet After Meals: భోజనం చేశాక తీపి పదార్థం తినడం ఎంత ప్రమాదమో తెలుసా? ఆ అలవాటును మానేయండి

Sweet after Meals: భోజనం చేశాక తీపి పదార్థం తినడం ఎంత ప్రమాదమో తెలుసా? ఆ అలవాటును మానేయండి

Haritha Chappa HT Telugu
Mar 29, 2024 08:11 PM IST

Sweet after Meals: ఎంతోమందికి భోజనం చేశాక ఏదో ఒక స్వీట్ తినడం అలవాటుగా ఉంటుంది. ఇది మంచి అలవాటు కాదు. ఆరోగ్యాన్ని చెడగొట్టే అలవాటు. దాన్ని వెంటనే వదిలేయడం ఉత్తమం.

భోజనం తరువాత స్వీట్లు తినవచ్చా?
భోజనం తరువాత స్వీట్లు తినవచ్చా? (pexels)

Sweet after Meals: విందులు, వినోదాలకు వెళ్లినప్పుడు భోజనాలతో పాటు స్వీట్లు కూడా పెడతారు. సంపూర్ణ భోజనం అంటే అందులో స్వీట్ కూడా ఒకటని ఎంతోమంది భావన. నిజానికి పొట్టనిండా భోజనం చేశాక స్వీట్ తినడం మంచి పద్ధతి కాదు. ఇది ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. దీర్ఘకాలంగా ఇలా తింటే భవిష్యత్తులో డయాబెటిస్ వంటి వ్యాధులు రావడంతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

పంచదార స్వీట్లతో సమస్య

స్వీట్లను పంచదారతోనే అధికంగా చేస్తారు. బెల్లంతో చేసే స్వీట్లు చాలా తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా బయట రెడీమేడ్‌గా దొరికేవన్నీ ఎక్కువగా పంచదారతో చేసినవి. పంచదార అనేది ప్రాసెస్డ్ ఫుడ్ కిందకే వస్తుంది. అంటే దాన్ని అధికంగా శుద్ధి చేసి వాడతారు. ఎప్పుడైతే అధికంగా శుద్ధి చేశారో అది రోగాలను ఆహ్వానించే ఆహారంగా మారిపోతుంది. బెల్లాన్ని పెద్దగా శుద్ధి చేయరు. కాబట్టి బెల్లంతో చేసిన స్వీట్లు అప్పుడప్పుడు తిన్నా మంచిది. కానీ పంచదారతో చేసిన స్వీట్లు... ప్రతిరోజు తింటే మీ ఆరోగ్యాన్ని మీరే చేజేతులా చెడగొట్టుకున్న వారు అవుతారు.

పొట్ట నిండా భోజనం చేశాక ఒక గంటన్నర, రెండు గంటల్లో ఆహారంలోని చక్కెర రక్తంలో కలుస్తుంది. ఆ చక్కెర అధికంగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అమాంతం పెరుగుతాయి. అదే సమయానికి మీరు స్వీటు కూడా తినడం వల్ల అందులో ఉండే పంచదారలోని గ్లూకోజ్ కూడా కలిసి రెట్టింపు వేగంతో రక్తంలోని చక్కర స్థాయిలను పెంచుతాయి. ఇది ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అన్నంలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఇక స్వీట్లు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి డయాబెటిస్ వచ్చేస్తుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు అయితే పూర్తిగా స్వీట్లకు దూరంగా ఉండడమే మంచిది.

భోజనం చేశాక ప్రతిరోజూ ఒక స్వీట్ తిని అలవాటు ఉంటే మీరు త్వరగా డయాబెటిస్ బారిన పడుతున్నారని అర్థం చేసుకోవాలి. భోజనం చేశాక కనీసం నాలుగు గంటలు గ్యాప్ ఇచ్చాకే ఏదైనా స్వీట్ తినండి. ఈలోపు అన్నంలోనూ, ఇతర ఆహారాల్లోనూ ఉన్న చక్కెరను శరీరం శోషించుకుంటుంది. శక్తి రూపంలో ఖర్చు పెడుతుంది. కాబట్టి అన్నం తిన్నాక నాలుగు గంటల్లోపు పంచదారతో చేసిన ఏ స్వీట్స్‌నూ తినక పోవడమే ఉత్తమం.

స్వీటు తినాలన్న కోరిక మరీ అతిగా అనిపిస్తే చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి. లేదా చిన్న బెల్లం ముక్క తిని సర్దుకుపోండి. ఆహారం తిన్నాక వేగంగా నడవండి. దీనివల్ల స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అధికంగా ఉండడం మంచిది కాదు. ఇది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అతి కొద్ది కాలంలోనే ఆ ప్రభావం మీ అవయవాలపై పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మూత్రపిండాలు, గుండె తీవ్రంగా ప్రభావితమవుతాయి. అలాగే అధిక రక్తపోటు కూడా వచ్చేస్తుంది. మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి. మూడు స్వింగ్స్ పెరిగిపోతాయి. బరువు త్వరగా పెరుగుతారు. చిటికిమాటికి కోపం, చిరాకు వంటివి వస్తాయి. కాబట్టి పంచదారతో చేసిన ఆహారాలను ఎంత తగ్గించుకుంటే మీకు అంత మంచిది.

Whats_app_banner