Oats Laddu: ఓట్స్‌తో ఇలా లడ్డు చేసుకోండి, డయాబెటిస్ పేషెంట్లు కూడా తినవచ్చు-oats laddu recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Laddu: ఓట్స్‌తో ఇలా లడ్డు చేసుకోండి, డయాబెటిస్ పేషెంట్లు కూడా తినవచ్చు

Oats Laddu: ఓట్స్‌తో ఇలా లడ్డు చేసుకోండి, డయాబెటిస్ పేషెంట్లు కూడా తినవచ్చు

Haritha Chappa HT Telugu
Mar 14, 2024 03:00 PM IST

Oats Laddu: ఓట్స్‌తో చేసే ఆహారాలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఓట్స్ లడ్డ్డూను ఒకసారి చేసి చూడండి. డయాబెటిస్ పేషెంట్లు కూడా వీటిని తినవచ్చు. ఓట్స్ తో చేసే ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోండి.

ఓట్స్ లడ్డూ రెసిపీ
ఓట్స్ లడ్డూ రెసిపీ (youtube)

Oats Laddu: డయాబెటిస్ వచ్చిందంటే తీపి పదార్థాలకు దూరం అయిపోవాలి. అలాంటివారు ఓట్స్ లడ్డూను చేసుకుని ఇంట్లో నిల్వ ఉంచుకుంటే మంచిది. తీపి తినాలనిపించినప్పుడు ఈ ఓట్స్ లడ్డూను తీసుకొని తినవచ్చు. లడ్డూల్లో తీపిదనం కోసం బెల్లం తురుమును వినియోగించాము. బెల్లాన్ని మితంగా అప్పుడప్పుడు తింటే ఎలాంటి సమస్య లేదు. కాబట్టి ఎలా చేసుకోవాలో ఒకసారి తెలుసుకోండి. డయాబెటిస్ లేని వారు కూడా ఓట్స్ తో చేసిన ఆహారాలు తినడం వల్ల అంతా ఆరోగ్యమే.

ఓట్స్ లడ్డూ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఓట్స్ - ఒక కప్పు

బెల్లం తురుము - ఒక కప్పు

నువ్వులు - పావు కప్పు

యాలకుల పొడి - ఒక స్పూను

కిస్మిస్లు - గుప్పెడు

కండెన్స్‌డ్ మిల్క్ - ఒక కప్పు

బాదం పప్పులు - గుప్పెడు

ఓట్స్ లడ్డూ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులను వేడి చేసి పక్కన పెట్టుకోవాలి.

2. అలాగే బాదం పప్పులు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఓట్స్ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కళాయిలో కండెన్స్‌డ్ మిల్క్ వేసి చిన్న మంట మీద వేడి చేయాలి.

5. అందులోనే బెల్లం తురుమును, యాలకులు పొడిని కూడా వేసి కలుపుకోవాలి.

6. అలాగే నెయ్యిని వేయాలి. ఈ మిశ్రమంలో ఓట్స్ పొడి, నువ్వులు, సన్నగా తరిగిన కిస్మిస్, బాదం పప్పులు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

7. ఈ మిశ్రమమంతా దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉంచి కలుపుతూనే ఉండాలి.

8. ఇది గట్టి పడినట్టు అనిపించాక స్టవ్ కట్టేయాలి.

9. కాస్త చల్లబడ్డాక ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకొని, గాలి చొరబడని డబ్బాల్లో వేసుకోవాలి.

10. రోజుకు ఒక ఓట్స్ లడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

11. ఇక డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఈ లడ్డులు మూడు రోజులకు ఒకటి తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావు.

ఓట్స్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు ఓట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు కూడా పెరగకుండా ఉంటుంది. ఓట్స్ కేవలం డయాబెటిస్ పేషెంట్లే కాదు, ఎవరు తిన్నా కూడా జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఓట్స్‌లో పూర్తిగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రావు.

ఇక ఇందులో వాడిన బెల్లం ఆరోగ్య శరీరానికి ఐరన్ ను అందిస్తుంది. ఐరన్ లోపం వల్లే రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత వల్ల ఇతర సైడ్ ఎఫెక్టులు కూడా వస్తాయి. కాబట్టి రక్తహీనత రాకుండా ఉండాలంటే బెల్లాన్ని ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోవాలి.

పిల్లలకు ఈ ఓట్స్ లడ్డూలు ప్రతిరోజూ ఒకటి ఇవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వారిలో రక్తహీనత సమస్య రాదు. ఐరన్ లోపించడం వల్ల వచ్చే నీరసం బలహీనత అలసట వంటివి కూడా కలగకుండా ఉంటాయి. ఓట్స్ వారిలో కడుపునొప్పి, ఉబ్బరం వంటివి రాకుండా అడ్డుకుంటాయి.

టాపిక్