Women Health: నెలసరి సమయంలో మహిళలు ఈ ఆహారాలను తింటే అధిక రక్తస్రావం అవుతుందా? ఇందులో నిజం ఎంత?
Women Health: నెలసరి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల అధిక రక్తస్రావం అవుతుందనే వాదన కొంతమందిలో ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
Women Health: మహిళలు ప్రతినెలా నెలసరి అవ్వాలి. అలా అయితేనే ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు. ముఖ్యంగా ఆమె పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్టు. ప్రతినెలా ఒకే సమయానికి నెలసరి వస్తే ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే నెలసరి విషయంలో ఎంతో మందిలో ఎన్నో అపోహలు, వాదనలు ఉన్నాయి. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని అంటారు. అలాంటి ఆహార పదార్థాల జాబితాలో బొప్పాయి, పైనాపిల్, నువ్వులు, గోంగూర వంటివి ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తస్రావం అధికంగా అవుతుందని భావించే వారి సంఖ్య ఎక్కువే. దీనిపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
తింటే మంచిదే
నెలసరి సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎలాంటి ఆహారాన్ని అయినా తినవచ్చు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బొప్పాయి, పైనాపిల్, నువ్వులు, గోంగూర వంటి వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. వీటిని తినడం వల్ల నెలసరి మరింత ఆరోగ్యకరంగా అవుతుంది. మహిళల రుతుచక్రాన్ని సాఫీగా చేయడంలో ఇవన్నీ సహకరిస్తాయి. రెండు మూడు ముక్కల పైనాపిల్ తినడం వల్ల పెద్దగా జరిగే నష్టమేమీ లేదు. బొప్పాయి ముక్కలను తింటే ఎన్నో పోషకాలు విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
రోజుకో నువ్వుల లడ్డూ
పుల్లని గోంగూరలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నెలసరి ఆరోగ్యంగా జరిగేలా చేస్తుంది. ఇక నువ్వుల గురించి ఎంత చెప్పినా తక్కువే మహిళలు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో నువ్వులు ఒకటి. ముఖ్యంగా నెలసరి ఆరోగ్యం కోసం నువ్వులను తినమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది నెలసరి సమయంలో వచ్చే ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. పొట్ట ఉబ్బరం, కడుపునొప్పి, పొట్ట తిమ్మిరి వంటి సమస్యలను తగ్గించి నెలసరి సాఫీగా సాగేలా చేస్తుంది. ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డూ తినడం అలవాటు చేసుకోండి. మీకు నెలసరి సమయంలో వచ్చే ఎన్నో బాధలు తొలగిపోతాయి.
నెలసరి సమయంలో ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది. రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు ప్యాడ్స్ మారుస్తూ ఉండాలి. లేకుంటే అక్కడ ఇన్ఫెక్షన్లు, దురదలు మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నెలసరి సమయంలో తేలికపాటి ఆహారాన్ని, తాజా కూరగాయలను తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మూడు రోజుల ప్రయాణం సాఫీగా సాగేలా చేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పీరియడ్స్ సమయంలో కొన్ని రకాలా ఆహారాలు తింటే నీరసం రాకుండా ఉంటుంది. ఇనుము నిండుగా ఉన్న ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. దానిమ్మ, ఖర్జూరం, పాలకూర, మునగాకు, వంటివి కచ్చితంగా తినాలి. పాలు, పెరుగు కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. పండ్లు తినాలి. గుప్పెడు నట్స్ ప్రతి రోజూ ఉదయం తింటూ ఉండాలి.
టాపిక్