Gongura Chicken Pulao: గోంగూర చికెన్ పలావ్ ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో-gongura chicken pulao recipe in telugu know how to make this dinner recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Chicken Pulao: గోంగూర చికెన్ పలావ్ ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో

Gongura Chicken Pulao: గోంగూర చికెన్ పలావ్ ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Feb 29, 2024 05:30 PM IST

Gongura Chicken Pulao: గోంగూర చికెన్ పలావు... దీని పేరు వింటేనే నోరూరిపోతుంది. దీన్ని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సులువుగానే చేసేయొచ్చు. దీని రెసిపీ చాలా సులువు.

గోంగూర చికెన్ పలావ్ రెసిపీ
గోంగూర చికెన్ పలావ్ రెసిపీ

Gongura Chicken Pulao: గోంగూర వంటకాలకు అభిమానులు ఎక్కువే. ఇక గోంగూర చికెన్ పలావ్ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఈ వంటకాన్ని ఇంట్లోనే మీరు సింపుల్‌గా వండుకోవచ్చు. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా నచ్చుతుంది. ముఖ్యంగా చికెన్, గోంగూర రెండూ కూడా మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. కాబట్టి గోంగూర చికెన్ పలావును వారానికి ఒకసారి అయినా వండుకొని తినడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ గోంగూర కోడి పలావ్ రెసిపీ ఎలాగో చూద్దాం.

గోంగూర చికెన్ పలావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం - రెండు కప్పులు

చికెన్ ముక్కలు - ఒక కప్పు

గోంగూర తురుము - ఒక కప్పు

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

లవంగాలు - మూడు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

అనాస పువ్వు - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

జీలకర్ర పొడి - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - మూడు స్పూన్లు

నీరు - సరిపడినంత

యాలకులు - రెండు

గోంగూర చికెన్ పలావ్ రెసిపీ

1. బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, యాలకులు వేసి వేయించాలి.

4. తర్వాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.

5. అందులో అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించాలి.

6. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.

7. ఇప్పుడు చికెన్ ముక్కలను వేసి తొంభైశాతం ఉడకనివ్వాలి.

8. ఆ తర్వాత గోంగూర ఆకులను వేయాలి. పైన మూత పెడితే గోంగూర ఆకులు మెత్తగా ఉడుకుతాయి.

9. ఈ మిశ్రమం అంతా కూరలాగా దగ్గరగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

10. ఇప్పుడు ముందుగా నీటిలో నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మిశ్రమంలో వేయాలి.

11. ఒకసారి మిశ్రమాన్నంతా కలిపి బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి.

12. పావుగంట పాటూ ఉడికిస్తే బియ్యం ఉడికిపోతాయి.

13. పైన కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ కట్టేయాలి.

14. అంతే గోంగూర కోడి పలావ్ రెడీ అయినట్టే.

15. ఇది నోరూరించేలా ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒక్కసారి చేశారంటే పదే పదే చేసుకోవాలనిపిస్తుంది.

గోంగూరను ఒకప్పుడు అధికంగా తినేవారు, కానీ ఇప్పుడు తినే వారి సంఖ్య తక్కువగానే ఉంది. గోంగూర పచ్చడిని మాత్రం ఎక్కువ మంది ఇష్టపడతారు. గోంగూరతో ఒకసారి కోడి పలావ్ చేసుకుని తినండి. రుచి అదిరిపోతుంది. ఈ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, బీటా కెరాటిన్... ఇవన్నీ నిండుగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సినవి కాబట్టి వారానికి ఒక్కసారైనా గోంగూరను తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారు గోంగూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. బరువు తగ్గే వారు గోంగూరను తింటూ ఉంటే త్వరగా క్యాలరీలను కరిగించుకోవచ్చు.

ఇక ఇందులో వాడిన చికెన్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్ పుష్కలంగా చికెన్లో ఉంటుంది. అందుకే చికెన్ తినమని వైద్యులు సూచిస్తారు. దీనిలో విటమిన్ బీ6, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి అవసరమైనవే. ఇనుము, జింక్ వంటి ఖనిజాలు కూడా ఇందులో లభిస్తాయి. జీవక్రియను మెరుగుపరచడంతో పాటు చికెన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కాబట్టి గోంగూర చికెన్ పలావ్ ఎన్నిసార్లు తిన్నా మనకు ఆరోగ్యమే. వారానికి ఒకసారి ఇది చేసుకుని చూడండి, ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.

WhatsApp channel