Chilli Fish: చిల్లి చికెన్‌లాగే చిల్లీ ఫిష్ వండుకోవచ్చు, ఇది చూస్తేనే నోరూరిపోతుంది-chilli fish recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chilli Fish: చిల్లి చికెన్‌లాగే చిల్లీ ఫిష్ వండుకోవచ్చు, ఇది చూస్తేనే నోరూరిపోతుంది

Chilli Fish: చిల్లి చికెన్‌లాగే చిల్లీ ఫిష్ వండుకోవచ్చు, ఇది చూస్తేనే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu
Feb 22, 2024 11:39 AM IST

Chilli Fish: చేపలతో చిల్లి ఫిష్ ఒక్కసారి ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట స్నాక్‌గా ఉపయోగపడుతుంది. దీన్ని చేయడం చాలా సులువు.

చిల్లీ ఫిష్ రెసిపీ
చిల్లీ ఫిష్ రెసిపీ (youtube)

Chilli Fish: చిల్లి చికెన్, చిల్లీ మటన్ చాలా టేస్టీగా ఉంటాయి. చిల్లీ పనీర్‌ను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. కేవలం వీటితోనే కాదు చేపలతో కూడా చిల్లి ఫిష్ వండుకోవచ్చు. ఇది సాయంత్రం స్నాక్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీకి అరగంట నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. దీన్ని తింటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ ఫిష్ రెసిపీని చపాతీతో తిన్నా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ చిల్లి ఫిష్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

చిల్లీ ఫిష్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ముళ్ళు తీసిన చేప ముక్కలు - 300 గ్రాములు

కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు

తెల్ల సొన - ఒక గుడ్డులోనిది

టమాటా కెచప్ - ఒక స్పూన్

వెనిగర్ - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - రెండు స్పూన్లు

మిరియాల పొడి - పావు స్పూను

క్యాప్సికం తరుగు -ఒక కప్పు

వెల్లుల్లి తరుగు - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - నాలుగు

కారం - అర స్పూను

వెల్లుల్లి పేస్ట్ - అర స్పూను

అల్లం పేస్ట్ - అర స్పూను

బియ్యం పిండి - ఒక స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

చిల్లీ ఫిష్ రెసిపీ

1. చేప ముక్కలను తీసుకుని ఒక గిన్నెలో వేయాలి.

2. అందులో రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారంపొడి వేసి మ్యారినేట్ చేసి అరగంట పాటు పక్కన పెట్టేయాలి.

3. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, గుడ్డులోని తెల్ల సొన, కాస్త ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.

4. స్టవ్ మీద కళాయి పెట్టి చేప ముక్కలను డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

5. చేప ముక్కలను కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి తీసి వేడి నూనెలో వేయాలి.

6. అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. అలా అన్నిటిని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు మరో కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. అందులో క్యాప్సికం తరుగు, ఉల్లిపాయలు తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించుకోవాలి.

8. అలాగే స్ప్రింగ్ ఆనియన్లను కూడా వేసి వేయించాలి. మంటను మీడియంలో ఉంచుకోవాలి.

9. రెండు మూడు నిమిషాల పాటు ఇవన్నీ వేయించాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి మెల్లగా కలుపుకోవాలి.

10. అందులోనే వెనిగర్, టమోటా కెచప్, రెడ్ చిల్లీ సాస్, సోయాసాస్ వేసి టాస్ చేయాలి.

11. పైన స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకొని వేడిగా సర్వ్ చేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.

చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చేపల్లో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అత్యవసరమైనవి. గుండెపోటు రాకుండా అడ్డుకోవడంలో చేపలు ముఖ్యమైనవి. అలాగే డిప్రెషన్, ఒత్తిడి వంటి వాటితో పోరాడే శక్తి చేపలు ఇస్తాయి. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్న ప్రకారం చేపల తినడం వల్ల ఆరోగ్యానికి అంత మేలే జరుగుతుంది. అధికంగా తినడం వల్ల వయసు పెరిగాక వచ్చే మతిమరుపు రాకుండా ఉంటుంది. వీటిని వారానికి రెండు సార్లు తినడం చాలా ముఖ్యం. కొవ్వు పట్టిన చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెపోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చేపలు తినడం వల్ల సంతోష హార్మోన్లైన డోపమైన్, సెరటోనిన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఒత్తిడిని, మానసిక ఆందోళనను తగ్గిస్తాయి. కాబట్టి వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు చేపలు తినడం అలవాటు చేసుకోండి. ఒకసారి ఈ చిల్లి ఫిష్ ప్రయత్నించండి.

Whats_app_banner