Rajma Pulao : రాజ్మా పలావ్ ఎలా తయారు చేయాలి? ఈజీగా.. టేస్టీగా
Rajma Pulao In Telugu : రాజ్మా కర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే రాజ్మాతో చేసే పలావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ కావాలని కోరుకుంటారు. ఎలా తయారు చేయాలో చూద్దాం..
పలావ్ అనగానే కొందరి నోర్లలో నీళ్లు ఊరుతాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచికరమైనది పలావ్. అయితే పలావ్ ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టిందా? అయితే కొత్తగా రాజ్మా పలావ్ తయారు చేయండి. రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇది అల్పాహారం, లంచ్, డిన్నర్‍లోకి కూడా తినేయోచ్చు.
రోజూ మధ్యాహ్న భోజనంలోకి అన్నం సాంబారు తిని బోర్ కొట్టినవారు కొత్తగా ట్రై చేయండి. సాధారణ పలావ్ తిని వద్దు బాబోయ్ అనుకున్నవారు.. రాజ్మాతో రుచికరమైన పలావ్ తయారు చేసుకోవచ్చు. మసాలా కూరల కోసం ఎక్కువగా రాజ్మాను ఉపయోగించి ఉండవచ్చు. కానీ పలావ్ కోసం కూడా ఓసారి వాడండి. ఇప్పుడు రాజ్మా పలావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
రాజ్మా పలావ్ చేయడానికి కావలసిన పదార్థాలు
అర కప్పు రాజ్మా విత్తనాలు
1 కప్పు బాస్మతి బియ్యం
నెయ్యి 2 స్పూన్లు
ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క
2 లవంగాలు
2 ఏలకులు
½ టేబుల్ స్పూన్ జీలకర్ర గింజలు
½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టేబుల్ స్పూన్ గరం మసాలా
1 ఉల్లిపాయ
1 టమోటా
3 పచ్చిమిర్చి
కొంచెం పుదీనా
కారం పొడి 1 టేబుల్ స్పూన్
మెంతులు అర చెంచా
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం
రుచికి సరిపడా ఉప్పు
రాజ్మా పలావ్ ఎలా తయారు చేయాలి
ముందుగా పైన పేర్కొన్న వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. అంతుకుముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. రాజ్మాను రాత్రంతా నానబెట్టడం మర్చిపోవద్దు. తర్వాత ఉదయం నీటిలో ఉడకబెట్టండి. రాజ్మాలో రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత కుక్కర్‌లో నుంచి రాజ్మాను తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో నుంచి నీరు తీసేయాలి.
ఇప్పుడు అదే కుక్కర్‌లో నెయ్యి వేసి వేడయ్యాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. తరిగిన ఉల్లిపాయలు జోడించి బాగా కలపాలి.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి. వాసన పోయే వరకు వేయించాలి.
దీని తర్వాత తరిగిన టొమాటో, కారం, మెంతులు, గరం మసాలా వేయాలి. టొమాటో ముక్కలు మెత్తబడనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి.
దీని తర్వాత ఒకటిన్నర కప్పు నీరు కలపండి. బాస్మతి బియ్యం వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కలపండి. రుచి కోసం ఉప్పును వేయాలి. తర్వాత కుక్కర్‌ను మూసివేయండి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేయండి. కాసేపయ్యాక కుక్కర్ మూత తెరిచి చూడండి. రుచికరమైన రాజ్మా పలావ్ రెడీగా అయింది. అల్పాహారంగా కూడా తినవచ్చు. మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు.