Gongura Paneer Curry: పుల్ల పుల్లగా గోంగూర పన్నీర్ కర్రీని ఇలా వండండి, వేడి అన్నంలో అదిరిపోతుంది-simple and easy gongura paneer curry recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Paneer Curry: పుల్ల పుల్లగా గోంగూర పన్నీర్ కర్రీని ఇలా వండండి, వేడి అన్నంలో అదిరిపోతుంది

Gongura Paneer Curry: పుల్ల పుల్లగా గోంగూర పన్నీర్ కర్రీని ఇలా వండండి, వేడి అన్నంలో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Feb 15, 2024 11:59 AM IST

Gongura Paneer Curry: గోంగూర పనీర్ కాంబినేషన్ చాలా తక్కువగా విని ఉంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర చికెన్ లాగే, గోంగూర పన్నీర్ కర్రీ కూడా రుచిలో అద్భుతంగా ఉంటుంది.

గోంగూర పన్నీర్ కర్రీ రెసిపీ
గోంగూర పన్నీర్ కర్రీ రెసిపీ

Gongura Paneer Curry: తెలుగు వారికి ఇష్టమైన ఆకుకూరల్లో గోంగూర ఒకటి. గోంగూర పచ్చడి అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది. అలాగే గోంగూర మటన్, గోంగూర చికెన్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక శాఖాహారుల విషయానికి వస్తే వారు గోంగూర పనీర్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. ఇది పుల్లపుల్లగా టేస్టీగా ఉంటుంది. కారం వేసుకుంటే పులుపు, కారం కలిసిన రుచి కొత్తగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ గోంగూర పన్నీర్ కర్రీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. పుల్లగా ఈ గోంగూర పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

గోంగూర పన్నీర్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పనీర్ - 200 గ్రాములు

గోంగూర - ఒక కట్ట

ఆవాలు - అర స్పూను

నూనె - తగినంత

జీలకర్ర - అర స్పూను

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కారం - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

నీళ్లు - సరిపడినన్ని

టమోటాలు - రెండు

పచ్చిమిర్చి - మూడు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

ఎండు మిర్చి - రెండు

గోంగూర పన్నీర్ కర్రీ రెసిపీ

1. పనీర్‌ను చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. గోంగూర ఆకులను ఏరి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసి చిటపటలాడించాలి.

5. తర్వాత ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయించాలి.

6. వాటి రంగు మారేవరకు అలా వేయించుకోవాలి.

7. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా వేయించుకోవాలి.

8. ఆ మిశ్రమంలోనే పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

9. ఇదంతా కాస్త ఇగురు లాగా అయ్యాక శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసి బాగా కలపాలి.

10. పైన మూత పెట్టి గోంగూర మెత్తగా అయ్యే వరకు ఉంచాలి.

11. గోంగూర మగ్గిన తర్వాత టమోటోలను మిక్సీలో వేసి ఫ్యూరీ లాగా చేయాలి.

12. ఆ ప్యూరీని కూడా గోంగూరలో వేసి బాగా కలుపుకోవాలి.

13. నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక గ్లాసు నీళ్లు వేసి పైన మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.

14. అది ఇగురులాగా అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసుకున్న పనీర్ క్యూబ్స్ ను వేసి చిన్న మంట మీద ఉడికించాలి.

15. అలా ఒక పావుగంట సేపు ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుంది.

16. ఈ గోంగూర పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.

17. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, దోశలోకి ఈ పనీర్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది.

18. గోంగూర పన్నీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మీరే చేసుకుని తింటారు.

ఈ కూరలో ముఖ్యంగా వాడింది గోంగూర, పన్నీర్. ఈ రెండూ కూడా ఆరోగ్యపరంగా మనకు మేలు చేసేవే. పనీర్ ప్రోటీన్లు అందిస్తే, పుల్లని గోంగూర విటమిన్ సి ని పుష్కలంగా అందిస్తుంది. ఈ రెండూ కలిసి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గోంగూరతో చేసిన వంటకాలు వారానికి రెండుసార్లు అయినా తినడం చాలా ముఖ్యం. ఇక శాఖాహారులకు ప్రోటీన్ పుష్కలంగా ఉండాలి. అందుకే ప్రతిరోజు పనీర్ తో చేసిన వంటకాలను తినాలి. పనీర్ పిల్లలకు తినిపించడం వల్ల వారు రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. అలాగే గోంగూర తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.