Nuvvula Annam: నువ్వుల అన్నం రెసిపీ ఇదిగో, దీన్ని తింటే ఆరోగ్యమే కాదు ఎంతో బలం కూడా
Nuvvula Annam: నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులతో చేసిన ఆహారాలను తినడం వల్ల శరీరాన్ని బలంగా మార్చుకోవచ్చు. నువ్వుల అన్నం రెసిపీ ఇక్కడ ఇచ్చాము. వారానికి ఒకసారి ఇలా నువ్వుల అన్నం చేసుకొని తినండి.
Nuvvula Annam: నువ్వులతో ఒకప్పుడు ఎన్నో రకాల వంటకాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు వాటి వాడకం చాలా వరకు తగ్గింది. నిజానికి నువ్వులు చేసే మేలు అంతా ఇంతా కాదు. అప్పుడప్పుడు నువ్వుల అన్నాన్ని ఇంట్లో అందరికీ తినిపించండి. ఇది బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. నువ్వుల అన్నం పిల్లలకు, పెద్దలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. నువ్వుల అన్నం చాలా సింపుల్ గా చేయవచ్చు.
నువ్వుల అన్నం రెసిపీకి కావలసిన పదార్థాలు
నువ్వులు - పావు కప్పు
వండిన అన్నం - రెండు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
కరివేపాకులు - గుప్పెడు
ఆవాలు - అర స్పూను
వెల్లుల్లి - ఐదు రెబ్బలు
ఎండుమిర్చి - నాలుగు
వేరుశెనగ పలుకులు - గుప్పెడు
మినప్పప్పు - ఒక స్పూను
శనగపప్పు - ఒక స్పూన్
నూనె - రెండు స్పూన్లు
నువ్వుల అన్నం రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి వేడి చేయాలి. అది వేడెక్కాక శెనగపప్పు, ఎండుమిర్చి, నువ్వులు, మినప్పప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. మిక్సీ జార్ లో వాటిని తీసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఆవాలు చిటపటలాడించాలి.
4. తర్వాత వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేయించాలి.
5. కరివేపాకులు, వేరుశెనగ పలుకులు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.
6. చివర్లో పసుపును కూడా వేసి వేయించాలి.
7. ఇప్పుడు ఇందులో వండిన అన్నాన్ని వేసి మెల్లగా కలపాలి.
8. రుచికి సరిపడా ఉప్పును కూడా చల్లుకోవాలి.
9. ముందుగా చేసి పెట్టుకున్న నువ్వులు పొడిని వేసి అన్నం ముద్ద కాకుండా పులిహోర కలిపినట్టు కలుపుకోవాలి. అంతే నువ్వులా అన్నం రెడీ అయినట్టే.
నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా మహిళలు నువ్వులు తినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి నెలసరి సమయంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను తగ్గించే శక్తి నువ్వులకు ఉంది. నెలసరి సమయంలో ఎంతోమందికి పొట్టనొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పిని తగ్గించే శక్తి నువ్వులకు ఉంది. కాబట్టి ప్రతిరోజూ చిన్న నువ్వుల లడ్డు తినడం అలవాటు చేసుకుంటే మంచిది. నువ్వుల్లో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, థయామిన్, జింక్, ఐరన్ వంటివి లభిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నువ్వులు తరచూ తింటే గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని కూడా నువ్వులు తగ్గిస్తాయి. ఇక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు నువ్వులను తినడం అలవాటు చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకునే శక్తి నువ్వులకు ఉంది. బరువు తగ్గాలనుకున్నవారు నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి. అధిక రక్తపోటుతో ఉన్నవారు కూడా నువ్వుల నూనె ఆహారంగా తినడం వల్ల వారికి రక్త పోటు అదుపులో ఉంటుంది. ఒకసారి ఈ నువ్వుల అన్నాన్ని చేసుకుని చూడండి, దీని రెసిపీ మీకు నచ్చడం ఖాయం.