Abortion and Periods: అబార్షన్ అయ్యాక ఎప్పుడు నెలసరి మొదలవుతుంది? అబార్షన్ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Abortion and Periods: మహిళల జీవితంలో అప్పుడప్పుడు అబార్షన్ వంటి చేదు పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అబార్షన్ అయ్యాక పీరియడ్స్ మళ్లీ రెగ్యులర్ గా మారితేనే తిరిగి గర్భం ధరించడం సులువు అవుతుంది.
Abortion and Periods: అబార్షన్ అవడం అనేది మహిళల్లో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వారి భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. గర్భం ధరించాక తల్లి ఎంతో ఆనందపడుతుంది. ఆ ఆనందాన్ని గర్భస్రావం ఒకేసారి కుంగదీసేలా చేస్తుంది. స్త్రీలకు అబార్షన్ కావడం అనేది అప్పుడప్పుడు జరిగే పరిణామం. మన దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మందికి పైగా స్త్రీలు జీవితంలో ఒక్కసారి అయినా అబార్షన్ బారిన పడుతున్నారు. అయితే గర్భస్రావం తర్వాత నెలసరి ఎప్పుడు మొదలవుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై మహిళలు తక్కువ అవగాహన ఉంది. అబార్షన్ తర్వాత మొదటి పీరియడ్ ఎప్పుడు వస్తుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
నెలసరి ఎప్పుడు వస్తుంది?
ప్రతి మహిళా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అబార్షన్ అయినా లేదా అబార్షన్ చేయించుకున్నా... ఒకేలాంటి జాగ్రత్తలను పాటించాలి. గర్భస్రావం అయ్యాక కొంతమంది మహిళలు డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు వారికి మద్దతుగా నిలబడాలి. అబార్షన్ అయిన మహిళల్లో ఆత్రుత, ఆందోళన వంటివి పెరిగిపోతాయి. మొదటి పీరియడ్స్ ఎప్పుడు వస్తాయా అన్న ఆందోళన కూడా ఎక్కువగానే ఉంటుంది. అబార్షన్ అయ్యాక నాలుగు నుండి ఆరు వారాలలోపు నెలసరి వచ్చేస్తుంది. సాధారణంగానే ప్రతినెలా ఋతుస్రావం అవడం ప్రారంభమవుతుంది. గర్బస్రావం అయ్యాక వచ్చే మొదటి నెలసరి కాస్త బాధాకరంగా ఉండవచ్చు. నొప్పి పెట్టవచ్చు. ఆ తరువాత వచ్చే నెలసరి సాధారణంగా మారిపోతుంది.
అబార్షన్‌కి ముందు ఎంతగా మీకు రక్తస్రావం అయ్యేదో, గర్భస్రావం తర్వాత కూడా అంతే రక్తస్రావం అవుతుంది. మొదటిసారి కొంతమందిలో ఎక్కువ అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి మాత్రం సాధారణంగానే రక్తస్రావం అవుతుంది. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి భయమూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది స్త్రీలలో పాలీసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్, ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ వంటివి ఉంటే... అలాంటి వారికి గర్భం ధరించడం చాలా కష్టం. ఒకవేళ గర్భం ధరించిన తర్వాత అబార్షన్ కూడా కావచ్చు. అలాంటి సమయంలో మాత్రం వారికి మళ్లీ నెలసరి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
అబార్షన్ జరిగాక కొన్ని రోజులు పాటు రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రక్తస్రావాన్ని చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. గర్భస్రావం అయ్యాక వారం రోజులు పాటు ఇలా రక్తస్రావం అవ్వచ్చు. ఆ తర్వాత ఆగిపోతుంది. కొంతమందికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే అవుతుంది.
జాగ్రత్తలు తప్పవు
అబార్షన్ అయిన తర్వాత మొదటి పీరియడ్స్ నాలుగు నుంచి ఆరు వారాల లోపు వచ్చేస్తాయి. అలా రాకపోతే మాత్రం ఒకసారి వైద్యులను సంప్రదించడం ముఖ్యం. అబార్షన్ అయ్యాక రక్తస్రావం వారం రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే అబార్షన్ తర్వాత రక్తస్రావంతో పాటు నొప్పి, జ్వరం ఉన్నా కూడా వైద్యులను సంప్రదించి మందులు వాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుకోకుండా గర్భం దాల్చి అబార్షన్ చేయించుకుంటారు. అలాంటి వారు ముందుగానే గర్భనిరోధక పద్ధతులను పాటించడం ముఖ్యం. అబార్షన్ చేయించడం అంటే ఒక ప్రసవంతోనే సమానం. కాబట్టి అబార్షన్ అయ్యే పరిస్థితులు లేదా అబార్షన్ చేయించుకునే స్థితికి చేరకుండా జాగ్రత్త పడండి.