DIY Homemade Lip Balm | మీ ఇంట్లోనే సహజమైన లిప్ బామ్ చేసుకోండి, చలికి పెదాలు పగిలితే ఇదే పరిష్కారం!
DIY Lip Balm: చలికాలంలో పెదాల సంరక్షణ కోసం లిప్ బామ్ ఉపయోగించండి. మార్కెట్ లో కొనుగోలు చేసేవి కాకుండా సహజ ఉత్పత్తులు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లోనే లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ DIY Homemade Lip Balm ఐడియాలు ఉన్నాయి, చూడండి.
చలికాలంలో పెదవులు పగలడం అనేది చాలా సాధారణమైన విషయం. వాతావరణం కాకుండా, పెదవులు పొడిబారడానికి మరో కారణం తక్కువ నీరు త్రాగడం. పెదవులు సహజమైన తేమను కోల్పోయినప్పుడు ఇలా జరురుగుతుంది. కాబట్టి పెదాలు సహజమైన రంగుతో అందంగా ఉండాలంటే తగినంత నీరు తాగుతుండాలి. కొన్నిసార్లు నీరు సమృద్ధిగా తాగినప్పటికీ కూడా పెదాలలో పగుళ్లు ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ మృదువైన చర్మం ఉంటుంది, ఇలాంటి పరిస్థితుల్లో బయటి నుంచి కూడా తగిన సంరక్షణ చర్యలు తీసుకోవాలి.
ఈ చలికాలంలో పెదాల పగుళ్లకు లిప్ బామ్ చక్కని పరిష్కారంగా ఉంటుంది. పెదవులపై లిప్ బామ్ అప్లై చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే మార్కెట్‌లో లభించే లిప్ బామ్‌లలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి, వాటి కారణంగా మీ పెదవులు సహజ రంగును కోల్పోవచ్చు, ఆ రసాయనాలు నోటిలోకి వెళ్లినపుడు ఏమంత హానికరం కాకపోయినా, శ్రేయస్కరం అయితే కాదు.
బీట్‌రూట్ లిప్ బామ్
నేచురల్ లిప్ బామ్ చేయడానికి, ముందుగా మీరు బీట్‌రూట్‌ను తొక్క తీసి, ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలను గ్రైండ్ చేసి, దాని రసాన్ని ఒక స్ట్రైనర్ లేదా గుడ్డ సహాయంతో వడకట్టండి. ఇప్పుడు బీట్‌రూట్ రసాన్ని బాగా మరిగించాలి. ఆపై తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులో అలోవెరా జెల్, కొబ్బరి నూనె కలపాలి. అంతే. బీట్‌రూట్‌తో లిప్ బామ్ సిద్ధం.
మీరు బీట్‌రూట్ లిప్ బామ్ రాసుకుంటే పెదాలకు మంచి రంగు వస్తుంది, పగుళ్లను నివారించవచ్చు. ఈ లిప్ బామ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా ఒక నెల పాటు ఉపయోగించవచ్చు.
రంగులేని లిప్ బామ్ ఎలా తయారు చేయాలి
వేడిని తట్టుకోగలిగే ఒక కంటైనర్ కప్పు తీసుకుని అందులో 1 టీస్పూన్ బీస్‌వాక్స్ వేయండి. ఇప్పుడు అర టీస్పూన్ నుటెల్లా వేయాలి. ఇది కలిపిన తర్వాత అందులో కొబ్బరి నూనె వేయాలి. దీని తరువాత, మరొక గిన్నెలో నీటిని మరిగించి, అందులో మిశ్రమం ఉన్న కంటైనర్ గిన్నెను ఉంచాలి. మిశ్రమం బాగా కరిగి, ద్రావణంలాగా మారినపుడు. దీనిని మరొక బాక్స్‌లోకి తీసుకొని చల్లబరి, 10 నిమిషాలు ఫ్రీజర్‌లో ఉంచండి. మీ లిప్ బామ్ సిద్ధంగా ఉంది.