Christmas Heart Syndrome: క్రిస్మస్ హార్ట్ సిండ్రోమ్.. వీరికి ఈ రిస్క్ ఎక్కువ
Christmas Heart Syndrome: క్రిస్మస్ హార్ట్ సిండ్రోమ్ గురించి విన్నారా? దీనినే క్రిస్మస్ కరోనరీ అని కూడా అంటారు. కొందరిలో ఈ రిస్క్ చాలా ఎక్కువ.
క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వంటి సెలబ్రేషన్స్ సమయంలో అన్నీ విందు భోజనాలే. చలి కారణంగా వ్యాయామానికి కూడా బ్రేక్ ఇస్తుంటారు. పార్టీల కారణంగా ఆల్కహాల్ తీసుకోవడం, అదికూడా తరచుగా, ఎక్కువగా తీసుకోవడం చేస్తుంటారు. అయితే వింటర్ హాలిడే సీజన్‌లో ఎక్కువగా గుండె పోట్లు సంభవించినట్టు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఏడాది పొడవునా ఎప్పుడు రానంతగా డిసెంబరు 25 నుంచి జనవరి 1 మధ్య ఎక్కువగా గుండె జబ్బులు, స్ట్రోక్స్ వస్తుంటాయని ఈ అధ్యయనాల్లో తేలింది.
ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత పండా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతులు వివరించారు. ‘క్రిస్మస్, న్యూఇయర్ హాలిడే సమయాల్లో ఫుడ్, ఆల్కహాల్ విషయంలో మనం కంట్రోల్ తప్పుతుంటాం. అవి మన విల్‌పవర్‌కు పరీక్షలాంటివి. పైగా మెడికేషన్ స్కిప్ చేస్తాం. తినడం, తాగడంపై దృష్టిపెడుతుంటాం. నిద్ర సరిగ్గా ఉండదు. ఆలస్యంగా నిదురిస్తుంటాం. వ్యాయామం పక్కన పెట్టేస్తుంటాం. మన శరీరం చెప్పేది అస్సలు వినం. అది ఇచ్చే హెచ్చరిక సంకేతాలను కూడా పట్టించుకోం. కొత్త సంవత్సరం వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా వైద్యపరమైన సహాయం తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటాం..’ అని వివరించారు.
‘ఈ సమయంలో కుటుంబ చర్చలు, ఆర్థిక సమస్యలు, ప్రయాణాలు, బిజీ షెడ్యూళ్లు వంటి వాటి నుంచి కాస్త ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి లేనంతవరకు ఇవి ఒకే. కానీ ఒత్తిడి ఎదురైతే మీ ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతాయి. విందు భోజనాల్లో ఆయిల్ ఫుడ్ బాగా లాగించడం, ఫ్రైడ్ ఫుడ్, అధిక ఉప్పు, ఆలస్యంగా నిద్రించడం, పొగ తాగడం, లేదా పక్కనోడు స్మోక్ చేస్తుంటే పీల్చాల్సి రావడం మీ గుండె జబ్బులను పెంచుతాయి. హార్ట్ బీట్ సక్రమంగా కొట్టుకోకపోవడం, గుండె పోటు కూడా ఎదురవ్వొచ్చు..’ అని ఆయన వివరించారు.
ఈ లక్షణాలు గమనించాలి..
- చాతీలో అసౌకర్యంగా ఉండడం
- శ్వాస ఆడకపోవడం
- మైకంగా ఉండడం, అలసటగా ఉండడం
- చాతీలో ఆకస్మికంగా అసౌకర్యంగా అనిపించడం, అల్లాడిపోవడం
- యాంగ్జైటీ పెరగడం
- కళ్లు మసక బారడం
అయితే ఇప్పటికే కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. ఆ వ్యాధులు ఏంటంటే
అధిక రక్తపోటు:
మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా మీరు వైద్యుడిని సంప్రదించాలి. షుగర్, ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి, బ్లడ్ ప్రెజర్ పెరిగి హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్‌కు దారితీస్తుంది. అధిక క్యాలరీలు ఉన్న ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కంటే పండ్లు, తృణ ధాన్యాలు తీసుకోవాలి.
డయాబెటిస్, గుండె అనారోగ్యం
డయాబెటిస్, గుండె జబ్బులు కలిగిన పేషెంట్లలో కార్బొనేటెడ్ డ్రింక్స్, అలాగే ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవద్దు. వీటిలో అధిక మొత్తంలో షుగర్ ఉంటుంది. ఇది గుండె జబ్బులను మరింత పెంచుతుంది.
ఒత్తిడి
నిద్ర వేళల్లో మార్పులు కూడా ఒత్తిడిని పెంచుతాయి. వేడుకలు ఉన్న రోజుల్లో కూడా కనీసం ఏడెనిమిది గంటలపాటు తప్పనిసరిగా నిద్ర పోవాలి.
వేడుకల సమయాల్లో మీ గుండె ఆరోగ్యానికి సూచించిన టిప్స్
- యాక్టివ్‌గా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.
- హైడ్రేటెడ్‌గా ఉండాలి. ప్రాసెస్డ్ జ్యూసెస్, కార్బొనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి.
- మందులు మరిచిపోరాదు. బ్లడ్ ప్రెజర్, షుగర్, హార్ట్ సమస్యలు ఉన్న పేషెంట్లు తమ మందులను అస్సలు విస్మరించరాదు.
- అతిగా తినడం మంచిది కాదు. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ముందుగా సలాడ్ తీసుకోవడం మంచిది. కడుపు నిండుగా ఉంటుంది.
- ఒత్తిడికి దూరంగా ఉండండి. తగినంత నిద్ర పోవడం ద్వారా మీ శరీరం మానసిక, శారీరక అలసట నుంచి కోలుకునేందుకు వీలవుతుంది.
- స్మోకింగ్‌కు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. అది మీ బ్లడ్ ప్రెజర్‌ను పెంచుతుంది. మధుమేహం మరింత అదుపు తప్పుతుంది.
- 1970ల కాలం నుంచి హాలిడే హార్ట్ సిండ్రోమ్ గురించి పరిశోధకులు చెబుతున్నారు. హాని కలిగించే ఫుడ్, ఆల్కహాల్ వంటివి ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నట్టు గమనించారు. అయితే మితిమీరకుండా ఒక మోతాదులో ఏదైనా పరవాలేదనే నియమాన్ని పెట్టుకుని దానిని కచ్చితంగా ఆచరించాలని సూచిస్తున్నారు. హాలిడే హార్ట్ సిండ్రోమ్ నివారించడం కచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అందువల్ల క్రమశిక్షణ మరవవద్దని డాక్టర్ పాండా సూచిస్తున్నారు.