Chicken Soup Recipe: చికెన్ సూప్ ఇలా చేసుకొని తాగుతూ ఉండండి, వానాకాలంలో అంటువ్యాధులు రాకుండా ఉంటాయి-chicken soup recipe in telugu know how to make this healthy soup ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Soup Recipe: చికెన్ సూప్ ఇలా చేసుకొని తాగుతూ ఉండండి, వానాకాలంలో అంటువ్యాధులు రాకుండా ఉంటాయి

Chicken Soup Recipe: చికెన్ సూప్ ఇలా చేసుకొని తాగుతూ ఉండండి, వానాకాలంలో అంటువ్యాధులు రాకుండా ఉంటాయి

Haritha Chappa HT Telugu

Chicken Soup Recipe: చికెన్ సూప్ అప్పుడప్పుడు తాగడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వానాకాలంలో, శీతాకాలంలో చికెన్ సూప్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చికెన్ సూప్ రెసిపీ ఇదిగో.

చికెన్ సూప్ రెసిపీ

Chicken Soup Recipe: చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ చికెన్ సూప్‌ను తాగేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపరు. నిజానికి చికెన్ సూప్ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వానాకాలం, శీతాకాలంలో శరీరానికి అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. కాబట్టి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చికెన్ సూప్‌ను వేడివేడిగా అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌ల బారిన పడకుండా కాపాడుతుంది. చికెన్ సూప్‌ను చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇక్కడ ఇచ్చాము, ఫాలో అయిపోండి.

చికెన్ సూప్ రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ ముక్కలు - పావు కిలో

ఉల్లిపాయ - ఒకటి

జీలకర్ర - ఒక స్పూను

ధనియాలు - రెండు స్పూన్లు

మిరియాలు - అర స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - నాలుగు

అల్లం - చిన్న ముక్క

క్యారెట్లు - ఒకటి

బంగాళదుంప - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

నీరు - అర లీటరు

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - ఒకటిన్నర స్పూను

యాలకులు - మూడు

లవంగాలు - మూడు

దాల్చిన చెక్క - మూడు

అనాస పువ్వు - ఒకటి

బిర్యానీ ఆకులు - రెండు

పుదీనా తరుగు - అరకప్పు

కొత్తిమీర తరుగు - అరకప్పు

కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు

చికెన్ సూప్ రెసిపీ

1. చికెన్ ముక్కలను ఎముకలతో సహా తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. మిక్సీ జార్లో ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు కుక్కర్లో చికెన్ ముక్కలు, ఈ మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

4. క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

5. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇవి ఉడకడానికి అర లీటర్ నీళ్లు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి.

6. నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

7. ఆవిరిపోయాక కుక్కర్ మూత తీయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. కళాయిలో నెయ్యిని వేయాలి. అందులో జీలకర్ర, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.

9. తర్వాత కుక్కర్లో ఉన్న చికెన్ మిశ్రమం మొత్తం ఇందులో వేసి ఉడకనివ్వాలి.

10. పైన పుదీనా తరుగు, కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.

11. ఇది ఉడుకుతున్నప్పుడు చిన్న గిన్నెలో నీళ్లు వేసి రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి.

12. దాన్ని కూడా సూప్‌లో వేసి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

13. ఈ సూప్ కాస్త చిక్కగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

14. దీన్ని వేడివేడిగా తాగాలి. చికెన్ ముక్కలను అందులో ఉన్న ఇతర కూరగాయలను కూడా తినేయాలి.

15. ఇది ఆరోగ్యకరమైన సూప్ ఈ చికెన్ సూప్ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

వాతావరణం చల్లబడుతున్న కొద్ది బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగిపోతాయి. కాబట్టి మన శరీరానికి మరింత రోగ నిరోధక శక్తి అవసరం పడుతుంది. అలాంటప్పుడు చికెన్ సూప్‌ను తాగడం వల్ల అంటువ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.