Work-life Balance । వృత్తికి, జీవితానికి తేడా లేకుండా పోతుందా? సమతుల్యత ఇలా పొందండి!
Work-life Balance: పూర్తిగా వృత్తికే అంకితమై, వ్యక్తిగత జీవితం అనేది లేకుండా పోతే శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. జీవితంలో సమతుల్యత కనుగొనడానికి చిట్కాలు
జీవించడానికి ఏదో ఒక పని కావాలి కానీ, ఆ పనే జీవితం కాకూడదు. ఈ రోజుల్లో చాలామందికి వృత్తి జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య అంతరం చెదిరిపోయింది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సమయం అనేదే లేకుండా పోతుంది. తమ కుటుంబ అసవరాలను, తమ వ్యక్తిగత అవసరాలను కూడా చూసుకోలేనంత బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. రోజులో ఎక్కువ భాగం వృత్తికే అంకితం అవ్వడంతో, వ్యక్తిగత జీవితం అనేది కుచించుకుపోతుంది, ఫలితంగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఆ చిరాకును ఇతరులపై ప్రదర్శిస్తూ మరిన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు. శారీరకంగా, మానసికంగా అలసిపోతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.
వృత్తి జీవితం- వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఉన్నప్పుడే చేసే వృత్తి సంతృప్తిని ఇస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సంబంధాలు ఆరోగ్యకరంగా సాగుతాయి. అయితే మీ శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడే ఈ సమతుల్యతను సాధించడమే అసలైన సవాలు. ఇది ఏమంత సులభంగా లభించేది కాదు.
Tips for Healthy Work-life Balance- వృత్తి, మీ జీవితానికి మధ్య సమతుల్యత
మీ వృత్తి, మీ జీవితానికి మధ్య సమతుల్యతను సాధించడానికి నిపుణులు కొన్ని ఉపాయాలను సూచిస్తున్నారు. ఇవి కొంతలో కొంత మార్పును తీసుకురాగలవు. ఆ చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.
సరిహద్దులను సెట్ చేయండి:
మీ పని, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయండి. పని సంబంధిత ఇమెయిల్‌లు లేదా కాల్‌లను తనిఖీ చేయడం, వాటికి ప్రతిస్పందించడం కోసం నిర్దిష్ట సమయాలను సెట్ చేయండి. మీ పనివేళలు ముగిసిన తర్వాత కూడా వాటిపైనే అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి.
ప్రాధాన్యత ఇవ్వండి:
మీ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి, మీరు చేసే పనిలో ముఖ్యమైనవి ఏమిటో ముందుగా వాటిపై దృష్టిపెట్టండి, ఆ తర్వాత మిగతా వాటిని చూడండి. ఇది మీ పనిని సమర్థవంతంగా నిర్వహించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. మీ పనివేళలు పూర్తయిన తర్వాత, పూర్తిగా మీ వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇవ్వండి.
విరామాలు తీసుకోండి:
పనిచేస్తున్నపుడు విరామాలు తీసుకోవడం తప్పనిసరి. మీ మనస్సు, శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి రోజంతా క్రమం తప్పకుండా విరామం తీసుకోండి. ఇందులో మీ పని నుండి కొన్ని నిమిషాలు దూరంగా ఉండటం, కొద్దిసేపు నడవడం, స్ట్రెచింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఈ విరామాలు మీరు రోజంతా పనిచేశాక మిమ్మల్ని అలసిపోనట్లుగా హుషారుగా ఉంచుతాయి.
ఆనందంగా ఉండండి:
సమతుల్యతను కనుగొనడానికి, మీరు ఆనందించే కార్యకలాపాలను చేయండి. ఇందులోసం మీ హాలిడే షెడ్యూల్‌లో వాటి కోసం సమయాన్ని వెచ్చించడం ముఖ్యం. క్రీడలు ఆడటం, పుస్తకాలు చదవడం లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా సమయం గడపడం వంటి ఏదైనా కావచ్చు.
మీ కోసం సమయాన్ని వెచ్చించండి:
విశ్రాంతి తీసుకోవడానికి, మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోడానికి, మీ అవసరాల కోసం మీకోసం సమయాన్ని వెచ్చించండి. ఇది రిలాక్సింగ్ గా స్నానం చేయడం లేదా నచ్చిన సినిమాలు చూడడం వంటి సాధారణ విషయం ఏదైనా కావచ్చు. సెలవు రోజుల్లో వివిధ పనుల కోసం శ్రమకోర్చి ప్రయాణాలు, చేయడం, మిమ్మల్ని చికాకు పెట్టే పనుల వెంటపడటం మొదలైనవి ఉంటే మళ్లీ పని దినాలు ప్రారంభమయ్యే నాటికి బ్యాటరీ ఆఫ్ అయిపోయి ఉంటారు.
మీ సమయాన్ని గుర్తుంచుకోండి:
సమయం అన్నింటికంటే విలువైనది. మీరు మీ సమయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో గుర్తుంచుకోండి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసేలా సమయాన్ని ఉపయోగించండి. మీ కుటుంబ సభ్యుల, స్నేహితులు మద్ధతు కోరండి. మీకు అప్రధానమైన పనులు మీరే చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.
సంబంధిత కథనం