Chandra Effects On Health। మనిషి ఆరోగ్యంపై చంద్రుడి ప్రభావం ఉంటుందా? కొన్ని ఆసక్తికర విషయాలు ఇవిగో!
Chandra Effects On Health: పౌర్ణమి చంద్రుడు, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావాలకు సంబంధించి పరిశోధకులు కనుగొన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.
Chandra Effects On Health: సూర్యుడు మనకు వెలుగునిస్తాడు, సూర్యుడి ప్రభావం మనుషుల ఆరోగ్యంపై చాలా ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మన శరీరం సహజంగా 'విటమిన్ డి' ని పొందుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ నియంత్రణకు, శరీరంలో కాల్షియం శోషణకు, మెరుగైన నిద్రకు ఇలా అనేక రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. సూర్యుడు సరే, మన భూమిపై చంద్రుడి ప్రభావం కూడా ఉంటుంది. మరి చంద్రుడు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాడా అంటే? పౌర్ణమి నాటి చంద్రుడు ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. పౌర్ణమి చంద్రుడు, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావాలకు సంబంధించి పరిశోధకులు కనుగొన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.
హృదయ స్పందన పెరుగుతుంది
ఇండియన్ జర్నల్ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, చంద్రుని చక్రాలు మనిషి హృదయ స్పందనలపై ప్రభావం చూపుతాయి. పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో వ్యాయామాలు చేస్తున్నప్పుడు హృదయ స్పందనలు సాధారణం కంటే మరింత హెచ్చుగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా వ్యాయామాలు చేసేటపుడు అమావాస్య లేదా పౌర్ణమి రోజు వ్యాయామ తీవ్రత తగ్గించుకోవాలనేది ఆ అధ్యయన ఫలితాల సారాంశం.
మూడ్ స్వింగ్స్‌కి కారణం
భూమిపైన సముద్రాలలో కలిగే ఆటుపోట్లకు చంద్రుడు కారణమైనట్లే, మనిషి మెదడులో ఆటుపోట్లకు కూడా చంద్రుడు కారణం కావచ్చు. మెదడులో నీటి శాతం ఎక్కువ ఉన్నందున, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మీ మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని డచ్ పరిశోధకులు ఊహించారు, ఈ కారణంగా పౌర్ణమి లేదా అమావాస్య రోజున మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయనేది డచ్ పరిశోధకుల అభిప్రాయం.
బ్రిటీష్ శాస్త్రవేత్తలు చేసిన ఇతర అధ్యయనాల ప్రకారం నిండు పౌర్ణమి , మూర్ఛ వ్యాధిగ్రస్తులలో మూర్ఛలు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చని వెల్లడిస్తున్నాయి. చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు, మూర్చ రోగుల్లో ఎపిలెప్టిక్ మూర్ఛలు తక్కువ ఉన్నట్లు వారు గమనించారు. సూర్యుడు అస్తమించినప్పుడు మీ మెదడులో సహజంగా స్రవించే మెలటోనిన్ అనే హార్మోన్ దీనికి కారణమని వారు చెబుతున్నారు, పౌర్ణమ్ రోజు ఈ హార్మోన్ శాంత ప్రభావాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు.
కిడ్నీ నొప్పిలో హెచ్చుతగ్గులు
యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పౌర్ణమి సమయంలో కిడ్నీ స్టోన్ నొప్పి గణనీయంగా పెరిగింది. ఈ సమయంలో ఎక్కువ మంది రోగులు ఆసుపత్రులలో చేరారని కనుగొన్నారు. దీనికి విరుద్ధంగా, అమావాస్య రోజున కిడ్నీలలో నొప్పి నుంచి ఉపశమన ప్రభావాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, కిడ్నీ నొప్పిలో హెచ్చుతగ్గులకు చంద్రుని ప్రభావాలే కారణం అని కచ్చితమైన ఋజువు లేదు, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.
నిద్ర చక్రంలో మార్పులు
కరెంట్ బయాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, చంద్రకాంతి మనిషి నిద్ర విధానాలపై ప్రభావం చూపుతుంది. ప్రకాశవంతమైన చంద్రుడు ఉన్నప్పుడు మెలటోనిన్ స్థాయిలు తక్కువగా ఉండటమే కాకుండా, నిద్రపోవడానికి 5 నిమిషాలు ఎక్కువ సమయం పట్టిందని, అలాగే సాధారణం కంటే 20 నిమిషాలు తక్కువ నిద్రపోతారని పరిశోధకులు గుర్తించారు. రోజూవారీగా కంటే 30 శాతం తక్కువ REM ఉందని పరిశోధకులు నిర్ధారించారు. నిద్రలేమితో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి నిద్ర పొందడానికి మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు.
స్త్రీలలో ఋతుచక్రంపై ప్రభావం
స్త్రీలలో సగటు ఋతు చక్రం 28 రోజులు, ఇది 29+ రోజుల చంద్ర చక్రంతో సమానంగా ఉంటుంది. చైనీస్ పరిశోధకుల ప్రకారం ఈ సమయం యాదృచ్చికం కాకపొవచ్చు, వారి పరిశోధనల్లో భాగంగా కొంతమంది స్త్రీల ఋతుచక్రాలను పర్యవేక్షించారు. దాదాపు వారందరిలో పౌర్ణమి దగ్గరలో అండోత్సర్గము, అమావాస్య సమయంలో ఋతుస్రావం అవుతుందని కనుగొన్నారు. ఈ దృగ్విషయానికి వైట్ మూన్ సైకిల్ అని పేరు కూడా ఉంది. భూమిపైన సంతానోత్పత్తికి చంద్రుడి ప్రభావానికి ఇది అద్దం పడుతుందని చెబుతారు.
సంబంధిత కథనం