Chalimidi: వేసవి వచ్చేస్తోంది, పిల్లలకు ఇలా చలిమిడి చేసి పెట్టండి, చలువ చేస్తుంది
Chalimidi: వేసవి వస్తే శరీరానికి చలువ చేసే ఆహారాన్ని పిల్లలకు ప్రత్యేకంగా తినిపించాలి. లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చలిమిడి చలువ చేస్తుంది. రెసిపీ ఇదిగో.
Chalimidi: చలిమిడి పేరు వింటే పెళ్లిళ్లే గుర్తొస్తాయి. కేవలం పెళ్లిళ్లలోనే చలిమిడిని చేస్తారని అనుకుంటారు. నిజానికి చలిమిడిని ఎప్పుడైనా చేసుకొని తినవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో వారానికి రెండు మూడు సార్లు చలిమిడి పెట్టడం వల్ల చలువ చేస్తుంది. ఇందులో వాడేవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే. కాబట్టి పోషకాలు కూడా అందుతాయి. పిల్లలకి చలిమిడి ఖచ్చితంగా నచ్చుతుంది. నెయ్యితో చలిమిడి చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చలిమిడి రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
చలిమిడి రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - రెండు గ్లాసులు
బెల్లం తురుము - అరకప్పు
జీడిపప్పులు - పది
యాలకుల పొడి - అర స్పూను
నెయ్యి - మూడు స్పూన్లు
పచ్చి కొబ్బరి ముక్కలు - అరకప్పు
చలిమిడి రెసిపీ
1. చలిమిడిని కొందరు బియ్యాన్ని నానబెట్టి, మెత్తని పిండిలా చేసి అప్పుడు తయారు చేస్తారు. అదంతా కష్టమైన ప్రక్రియ.
2. కాబట్టి బియ్యప్పిండిని కొని చలిమిడిని తయారు చేసుకోవచ్చు.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
4. నెయ్యి వేడెక్కాక కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలను వేసి వేయించాలి. తర్వాత జీడిపప్పులు వేయించాలి.
5. ఈ రెండింటిని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆపేయాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి బెల్లం తురుమును వేయాలి.
7. ఆ తురుము మునిగే వరకు నీళ్లు వేయాలి.
8. చిన్న మంట మీద ఉంచితే అది తీగపాకం వస్తుంది.
9. అలా వచ్చినప్పుడు యాలకుల పొడిని, కొబ్బరి ముక్కలను, జీడిపప్పును వేసి కలపాలి.
10. అలాగే బియ్యప్పిండిని జల్లించి ఆ పిండిని ఈ బెల్లం పాకంలో మెల్లగా వేస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి.
11. గరిటతో కలపడం ఆపేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంది.
12. కాబట్టి వేగంగా కలుపుతూనే ఉండాలి. అలా చలిమిడి గట్టిగా తయారయ్యే వరకు పిండిని కలపాలి.
13. స్టవ్‌ను చిన్న మంట మీదే ఉంచాలి.
14. చలిమిడి ఘుమఘుమలాడుతూ రెడీ అయిపోతుంది.
15. పైన రెండు స్పూన్ల నెయ్యిని వేసి మళ్లీ కలపండి. చలిమిడి రెడీ అయినట్టే.
16. దీన్ని ఇది వారం రోజులు పాటు తాజాగా ఉంటుంది.
17. గాలి తడి తగలకుండా చూసుకోవాలి. చలిమిడి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
దీని తయారీలో మనము బియ్యము, బెల్లము, పచ్చికొబ్బరి, జీడిపప్పు, నెయ్యి వంటివి వినియోగించాం. బియ్యం వల్ల శక్తి అందుతుంది. నెయ్యి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెల్లం తినడం వల్ల ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. పచ్చికొబ్బరి జీడిపప్పుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చేరుతాయి. కాబట్టి చలిమిడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పచ్చి కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం వంటి సమస్యలు రావు. మానసిక ఆరోగ్యానికి కూడా పచ్చికొబ్బరి చాలా అవసరం. దీనిలో సెలీనియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఆనంద హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా పచ్చి కొబ్బరి ముందుంటుంది. నిద్ర కూడా చక్కగా పట్టేలా చేస్తుంది. కాబట్టి చలిమిడి తయారీలో పచ్చికొబ్బరిని ఎక్కువగా వేసుకుంటే మంచిది. పంటి కింద కూడా తగులుతూ టేస్టీగా ఉంటాయి.
చలిమిడిని ఒకసారి తయారు చేసి పిల్లలకు తినిపించండి. వారు ఇష్టంగా తింటారు. వేసవిలో నెలలో కనీసం నాలుగైదు సార్లు చలిమిడి తినేందుకు ప్రయత్నించండి. చలిమిడి రెసిపీ చాలా సులువు.
టాపిక్