Kaju rawa idli: ఇన్స్టంట్ రవ్వ జీడిపప్పు ఇడ్లీ..పది నిమిషాల్లో రెడీ..
Kaju rawa idli: అప్పటికప్పుడే చేసుకునే ఇన్స్టంట్ ఇడ్లీకి, జీడిపప్పు జోడించి చేసే కాజూ రవ్వ ఇడ్లీ తయారీ చూసేయండి.
కాజూ రవ్వ ఇడ్లీ (Unsplash)
ఇడ్లీ అంటే చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. పక్కన సాంబార్, చట్నీ ఉంటే ఎన్ని ఇడ్లీలైనా తినేస్తారు. అయితే పిండి పులియబెట్టే సమయం లేకపోతే వెంటనే తయారుచేసుకునే ఇడ్లీలు కూడా రుచిలో బాగుంటాయి. వాటికి జీడిపప్పు రుచి జతచేసి చేసుకుంటే తింటుంటూ నోట్లో మంచి రుచి తగులుతుంది. కాజూ రవ్వ ఇడ్లీ ఎలా తయారుచేసుకోవాలో చూసి, ఒకసారి ప్రయత్నించి చూడండి.
కావాల్సిన పదార్థాలు:
అరకప్పు జీడిపప్పు
ఒకటిన్నర కప్పుల రవ్వ
1 చెంచా జీలకర్ర
2 పచ్చిమిర్చి, తరుగు
కొద్దిగా కొత్తిమీర, తరుగు
తగినంత ఉప్పు
4 నుంచి 5 మిరియాలు, బరకగా దంచుకోవాలి
1 కరివేపాకు రెబ్బ
1 కప్పు పెరుగు
4 చెంచాల నెయ్యి
1 చెంచా ఆవాలు
తయారీ విధానం:
- ముందుగా పెద్ద గిన్నెలో రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, మిరియాలు, కరివేపాకు, పెరుగు, రెండు కప్పుల నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి.
- ఒక ప్యాన్ పెట్టుకుని వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి. అందులో ఆవాలు, జీడిపప్పు ముక్కలు వేసి వేయించాలి.
- ఇప్పుడ రవ్వ మిశ్రమంలో ఈ తాలింపును కలుపుకోవాలి. ఒక పదినిమిషాలు పిండిని పక్కన పెట్టుకోవాలి.
- కడాయిలో కాస్త నెయ్యి తీసుకుని జీడిపప్పు సగం ముక్కలు చేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇడ్లీ పాత్రలో రవ్వ మిశ్రమం వేసుకోవాలి. మీద జీడిపప్పు ముక్కలు పెట్టుకోవాలి. పది నుంచి పదిహేను నిమిషాలు ఆవిరి మీద ఉడికాక ఇడ్లీలు సిద్ధం అవుతాయి.
- ఈ ఇడ్లీలను కొబ్బరి లేదా టమాటా చట్నీతో సర్వ్ చేయండి.