Fatty Liver Disease: పంచదారను ప్రతిరోజూ తినడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందా? వైద్యులు ఏం చెబుతున్నారు?-can eating sugar every day cause fatty liver disease what are the doctors saying ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fatty Liver Disease: పంచదారను ప్రతిరోజూ తినడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Fatty Liver Disease: పంచదారను ప్రతిరోజూ తినడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Haritha Chappa HT Telugu
Jun 09, 2024 09:30 AM IST

Fatty Liver Disease: మనకు శరీరంలో కాలేయం ముఖ్యమైన భాగం. దీని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

పంచదారతో కాలేయ వ్యాధులు
పంచదారతో కాలేయ వ్యాధులు (Pixabay)

Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి... ఆల్కహాల్ తాగడం వల్ల వస్తుంది. ఇక రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్... ఆల్కహాల్ తాగని వారిలో కూడా వచ్చే కాలేయ వ్యాధి ఇది. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి బారినపడి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడేలా చేసే ఆహారాలలో పంచదార ఒకటని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అనేది ఆల్కహాల్ తాగని వారిలో వస్తుంది. కాలేయంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల వచ్చే వ్యాధి ఇది. ఇలా కాలేయంలో కొవ్వు అధికంగా చేరడానికి ఆల్కహాల్ మాత్రమే కారణం కాదు, చక్కెర కూడా కారణమే అంటున్నారు వైద్య నిపుణులు.

పంచదారతో కాలేయ వ్యాధి

పంచదారను ప్రాసెస్ చేసిన ఆహారంగా చెబుతారు. అంటే అది నేరుగా మొక్కల నుండి పండదు. అనేక రకాల ప్రక్రియలకు గురైన తర్వాత చక్కెర రూపాన్ని పొందుతుంది. కాబట్టి ఇది ప్రాసెస్ చేసిన ఆహారం. చక్కెరను ముఖ్యంగా ఫ్రక్టోస్ రూపంలో మనం తీసుకుంటాము. అంటే పంచదారతో చేసిన ఆహారాలు తినగానే అది ఫ్రక్టోస్ రూపంలో కాలేయానికి చేరుతుంది. అక్కడ కొవ్వుగా మారుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి సహాయపడుతుంది. ఇలా దీర్ఘకాలంగా జరగడం వల్ల కాలేయ వాపుకు వ్యాధికి దారి తీయవచ్చు. కాలేయం దెబ్బతినవచ్చు. ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు రావచ్చు. ఇదే చివరికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ బారిన పడేలా చేస్తుంది.

కొన్ని అధ్యయనాలు పంచదార అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ బారినపడే అవకాశం ఉన్నట్టు నిర్ధారించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం చక్కెర తక్కువ తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు చాలా వరకు తగ్గుతుందని నిరూపణ అయింది. దీన్నిబట్టి చక్కెర వినియోగాన్ని తగ్గిస్తే కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

ఏం తినాలి?

చక్కెర ఉండే పదార్థాలు అంటే స్వీట్లు, సోడాలు, పంచదార కలిపిన పండ్ల రసాలు, కూల్ డ్రింకులు, మైదాతో చేసిన ఆహారాలు వంటివి ఈ జాబితాలోకి వస్తాయి. వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. పానీయాలను దూరం పెట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ ఉంటే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.

పంచదార శరీరంలో చేరాక కాలేయాన్ని అనేక రకాలుగా దెబ్బతీస్తుంది. ఇది ఫ్రక్టోజ్ రూపంలో కొవ్వుగా మారి కాలేయంలో పేరుకుపోతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. అధిక చక్కెర వినియోగం వల్ల ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల శరీర కణాలు ఇన్సులిన్ ను తక్కువగా సూచించుకుంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగేందుకు దారితీస్తాయి. దీనివల్ల కాలేయంలో కొవ్వు నిల్వ ఉండడమే కాదు మధుమేహం బారిన కూడా పడే అవకాశం ఉంది.

Whats_app_banner