Sugar: పంచదార తినడం అంత ప్రమాదకరమా? రోజుకు ఒక మనిషి ఎంత చక్కెరను తినవచ్చు?
Sugar: పంచదారను తినకూడదని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా రోజూ పంచదార వేసుకొని టీ, కాఫీ, పాలు, స్వీట్లు తినే వారి సంఖ్య ఎక్కువే. పంచదార ఎందుకు తినకూడదో తెలుసుకోండి.
Sugar: ఉదయం లేచిందే టీ లేదా కాఫీతో చక్కెరను వాడడం మొదలు పెడతారు ఎంతోమంది. ఆ తర్వాత చేసే వంటల్లో, స్వీట్లలో కూడా కాస్త చక్కెరను వాడేవారు ఉన్నారు. ఎన్నో కూరగాయల్లో, బియ్యంలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఇక అదనంగా ప్రాసెస్ చేసిన పంచదారను వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నట్టు పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పంచదారను తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. పంచదారను తినడం అంటే నేరుగా ఒక స్పూను చక్కెరను తీసి నోట్లో వేసుకోవడం కాదు... పంచదారతో చేసిన ఏ ఆహారాలనూ తిన్నా చక్కెరను తిన్నట్టే లెక్క.
పంచదారతో కలిగే హాని
చక్కెర తినడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు. చక్కెర వల్ల ఎక్కువ క్యాలరీలు శరీరంలో చేరుతాయి. ఇది ప్రాసెస్ చేసిన ఆహారం. అతిగా శుద్ధి చేసిన ఆహారం ఏదైనా బరువు పెరగడానికి దోహదపడుతుంది. ఆరోగ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనిలో ఎలాంటి పోషకాలు ఉండవు. చక్కెరను తినడం వల్ల పూర్తిగా నష్టాలే, కానీ ఎలాంటి లాభాలు లేవు. చక్కెరకు బదులు బెల్లం, తేనె వంటివి వాడడం చాలా ఉత్తమం.
రోజుకు ఎంత తినాలి?
పంచదారను రోజుకు 30 గ్రాములు కంటే ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అందులోనూ చక్కెర ఇతర ఆహారాలలో కూడా సహజంగా నిండి ఉంటుంది. దాంతో కలుపుకొని ప్రతిరోజూ 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తినకపోవడమే ఉత్తమం.
చక్కెరతో చేసిన ఆహారాలు తినడం వల్ల నోటి ఆరోగ్యం పాడవుతుంది. దంతాలు కూడా త్వరగా క్షీణిస్తాయి. అలాగే అధిక రక్తపోటు, ట్రై గ్లిజరైడ్స్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయి. వీటివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పంచదార కలిపిన పానీయాలు, పదార్థాలు రుచిగా ఉన్నా కూడా అవి శరీరానికి చేసే నష్టం ఎంతో. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. అలాంటి ఆహారాన్ని తినాల్సిన అవసరం లేదు. చక్కెరకు బదులు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తింటే మంచిది. పంచదారను తినడం మానేస్తే అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పంచదార తినడం వల్ల టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారు చక్కెరను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో చిరాకు, కోపం వంటివి ఎక్కువగా వస్తాయి. మూడ్ స్వింగ్స్ కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఏ విషయంపైనా ఏకాగ్రత కుదరదు. చర్మం కూడా పేలవంగా మారి పొడిగా అవుతుంది. ఏజింగ్ లక్షణాలు త్వరగా వస్తాయి. చర్మంపై ముడతలు గీతలు వంటివి పడే అవకాశం ఉంది.
ఎవరైతే ప్రతిరోజూ తీపి పదార్థాలను, చక్కెరను అధికంగా ఆహారంలో భాగం చేసుకుంటారో వారికి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రావచ్చు. జీర్ణక్రియ ఇబ్బందుల పాలవుతుంది. మలబద్ధకం వంటి సమస్య వస్తుంది. కాబట్టి పంచదారను పూర్తిగా వాడడం మానేయడమే మంచిది. అంతగా మీకు స్వీట్లు తినాలనిపిస్తే బెల్లంతో చేసినవి తినడం మంచిది. అలాగే తేనెను ప్రతిరోజు ఒక స్పూను తాగితే మీకు చక్కెర తినాలన్న కోరిక తగ్గిపోతుంది.
టాపిక్