Sprouts Pulao: బ్రేక్ ఫాస్ట్‌లో మొలకల పులావ్ ట్రై చేయండి, డయాబెటిస్ ఉన్నవారికి బెస్ట్ ఫుడ్ ఇది
Sprouts Pulao: డయాబెటిస్ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్‌లో ఏం తినాలని ఆలోచిస్తూ ఉంటారు. ఓసారి మొలకల పులావ్ ను తిని చూడండి. ఆ రోజంతా వారు ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. ఆకలి కూడా ఎక్కువగా వేయదు.
Sprouts Pulao: డయాబెటిస్ పేషెంట్లు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ విషయంలో వారు ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను తినాల్సిన అవసరం ఉంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తింటే వారికి రోజంతా శక్తి అందుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఒకసారి మొలకల పులావును ప్రయత్నించండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటిస్ ఉన్నవారే కాదు, డయాబెటిస్ లేని వారూ.. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలే జరుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, హైబీపీ ఉన్నవారికి, గుండె జబ్బులు ఉన్నవారికి... ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్. దీన్ని చేయడం చాలా సులువు.
మొలకల పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
మొలకలు - అరకప్పు
బ్రౌన్ రైస్ - ఒక కప్పు
క్యాప్సికం - ఒకటి
బీన్స్ - నాలుగు
టమాటోలు - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - మూడు
పసుపు - అర స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
కారం - అర స్పూను
అల్లం తరుగు - ఒక స్పూన్
ధనియాల పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
మొలకల పులావ్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
3. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.
4. అల్లం, వెల్లుల్లి తరుగును కూడా వేసి వేయించుకోవాలి.
4. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికం, బీన్స్ వేసి వేయించాలి.
5. అలాగే ఉప్పును కూడా వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన టమోటోలను వేసి వేయించుకోవాలి.
6. ఇవన్నీ మెత్తగా అయ్యేవరకు మూత పెట్టి ఉడికించాలి.
7. తర్వాత ఆ మిశ్రమంలో పసుపు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి వేసి చిన్న మంట మీద పెట్టాలి.
8. అది ఇగురులాగా అయ్యాక మొలకలను వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
9. బ్రౌన్ రైస్‌ను ముందుగానే వండి పెట్టుకోవాలి.
10. ఈ మొలకలు కాస్త ఉడికాక ఈ బ్రౌన్ రైస్ ను వేసి బాగా కలుపుకోవాలి.
11. అంతే స్టవ్ కట్టేయాలి. ఆరోగ్యకరమైన మొలకల పలావు రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
మొలకల పలావును ఒక కప్పు తింటే చాలు, పొట్ట నిండిపోతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవద్దు. ఒక మనిషి ఒక కప్పు మొలకల పలావు మాత్రమే తినగలరు. ఎందుకంటే దీనిలో ప్రోటీన్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. దానివల్ల ఒక కప్పుకి పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఈ మొలకల పలావ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ. అలాగే డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు ఉన్న వారికి ఇది ఉత్తమ రెసిపీ అని చెప్పాలి.