Blowing the conch: ప్రతిరోజూ కాసేపు శంఖం ఊదండి, అది మీ శ్వాసకోశ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో
Blowing the conch: శంఖం ఆధ్యాత్మికమైనది. అలాగే ఈ శంఖం ఊదడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఐదు నిమిషాలు శంఖం ఊదండి చాలు.
Blowing the conch: శంఖం పుట్టుకే ఎంతో పవిత్రమైనది. సముద్రాన్ని అమృతం కోసం రాక్షసులు, దేవతలు కలిసి మధిస్తున్న సమయంలోనే శంఖం పుట్టింది. శ్రీమహావిష్ణువు చేతిలో శంఖం ఉంటుంది. లక్ష్మీదేవితో కలిసే శంఖం జన్మించింది. కాబట్టి దాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు. శంఖం నుంచి వచ్చే శబ్దం పరమ పవిత్రంగా భావిస్తారు.
కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు శంఖాలను పూరించే తమ యుద్ధాన్ని ప్రారంభించారు. శంఖం నుంచి వెలువడే శబ్దం ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని అంటారు. శంఖం నుంచి వచ్చే శబ్దం సంగతి పక్కన పెడితే, శంఖాన్ని ఊదడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం వివరిస్తోంది. ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు శంఖం ఊదితే చాలు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
శంఖం వల్ల ఉపయోగాలు
ఆయుర్వేదంలో శంఖం ఊదడం అనేది ప్రాణాయామంతో సమానం. అదొక నియంత్రిత శ్వాస పద్ధతిగా చెబుతారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. శంఖాన్ని ఊదినపుడు లోతైన శ్వాసను తీసుకోవలసి వస్తుంది. ఇది ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచుతుంది. అలాగే శ్వాసకోశ సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు శంఖం ఊదడం వల్ల ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశవ్యాధులు ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శ్వాసకోశ కండరాలు బలంగా మారుతాయి. శరీరం అంతా ఆక్సిజన్ ప్రసరిస్తుంది.
శంఖాన్ని ఊదడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. లోతైన లయబద్ధమైన శ్వాసను శంఖం ఊదేటప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయి. మనసుకు, శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి. ధ్యానం చేయడంతో సమానమైన ఫలితాలను శంఖం ఊదడం వల్ల పొందవచ్చు. మానసిక స్పష్టత, భావోద్వేగ నియంత్రణ వంటి వాటిపై పట్టు దొరుకుతుంది.
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం శంఖం ఊదడం వల్ల శరీరంలో ఎన్నో దోషాలు పోతాయి. ముఖ్యంగా వాత, కఫ దోషాలు సమతుల్యం అవుతాయి.
శంఖాన్ని కేవలం ఆధ్యాత్మిక దృక్కోణం నుండి మాత్రమే కాదు ఆరోగ్యం వైపు నుండి వినియోగించుకోవాలి. శంఖాన్ని ఊదేటప్పుడు దాన్ని చేత్తో గట్టిగా పట్టుకోండి. తల కాస్త పైకి ఎత్తి శంఖం ఊదేందుకు ప్రయత్నించండి. ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకుని మొదట మీ ఊపిరితిత్తులను నింపండి. ఇది శంఖం ఊదేందుకు శ్వాసకోశ వ్యవస్థను సిద్ధం చేస్తుంది. అప్పుడు బలంగా శంఖాన్ని ఊదండి. ఇలా ఊదితే ఊపిరితిత్తులకు కూడా మంచి వ్యాయామంలా ఉంటుంది.
శంఖాన్ని దీర్ఘ శబ్దం వచ్చేలా ఊదాలి. అంటే చిన్న చిన్నగా ఊది వదిలేయడం కాదు. గాలి లోపలికి ఒక్కసారిగా పీల్చుకొని ఎక్కువ సేపు శంఖం శబ్దం వచ్చేలా ఊదితే అది మంచి వ్యాయామంగా మారుతుంది. శ్వాసకోశ సమస్యలూ తగ్గుతాయి.