Breath Shortness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా? ఇలా తక్షణ ఉపశమనం..-simple techniques to reduce breath shortness problem ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breath Shortness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా? ఇలా తక్షణ ఉపశమనం..

Breath Shortness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా? ఇలా తక్షణ ఉపశమనం..

HT Telugu Desk HT Telugu
Oct 02, 2023 03:00 PM IST

Breath Shortness: ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలి. అవి ప్రమాదం నుంచి మనల్ని బయటపడేస్తాయి.

శ్వాస ఇబ్బంది తగ్గించే చిట్కాలు
శ్వాస ఇబ్బంది తగ్గించే చిట్కాలు (pexels)

మన శరీరంలో ఉండే కొన్ని వ్యాధులు, సమస్యల వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఊపిరితిత్తుతలకు గాలి అందక చెప్పలేనంత ఇబ్బందికరంగా ఉంటుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఒక్కోసారి ఇది ప్రాణాపాయ స్థితికీ దారి తీస్తుంది. దీనిలో ఓ రకం కొద్ది సమయం పాటు వస్తుంది. ఒక్కసారిగా వేడి గది నుంచి చల్లటి ప్రదేశంలోకి రావడం, ఎక్కువ ఉష్ణోగ్రతలో మార్పులు ఉండటం, భయపడటం, ఆందోళనకు గురి కావడం, ఆకాశంలో ఎత్తుకు వెళ్లడం.. లాంటి వాటి వల్ల కొద్ది సేపు శ్వాస ఆడక పోవడం జరగొచ్చు. అదే లంగ్‌ క్యాన్సర్‌, కోవిడ్‌ 19, న్యుమోనియా లాంటి వాటి వల్ల కొన్ని రోజుల నుంచి దీర్ఘకాలంపాటు ఈ సమస్య వస్తుంటుంది.

కొన్ని మెడికల్‌ ఎమర్జన్సీ సమయాల్లోనూ శ్వాస ఆడకపోవడం అనేది తలెత్తవచ్చు. ఆస్తమా ఎటాక్‌, అలర్జిక్‌ రియాక్షన్‌, బీపీ సడెన్‌గా తగ్గిపోవడం, హార్ట్‌ ఎటాక్‌, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం లాంటి వాటి వల్లా ఇది కలగవచ్చు. ఆ సమయంలో పెదవులు నీలం రంగులోకి మారిపోవడం, గుండెల్లో పట్టేసినట్లు ఉండటం, ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. వైద్యుల్ని సంప్రదించాలి. లేదంటే ప్రాణాపాయ స్థితి కలగవచ్చు.

అదే లక్షణాలు కొంచెం తక్కువగా ఉన్నట్లయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాయామం చేసిన తర్వాత, ఎక్కువగా పరిగెత్తడం లాంటివి చేసిన తర్వాత కొందరికి ఆయాసంగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ‘పర్సడ్‌ లిప్‌ బ్రీథింగ్‌’ని ప్రాక్టీస్‌ చేయాలి.

పర్సడ్‌ లిప్‌ బ్రీథింగ్‌ :

  • మెడ, భుజాల్లోని కండరాలను రిలాక్సింగ్‌గా ఉంచాలి.
  • నోటిని మూసి, ముక్కుతో రెండు సార్లు గాలి పీల్చాలి.
  • విజిల్‌ వేసేప్పుడు పెదవుల్ని గుండ్రంగా పెడతారు కదా. అలా పెట్టి ఆ శ్వాసను మెల్లిగా నాలుగు సార్లు వదిలేయాలి.

మరి కొన్ని చిట్కాలు:

  • కుర్చీలో కూర్చున్నప్పుడు తలను నేలవైపు పెట్టి కాస్త ముందుకు వంగి కూర్చోండి. కాళ్లను నేలపై సమానంగా ఉంచండి. ఈ సమయంలో భుజాలు, మెడ కండరాలు రిలాక్సింగ్‌గా ఉండేలా చూసుకోండి.
  • మంచం మీద వెల్లకిలా పడుకోవడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. బదులుగా కుర్చీలో కూర్చుని టేబుల్‌ మీద తలగడ పెట్టుకుని దానిపై తల వాల్చండి. చేతుల్ని టేబుల్‌పై పెట్టుకుని చూడండి. దీన్ని ట్రైపోడ్‌ బ్రీథింగ్‌ అంటారు. ఈ పొజిషన్‌లో ఊపిరితిత్తుల్లో గాలి తీసుకోవడానికి ఎక్కువ స్పేస్‌ ఏర్పడుతుంది.
  • నిలబడినప్పుడు చేతుల్ని టేబుల్‌ పై ఆనించి కాస్త ముందుకు వంగి ఉండటం వల్లా శ్వాస మెరుగవుతుంది.

Whats_app_banner