Friday Motivation: మనోనిగ్రహం ఉంటే విజయం అందుకోవడం సులువే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు
Friday Motivation: మనోనిగ్రహం లేకే ప్రపంచంలో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. మనోనిగ్రహమే ఉంటే యుద్దాలే ఉండవు. ప్రతిచోట శాంతి, సామరస్యతే ఉంటుంది.
Friday Motivation: మనోనిగ్రహం ఉంటే మనసును ఆధీనంలో పెట్టుకోవడం. మనసును కోతితో పోలుస్తారు. దాని ఆలోచనలకు అదుపు ఉండదు. సెకన్ల కాలంలోనే మనసు చేసే ఆలోచన ఖండాంతరాలు దాటిపోతుంది. దాన్ని అదుపులో పెట్టుకుంటే మన జీవితం మన అదుపులో.. మనం గీసిన హద్దుల్లోనే ఉంటుంది. కానీ మనోనిగ్రహం లేకే ఎంతోమంది నష్టపోతున్నారు. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ఆగుతాయి.
మనోనిగ్రహం గురించి భగవద్గీతలో కూడా చర్చ జరిగింది. శ్రీకృష్ణార్జునులు మధ్య మనోనిగ్రహం గురించి వాదోపవాదాలు జరిగాయి. అర్జునుడు శ్రీకృష్ణునితో మాట్లాడుతూ మనోనిగ్రహం సాధించడం చాలా కష్టమని అన్నాడు. దాన్ని సాధిస్తే వాయువును గుప్పెట్లో పట్టినట్టేనని, కానీ వాయువును నిరోధించడం ఎవరితరమూ కాదని చెప్పాడు. అలాగే మనసును ఒకే విషయంపై నిగ్రహించడం కూడా కష్టమని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడో తెలుసా... ‘నిజమే... చంచలమైన మనస్సును అదుపులో పెట్టడం చాలా కష్టం. కానీ తగిన శిక్షణతో సంకల్పంతో దాన్ని సాధించవచ్చు’ అని.
మనసు అదుపులో పెట్టడం అంటే మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవడమే. గడిచిపోయిన విషయాలను తలచుకోవడం మానేయాలి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించడం ఆపాలి. ఈ రెండూ చేస్తే మనసు వర్తమానంలోనే ఉంటుంది. అప్పుడు మనోనిగ్రహం కూడా వస్తుంది. నిజానికి మనసు ప్రస్తుత విషయాలను పక్కకు పెట్టి జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తుంది. అందుకే ఎక్కువమంది అనుకున్న పనులు సాధించలేక అపజయం పాలవుతూ ఉంటారు.
గతాన్ని తలుచుకోవడం వల్ల కలిగేది కష్టమే తప్ప, భవిష్యత్తులో ఏదో వస్తుందని భయపడడం కూడా ఇప్పటి కాలాన్ని నిరాశలోకి తోసేస్తుంది. కాబట్టి వర్తమానంపై దృష్టి పెడితే విజయం అందుకోవడం సులభం. ఆ పని చేయాలంటే ముందుగా మనోనిగ్రహానికి సాధించాలి.
ప్రతిరోజూ ధ్యానం, యోగా వంటి అభ్యాసాలను చేయడం మంచిది. అధిక ఆలోచనలను పక్కన పెట్టాలి. ఆలోచన వస్తున్నప్పుడు ఏదో ఒక పనిలో బిజీ అయిపోవాలి. మానసిక ఆందోళనలు, మానసిక చింత వంటి వాటిని వదిలిపెట్టాలి. జీవితంలో ఉత్సాహం నిండేలా చేసుకోవాలి. మిమ్మల్ని మీరు బిజీ చేసుకోవడం ద్వారా మనస్సును అదుపులో పెట్టుకుని అవకాశం ఉంటుంది. మనసును అదుపులో పెట్టుకున్నారంటే మీ జీవితం మీ చేతుల్లో ఉన్నట్టే.