Blood Tests: ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి తప్పకుండా చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు ఇవే
Blood Tests: ఎప్పుడు ఏ అనారోగ్యం వచ్చి పడుతుందో తెలియని కాలం ఇది. కాబట్టి ముందుగానే కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చు.
Blood Tests: ఎలాంటి అనారోగ్యాలైన ప్రాథమిక దశలో గుర్తిస్తే వాటికి చికిత్స చేయడం చాలా సులభం. కానీ ముదిరిపోయాక వాటిని గుర్తిస్తే మాత్రం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. అందుకే మీ ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ప్రతి ఏడాది కొన్ని రక్త పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలి. ఇందులో మీ ఆరోగ్య పరిస్థితి బయటపడుతుంది. అలాగే ఏవైనా పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ముందుగానే ఈ రక్త పరీక్షలు ద్వారా తెలుసుకోవచ్చు. ఆ రక్తపరీక్షలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC)
కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్ లెట్ల సంఖ్యను చెప్పే ఒక సమగ్ర పరీక్ష. ఇది మీ రక్త ఆరోగ్యం గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. రక్తహీనత ఉన్నా, ఇన్ఫెక్షన్ బారిన పడినా, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా కూడా ఈ పరీక్ష ద్వారా తెలిసిపోతుంది. ప్రత్యేకంగా సిబిసి పరీక్ష చేయించుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా తెలుస్తాయి. వీటిలో అసాధారతలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
లిపిడ్ ప్రొఫైల్
లిపిడ్ ప్రొఫైల్ అనేది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను చెప్పే పరీక్ష. ఇది గుండె ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. ఈ పరీక్ష కొలెస్ట్రాల్ ఎంతుందో చెప్పడంతో పాటు, లిపో ప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఎంతుందో, మంచి కొలెస్ట్రాల్ ఎంతుందో అనేది కూడా చెబుతుంది. గుండెకు హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ సంఖ్యను కొలుస్తుంది. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షించడం ద్వారా వాటి స్థాయిని తెలుసుకోవచ్చు. తద్వారా గుండె ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (Hb1Ac)
రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేసే పరీక్ష ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. దీన్ని Hb1Ac అంటారు. ఇది ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ వ్యాధులను పరీక్షించడానికి వినియోగిస్తారు. డయాబెటిస్ రావడానికి ముందు దశ ప్రీ డయాబెటిస్. ఈ దశలో ముందే గుర్తిస్తే డయాబెటిక్‌గా మారక ముందే జాగ్రత్త పడొచ్చు. రాత్రిపూట ఆహారం తిన్నాక 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. ఉదయం లేచాక Hb1Ac టెస్ట్ చేయించుకోవాలి. ఇది మీ గ్లూకోజ్ స్థాయిలు గత మూడు నెలల్లో ఎలా ఉన్నాయో అంచనా వేసి చెబుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్టు లెక్.క లేదా ప్రీ డయాబెటిస్ ఉన్న సంగతిని కూడా ఇది ముందే చూపిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, నరాలు దెబ్బ తినడం వంటివి రాకుండా కాపాడుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే వచ్చే రోగాలు ఇవే.
థైరాయిడ్ ఫంక్షన్ పరీక్ష
థైరాయిడ్ గ్రంధి పనితీరును అంచనా వేసే పరీక్ష ఇది. థైరాయిడ్ గ్రంధి జీవక్రియకు, శక్తి ఉత్పత్తికి, వివిధ శారీరక విధులను నియంత్రించడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును అంచనా వేయడానికి ఈ థైరాయిడ్ పరీక్షను చేయాలి. థైరాయిడ్ హార్మోన్లైన T4, T3 స్థాయిలను ఈ పరీక్షల్లో కొలుస్తారు. అవి అధికంగా ఉంటే సమస్యలు ఉన్నట్టే లెక్క. థైరాయిడ్ పరీక్ష ద్వారా హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఉన్నాయో లేవో తెలిసిపోతుంది. ఈ రెండూ కూడా హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే వ్యాధులు.
CMP పరీక్ష
కాంప్రహెన్సివ్ మెటబాలిక్ పానెల్... దీన్నే CMP అంటారు. వివిధ జీవక్రియ పనులను అంచనా వేయడంతో పాటు, అవయవ పనితీరును అంచనా వేసే ఒక సమగ్ర రక్త పరీక్ష ఇది. ఈ పరీక్షలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలతో పాటు, ఎలక్ట్రోలైట్స్ అయినా సోడియం, పొటాషియం, క్లోరైడ్ బై కార్బోనేట్ స్థాయిలను కూడా అంచనా వేయొచ్చు. మూత్రపిండాల పనితీరును, కాలేయ పనితీరును, ప్రోటీన్స్ స్థాయిలను కూడా ఇది అంచనా వేసి చెబుతుంది. ఈ పరీక్ష ద్వారా మూత్రపిండాలు, కాలేయం పనితీరును ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు.
టాపిక్