Black Mutton Curry: నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది, రెసిపీ చాలా సులువు
Black Mutton Curry: మటన్ కర్రీ అంటే ఎంతో మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇక్కడ మేము చెప్పినట్టు బ్లాక్ మటన్ కర్రీ రెసిపీ ప్రయత్నించింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు దట్టించి వేసే ఈ కర్రీ నోరూరించేలా ఉంటుంది.
Black Mutton Curry: బ్లాక్ మటన్ కర్రీ అనగానే నల్లగా ఉన్న గొర్రెను వండడం అనుకోకండి, సాధారణ మటన్ కర్రీని కాస్త ముదురు రంగులో వచ్చేట్టు వండుతాము. మిరియాలు, లవంగాలు, ధనియాలు, గసగసాలు...ఇలా అన్ని మసాలా దినుసులను దట్టించి టేస్టీగా చేసే వంటకం ఇది. నాన్ వెజ్ ప్రియులు ఇది చాలా నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే ఎంతో ఇష్టంగా తింటారు. బట్టర్ చికెన్, మలై చికెన్ తింటున్నట్టే బ్లాక్ మటన్ కర్రీ కూడా ఎంతోమందికి నచ్చుతుంది. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఒకసారి బ్లాక్ మటన్ కర్రీ రెసిపీ వండి వడ్డించండి. వారు మిమ్మల్ని మర్చిపోకుండా ఉండలేరు.
బ్లాక్ మటన్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ ముక్కలు - ముప్పావు కిలో
పసుపు - అర స్పూను
ఉల్లిపాయలు - రెండు
ధనియాలు - ఒక స్పూను
యాలకులు - నాలుగు
లవంగాలు - నాలుగు
సోంపు - ఒక స్పూను
ఎండు కొబ్బరి తురుము - అరకప్పు
అల్లం తురుము - ఒక స్పూను
చింతపండు రసం - ఒక స్పూను
పుదీనా తరుగు - రెండు స్పూన్లు
పెరుగు - ఒక కప్పు
నూనె - నాలుగు స్పూన్లు
గసగసాలు - ఒక స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
మిరియాలు - నాలుగు
ఎండుమిర్చి - మూడు
బిర్యానీ ఆకు - ఒకటి
వెల్లుల్లి తరుగు - ఒకటిన్నర స్పూను
బంగాళదుంపలు - రెండు
కసూరి మేతి - ఒక స్పూను
బ్లాక్ మటన్ కర్రీ రెసిపీ
1. మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి.
2. గోరువెచ్చని నీటితో కడిగితే ముక్కలు మరింతగా శుభ్రపడతాయి.
3. ఆ గిన్నెలో పసుపు, పెరుగు, ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేయండి. ఒక అరగంట పాటు పక్కన పెట్టండి.
4. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో మటన్ మిశ్రమాన్ని వేసి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, నూనె వేసి ఉడకడానికి సరిపడా నీళ్లను పోసి ఉడికించండి.
5. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టాక ఒక విజిల్ వచ్చేదాకా ఉడికిస్తే సరిపోతుంది.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
7. ఆ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, సోంపు, యాలకులు, ఎండు కొబ్బరి, అల్లం, గసగసాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించండి.
8. ఆ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోండి.
9. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి బిర్యానీ ఆకులు వేసి వేయించండి.
10. తర్వాత వెల్లుల్లి, అల్లం తరుగును వేయండి.
11. అవి రంగు మారాక ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేసి కలుపుకోండి.
12. తర్వాత ఉడికించిన మటన్ ముక్కలను వేసి బాగా కలపండి.
13. ఇప్పుడు ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపండి.
14. చింతపండు రసాన్ని కూడా వేసి ఉడకడానికి కాస్త నీళ్లు వేసి బాగా ఉడికించండి.
15. ఇది ఇగురులాగా అయ్యేవరకు ఉడికించండి. తర్వాత పుదీనా తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి.
16. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా దినుసులు, ఉల్లిపాయలు బాగా వేయించి మెత్తగా పేస్ట్ చేయడం వల్ల ఈ కర్రీకి కాస్త నలుపు రంగు వస్తుంది. నోరూరించేలా ఉంటుంది ఈ కర్రీ.
మటన్ ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. ముదురు మటన్ అయితే కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. లేకపోతే ఒక విజిల్ తో ఆపేయొచ్చు. ఈ బ్లాక్ మటన్ కర్రీని వేడి వేడి అన్నంలో తిన్నా లేక చపాతీ, రొటీన్ లో తిన్నా టేస్టీగా ఉంటుంది.